- పేరుకు ఐపీఎస్ అధికారి..అన్నీ చట్టవిరుద్ధ పనులే
- సినీనటి జెత్వానీ కేసులో అరెస్ట్ చేసిన సీఐడీ అధికారులు
- ఏడు గంటలపాటు సుదీర్ఘ విచారణ
- ఇంటిలిజెన్స్ బాస్ హోదాలో నాడు జగన్ చెప్పాడని గలీజు పనులు
- టీడీపీ నేతలకు వేధింపుల్లో వ్యూహకర్త
- సస్పెన్షన్‌లో ఉన్నా జగన్ పార్టీ సేవలోనే
విజయవాడ (చైతన్యరథం): వైసీపీ హయాంలో జగన్‌ని నమ్ముకుని చట్ట వ్యతిరేక పనులు చేసిన మరో ఐపీఎస్ అధికారి అరెస్టయ్యారు. ఐపీఎస్ అధికారిని అని మరిచి వైపీఎస్ అధికారిగా మారి చట్టాలను లెక్కచేయకుండా పనిచేసి, వైఎస్సార్ ఆంజనేయులుగా ముద్ర వేసుకున్న ఐపీఎస్ అధికారి, ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్‌ఆర్ ఆంజనేయులును సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. నాడు జగన్ రెడ్డి ఆదేశాలతో ముంబయి నటి కాదంబరి జెత్వానీని వేధించిన కేసులో ఆయనను హైదరాబాద్‌లో ఏపీ సీఐడీ అధికారులు మంగళవారం ఉదయం అరెస్ట్ చేసి విజయవాడ తరలించారు. ఆయనను విజయవాడలోని సీఐడీ రీజినల్ కార్యాలయానికి ఆంజనేయులును తరలించి 7 గంటలపాటు సీఐడీ అధికారులు విచారించారు. బుధవారం ఉదయం వరకు ఆయన సీఐడీ కార్యాలయంలోనే ఉంచి, అనంతరం కోర్టులో హాజరుపరుస్తారు.
తమ పదవులని, తమ హోదాని, తమ బలాన్ని, తమ అధికారులని, తమ సలహాదారుడిని, తమ ప్రభుత్వ యంత్రాంగాన్ని, ఒక మహిళ మీద ప్రయోగించి, లొంగదీసుకోవాలని చూసింది నాటి జగన్ రెడ్డి మాఫియా ప్రభుత్వం. నేడు ఆ మహిళకి న్యాయం చేసేలా ఇప్పటికే వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్‌ని అరెస్ట్ చేసి, ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్లని సస్పెండ్ చేసి, ఈ రోజు సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్‌ఆర్ ఆంజనేయులుని అరెస్ట్ చేసింది కూటమి ప్రభుత్వం.
వైసీపీ హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్‌గా పనిచేసిన ఆంజనేయులు… అప్పటి సీఎం జగన్‌కు ఆయన అత్యంత విధేయుడిగా వ్యవహరించారు. ప్రస్తుతం ఆంజనేయులు సస్పెన్షన్ లో ఉన్నప్పటికీ జగన్ కోసం .. వైసీపీ కోసం పని చేస్తున్నట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సస్పెన్షన్ కాలంలో హెడ్ క్వార్టర్ (విజయవాడ) దాటి వెళ్లకూడదనే నిబంధన ఉన్నప్పటికీ ఆయన హైదరాబాద్‌లో ఉంటూ వైసీపీ హయాంలో జరిగిన వివిధ కుంభకోణాల్లో నిందితులకు.. అరెస్ట్ నుంచి ఎలా తప్పించుకోవాలి, ఇక వేళ అరెస్టయినా విచారణలో దొరక్కుండా ఉండేందుకు ఏ విధంగా మాట్లాడాలి అనే విషయాలపై శిక్షణ ఇస్తూ వ్యూహాలు రచిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా పీఎస్‌ఆర్‌కు పేరుంది. ఈ కారణంగానే జగన్ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే ఫోకల్ పోస్టుల్లోకి వచ్చిన పీఎస్‌ఆర్.. అనతి కాలంలోనే ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఛాన్స్ కొట్టేశారన్న ఆరోపణలు లేకపోలేదు. అప్పటి నుంచి ఆయన పని .. అసాంఘిక కార్యక్రమాలకు వ్యూహాలు వేయటం అన్నట్లుగా మారిపోయిందన్న ఆరోపణలు ఉన్నాయి. ఫోన్ ట్యాపింగ్ చేసి.. ప్రతిపక్ష నేతలను వేధించడంలో కీలక పాత్ర పోషించారు. సీనియర్ ఐపీఎస్‌గా ఉన్న ఆయన వైసీపీ హయాంలో రవాణా శాఖ కార్యదర్శిగా టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుపై వేధింపులకు పాల్పడి, ఆయన ఆత్మహత్య చేసుకునేలా చేశారు.
