- వైసీపీ, సాక్షి తప్పుడు కథనాలను ఖండిరచిన ఉర్సా సంస్థ
- ఎకరం 99 పైసలకే ఇచ్చారన్న కథనంలో వాస్తవం లేదు
- రాజకీయ లబ్ది కోసం ఇన్వెస్టర్లపై తప్పుడు ప్రచారాలు తగదు
- కేశినేని చిన్నికి ఉర్సా సంస్థకు ఎటువంటి సంబంధం లేదు
- ప్రభుత్వ పాలసీ ప్రకారమే భూ కేటాయింపులు జరిగాయి
- జూమ్ కాల్‌లో వాస్తవాలు వెల్లడిరచిన ఫౌండర్ జయ్ తాళ్లూరి, సతీష్ అబ్బూరి
అమరావతి (చైతన్య రథం): రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా అడ్డుకుంటూ.. తమ సంస్థపై వైసీపీ చేస్తోన్న విష ప్రచారాన్ని ఉర్సా సంస్థ యాజమాన్యం ఖండిరచింది. రాష్ట్రానికి మేలు జరుగకుండా కుట్రలు చేస్తున్నారని, యువతకు మేలు చేద్దామని వస్తోన్న ఇన్వెస్టర్లపై నిందలు వేస్తున్నారంటూ ఉర్సా ఫౌండర్ జై తాళ్లూరి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం జూమ్ కాల్ ద్వారా మీడియాకు ఉర్సా ఫౌండర్ వాస్తవాలు వెల్లడిరచారు.
దశాబ్దాల అనుభవమున్న టీమ్‌పై నిందలా?
‘‘ఉర్సా అనేది రాత్రికి రాత్రి పుట్టుకొచ్చిన సంస్థ కాదు. అమెరికాలో రిజిస్టర్డ్ కంపెనీ ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్. భారతదేశ నిబంధనల ప్రకారం ఇక్కడ పెట్టుబడులు పెట్టాలంటే ఇక్కడ రిజిస్టరై ఉండాలన్న నిబంధన మేరకు హైదరాబాద్ నుంచి టెంపరరీ అడ్రెస్‌తో రిజిస్ట్రేషన్ చేశాం. వందలాది ఉద్యోగులు రేయింబవళ్ళు కష్టపడి పనిచేస్తే పుట్టుకొచ్చిన సంస్థ ఉర్సా క్లస్టర్స్. ఆర్బీఐ నిబంధనల మేరకే ఎఫ్‌డీఐ పాలసీతో ఏపీలో పెట్టుబడులు పెడుతున్నాం. నిబంధనల ఉల్లంఘన అన్నదే ఎక్కడా లేదు. కష్టపడిన సొమ్ముతో మేము కంపెనీ పెడితే.. మా బృందంపై నిందలు వేస్తున్నారు. టెక్నాలజీ బెస్ట్ ఎంటర్‌ప్రైజెస్‌ను నిర్వహించడంలో దశాబ్దాల అనుభవం మా బృందానికి ఉంది. మా వ్యాపార భాగస్వాములు సతీష్ అబ్బూరి, ఎరిక్ వార్నర్, కౌశిక్ పెందుర్తిలకు దశాబ్దాలుగా వివిధ రంగాల్లో, వివిధ స్ధాయిలో పనిచేసిన అనుభవం ఉంది. అమెరికాలో ఉన్నతస్థాయిలో టర్నోవర్ ఉన్న కంపెనీ మాది. ఏవరికైనా ఏమైనా అనుమానాలుంటే మా దగ్గరకు వచ్చి ఎన్డీఏపై సంతకం చేస్తే.. మా సంస్థ వెనక ఎవరున్నారు? ఎవరు సహకరిస్తున్నారు? ఏమి చేస్తామో పూర్వపరాలతో వివరిస్తాం. ఇవేమీ తెలుసుకోకుండా అభూత కల్పనలు, అబద్ధాలతో కథనాలు అల్లి.. ఎవరి దగ్గరో మెప్పు పొందేందుకు.. రాజకీయ లబ్దికోసం బురద చల్లుతున్నారు. అబద్ధాల నిందలతో పారిశ్రామికవేత్తలను రాష్ట్రానికి రాకుండా చేసి.. అభివృద్ధిని దెబ్బతీయాలని కొందరు ప్రయత్నిస్తున్నారు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రూ.99 పైసలకే ఎకరం భూమి ఇచ్చారన్న ప్రచారంలో వాస్తవం లేదు
‘‘మేము రావడం మీకేమైనా ఇష్టం లేకపోతే.. లేదా ప్రభుత్వం నిర్దేశించిన సమయానికి మేము కార్యకలాపాలు మొదలుపెట్టకపోతే అప్పుడు మమ్మల్ని ప్రశ్నించే హక్కు వారికి ఉంటుంది. రూ.వేల కోట్లతో భూమికొని ఎవరైనా వ్యాపారం చేయగలరా? ఆ ఫీజిబిలిటీ ఉంటుందా? మాకు రూ.99 పైసలకే ఎకరం ఇచ్చారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వ పాలసీ ప్రకారమే ఎకరం రూ.50 లక్షలచొప్పున 56.6 ఎకరాలు, ఎకరం రూ.కోటి చొప్పున 3.5 ఎకరాలకు చెల్లిస్తున్నాం. రూ.5,7283 కోట్ల పెట్టుబడితో 3 ఫేజుల్లో 300 మెగావాట్ల సామర్ధ్యంతో 2 వేలమందికి ఉపాధి కల్పిస్తామని మేము ముందుకొచ్చాం. అందుకోసం 150 ఎకరాలు కావాలని అడిగినా మాకు తగ్గించి ఇచ్చారు. మాకు భూమి కేటాయించేటప్పుడే రెండేళ్లు డెడ్‌లైన్ విధించింది ప్రభుత్వం. మేము చేయలేని పక్షంలో మాకిచ్చిన భూమిని తిరిగి ప్రభుత్వం తీసుకొని ప్రాజెక్టును రద్దు చేసే హక్కు ప్రభుత్వానికుంది. నిజానిజాలు తెలియకుండా మా సంస్థపై విషం చిమ్ముతున్నారు. విషం చిమ్ముతున్న వారికి ఏపీకి పెట్టుబడులు రావడం, రాష్ట్రం బాగుపడడం ఇష్టం లేదు. మాపై నిందలు వేస్తే కొత్తగా వచ్చే కంపెనీలు సైతం మాకెందుకు అని తిరిగివెళ్ళేపొతాయనే దురుద్దేశంతో చేస్తున్న పనే ఇదంతా’’ అని వ్యాఖ్యానించారు.
కేశినేని చిన్నికి మాకూ సంబంధం లేదు: సతీష్ అబ్బూరి
ఎంపీ కేశినేని చిన్నికి మా సంస్థకూ ఎటువంటి సంబంధం లేదు. కేశినేని నాని మాపై ఎందుకు బురద జల్లుతున్నారో వారినే అడగాలి. మా సంస్థ యొక్క టర్నోవర్ ఏమిటి? ఏఐ రంగంలో మా సంస్థ ఏస్థాయిలో ఉందో నిజానిజాలు తెలుసుకోవాలి. ఏదో బురద జల్లుతామంటే కుదరదు అని ఉర్సా భాగస్వామి సతీష్ అబ్బూరి స్పష్టం చేశారు.