- 202 మీటర్లు పూర్తైన డయాఫ్రమ్ వాల్
- ఈ ఏడాది డిసెంబర్‌కు పూర్తి చేస్తాం
- డయాఫ్రమ్ వాల్‌తో సమాంతరంగా ఈసీఆర్‌ఎఫ్ పనులు
- 2027 డిసెంబర్‌కు పోలవరం ప్రాజెక్టు కచ్చితంగా పూర్తి చేస్తాం
- మీడియాతో జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు
రాజమహేంద్రవరం: సీఎం చంద్రబాబు నిర్దేశించిన లక్ష్యానికి అనుగుణంగా పోలవరం ప్రాజెక్ట్ డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులు ఈ ఏడాది డిసెంబర్ చివరినాటికి పూర్తి చేస్తామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టు డయాఫ్రం వాల్ కు సంబంధించి ఇప్పటివరకు 202 మీటర్ల నిర్మాణం పూర్తయినట్లు మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా సోమవారం రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి నిమ్మల మాట్లాడారు. డయాఫ్రం వాల్ జగన్ పాలనలో విధ్వంసానికి గురికాగా నేడు కూటమి ప్రభుత్వంలో పునర్ నిర్మాణం దశగా పనులు వేగంగా సాగుతున్నాయన్నారు. కొత్తగా డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులను రూ.990 కోట్లతో ఈ ఏడాది జనవరి 18న మొదలుపెట్టామని తెలిపారు. రెండు కట్టర్లు, రెండు గ్రాబర్లతో డయాఫ్రమ్ వాల్ పనులు శర వేగంగా జరుగుతున్నాయన్నారు. ఏప్రిల్ 30 కల్లా మూడవ కట్టర్ కూడా అందుబాటులోకి రానుందన్నారు. వర్షాకాలంలో సైతం పనులు జరిగేలా ఎగువ కాపర్ డ్యామును బలోపేతం చేయడానికి బట్రస్ డ్యాం మే నెలకల్లా పూర్తి చేస్తామని మంత్రి నిమ్మల చెప్పారు.
అసలు ప్రాజెక్టులో డయాఫ్రమ్ వాల్ ఉందో లేదో కూడా వైసీపీ నేతలకు తెలియదు. దానిపై వారికి అవగాహన కూడా లేదు. గతంలో చంద్రబాబు రూ.430 కోట్లతో డయాఫ్రమ్ వాల్ నిర్మిస్తే జగన్ పాలనలో విధ్వంసం చేశారు. రూ.990 కోట్లతో కొత్త డయాఫ్రమ్ వాల్ పనులు మొదలుపెట్టాం. చంద్రబాబు లక్ష్యానికి అనుగుణంగా, ఈ ఏడాది డిసెంబర్ చివరినాటికి డయాఫ్రమ్ వాల్ పూర్తి చేస్తామన్నారు. డయాఫ్రం వాల్ పూర్తయ్యే వరకు వేచి చూడకుండా, సమాంతరంగా గ్యాప్-1 వద్ద ఈసీఆర్‌ఎఫ్ డ్యాం నిర్మాణాన్ని ఏప్రిల్ నెలలో మొదలుపెట్టామని మంత్రి తెలిపారు. గ్యాప్-2 వద్ద ఈసీఆర్‌ఎఫ్ డ్యామ్ పనులు ఈ ఏడాది నవంబర్ 30 లోగా మొదలు పెట్టేలా సీఎం చంద్రబాబు నిర్దేశించిన ప్రణాళికలను అమలు చేస్తామన్నారు.
సీఎం చంద్రబాబు ఇటీవల జరిపిన రివ్యూలో 2027 లో గోదావరి పుష్కరాలు ఉన్నందున ఆ ఏడాది జూన్ కల్లా పూర్తయ్యలా చూడాలని చెప్పారని, సాధ్యమైనంత వరకు అప్పట్లోగా పూర్తయ్యేలా పనులను వేగవంతం చేస్తామని, లేనిపక్షంలో అనుకున్న లక్ష్యానికి 2027 డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టును కచ్చితంగా పూర్తి చేస్తామన్నారు.
గత జగన్ ప్రభుత్వంలో పోలవరం లెఫ్ట్ కెనాల్‌కు అర బస్తా సిమెంట్ గాని, రూపాయి పనికి గానీ నోచుకోలేదన్నారు. కూటమి ప్రభుత్వం రూ.1200 కోట్లతో టెండర్లు పిలవడంతో పనులు వేగవంతంగా జరుగుతున్నాయన్నారు. గోదావరి వరద జలాలు లెఫ్ట్ కెనాల్ ద్వారా ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టుకు, తరలిస్తామని, తద్వారా ఉత్తరాంధ్రకు సాగు, తాగు అందుతుందన్నారు. ఈ సమావేశంలో మంత్రి కందుల దుర్గేష్, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి, రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ పాల్గొన్నారు.