ఇంటెలిజెన్స్ చీఫ్ హోదాలో పీఎస్‌ఆర్.. జగన్‌తో పాటు వైసీపీ ప్రభుత్వ పెద్దలు చెప్పిన చాలా పనులను చక్కబెట్టారని ఆరోపణలున్నాయి. అందులో భాగంగానే వైసీపీ ముఖ్యనేత చెప్పగానే నిబంధనలను పక్కన పెట్టేసి ముంబయి నుంచి జెత్వానీని విజయవాడ తీసుకువచ్చేందుకు పీఎస్‌ఆర్ ఆంజనేయులు రంగంలోకి దిగారు.
ఆమెపై ఏ కేసు పెట్టాలి.. ఎలా అరెస్ట్ చేయాలనే విషయాలను అన్నీ తానై చూసుకున్నారు. ప్రణాళిక సిద్ధం కాగానే వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్‌ను పిలిపించి జెత్వానికి వ్యతిరేకంగా ఫిర్యాదు చేయించారు. తన ఆస్తిపై ఆమె తప్పుడు ఒప్పంద పత్రాల్ని సృష్టించి ఇతరులకు విక్రయించినట్లు ఇబ్రహీంపట్నంలో విద్యాసాగర్ ఫిర్యాదు చేశాడు. ఆ తప్పుడు ఫిర్యాదు ఆధారంగా జెత్వానీ, ఆమె తల్లిదండ్రులను పోలీసులు అరెస్ట్ చేశారు. ముంబయి వెళ్లి జెత్వానీ, ఆమె తల్లిదండ్రులను అరెస్ట్ చేసి విజయవాడకు తరలించడం.. రిమాండ్‌కు పంపడం, తదితర వ్యవహారాలను కాంతిరాణా, విశాల్ గున్నీ పర్యవేక్షించారు. ఆమెను విజయవాడ తీసుకొచ్చి.. వీటీపీఎస్‌కు సంబంధించిన గెస్ట్‌హౌస్‌లో ఉంచి వేధింపులకు గురిచేశారు. నటి కుటుంబసభ్యులపై కూడా కేసులు పెట్టి వేధించారు. అంతేకాకుండా రోజుల తరబడి తమ కస్టడీలో ఉంచుకుని జెత్వానీపై వేధింపులకు పాల్పడ్డారని, తాము చెప్పినట్లుగా నడుచుకోవాలని, స్టేట్ మెంట్ ఇవ్వాలని ఆమెపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తీసుకువచ్చారని కూడా ముగ్గురు ఐపీఎస్‌లపై ఆరోపణలున్నాయి.
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వం మారగానే చంద్రబాబును కలిసేందుకు పీఎస్‌ఆర్ విశ్వ ప్రయత్నం చేశారు. కానీ ఆయనను కలిసేందుకు సీఎం చంద్రబాబు ఇష్టపడలేదు. ఆ తదనంతర పరిణామాల్లో విజయవాడ వచ్చిన ముంబయి నటి జెత్వానీ.. తనకు జరిగిన అన్యాయాన్ని వెల్లడిరచారు. ఓ పారిశ్రామికవేత్తపై ఉన్న కేసును విత్‌డ్రా చేయించేందుకు తనను ఇలా ఇబ్బందులకు గురిచేశారని నటి ఆరోపించారు. ఈ వ్యవహారాన్ని అధ్యయనం చేసిన కూటమి ప్రభుత్వం.. సీఐడీకి ఈ కేసును అప్పగించింది. కేసు నమోదు చేసిన సీఐడీ.. ఈ కేసులో భాగ్యస్వాములైన ఐపీఎస్ అధికారులు పీఎస్‌ఆర్ ఆంజనేయులు, విశాల్ గున్నీ, క్రాంతి రాణా టాటాను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. అయితే విశాల్ గున్నీ, క్రాంతి రాణా టాటా కోర్టుకు వెళ్లి బెయిల్ తెచ్చుకోగా.. పీఎస్‌ఆర్ మాత్రం కనీసం బెయిల్ కోసం దరఖాస్తు కూడా చేసుకోలేదు.
అలాగే మాజీ ఎంపీ, ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు కస్టోడియల్ టార్చర్ కేసుకు సంబంధించి కూడా పీఎస్‌ఆర్‌పై అభియోగాలు ఉన్నాయి. ఈ కేసులోనూ పీఎస్‌ఆర్ నిందితుడిగా ఉన్నారు. పీఎస్‌ఆర్ ఆంజనేయులుపై గతంలోనే మరో కేసు కూడా నమోదయింది. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడుగా ఉన్న కేఆర్ సూర్యనారాయణను తుపాకీతో బెదిరించారంటూ వచ్చిన ఫిర్యాదుపై గుంటూరు సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో ఈ రెండు కేసులకు సంబంధించి ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇలాఉంటే ఏపీకి సంబంధించిన కేసుల్లో హైదరాబాద్‌లో అరెస్టు అయిన నాలుగో వ్యక్తిగా పీఎస్‌ఆర్ నిలిచారని చెప్పాలి. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, సినీ నటుడు పోసాని కృష్ణ మురళి, ప్రభుత్వ మాజీ సలహాదారు రాజ్ కసిరెడ్డిలు ఏపీకి చెందిన కేసుల్లో హైదరాబాద్ లో అరెస్టు అయిన సంగతి తెలిసిందే.