- నాడు జగన్‌రెడ్డి దగా డీఎస్సీ
- ఐదేళ్లలో ఒక్క టీచర్ పోస్టునూ భర్తీ చేయని జగన్
- 2014`19 మధ్య రెండు డీఎస్సీలతో 18 వేల ఉద్యోగాలు ఇచ్చిన చంద్రబాబు
- ఐదేళ్ల వైసీపీ పాలన టీచర్లకు నరకమే
- నేడు కూటమి ప్రభుత్వ మెగా డీఎస్సీపై జగన్‌రెడ్డి అక్కసు
- నీలి మీడియా సాక్షిలో అసత్య కథనాలతో దుష్ప్రచారం
అమరావతి (చైతన్యరథం): నాడు మెగా డీఎస్సీ అంటూ జగన్మోహన్ రెడ్డి నిరుద్యోగులను దగా చేస్తే.. నేడు కూటమి ప్రభుత్వం 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ను విడుదల చేసి ఉద్యోగాల పండుగ తెచ్చింది. ఐదేళ్లలో కనీసం ఒక్క టీచర్ పోస్టు కూడా భర్తీ చేయలేని అసమర్థ జగన్ రెడ్డి.. నేడు కూటమి ప్రభుత్వం విడుదల చేసిన మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌పై మాత్రం అవినీతి పత్రిక సాక్షిలో అసత్య, నిరాధార కథనాలతో అక్కసు వెళ్లగక్కుతున్నాడు. జగన్ రెడ్డి మోసాలు, మాయలు, అబద్ధాలు గ్రహించిన జనం ఎన్నికల్లో చావుదెబ్బ కొట్టినా.. తన వైఖరి మార్చుకోకుండా ఇప్పటికీ అలవాటయిన దుష్ప్రచారంతో విషం చిమ్ముతున్నాడు. వాస్తవానికి ఉమ్మడి రాష్ట్రం నుంచి ఏపీలో క్రమం తప్పకుండా డీఎస్సీ నోటిఫికేషన్‌లు ప్రకటించి ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసింది టీడీపీ ప్రభుత్వాలే. జగన్ రెడ్డి ఎంతగా అవాస్తవ కథనాలతో మసిపూసి మారేడుకాయ చేయాలని చూసినా ఈ వాస్తవాన్ని మాత్రం కప్పిపుచ్చలేరు.
ఎన్నికలకు ముందు యువతకు ఇచ్చిన మాట ప్రకారం కూటమి ప్రభుత్వం 16,347 టీచర్ పోస్టులతో, మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ పోస్టుల ద్వారా ఎంపికైన అభ్యర్థులను వచ్చే విద్యా సంవత్సరానికి పోస్టింగులు కూడా ఇవ్వనుంది.
పోస్టుల విభజన:
సెకండరీ గ్రేడ్ టీచర్లు (ఎస్జీటీ): 6,371, స్కూల్ అసిస్టెంట్లు (ఎస్‌ఏ): 7,725, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు (టీజీటీ): 1,781, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లు (పీజీటీ): 286, ప్రిన్సిపాళ్లు: 52, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు (పీఈటీ): 132.
ఉమ్మడి జిల్లాల వారీగా పోస్టుల వివరాలు:
శ్రీకాకుళం: 543, విజయనగరం: 583, విశాఖపట్నం: 1,134, తూర్పుగోదావరి: 1,346, పశ్చిమ గోదావరి: 1,067, కృష్ణా: 1,213, గుంటూరు: 1,159, ప్రకాశం: 672, నెల్లూరు: 673, చిత్తూరు: 1,478, కడప: 709, అనంతపురం: 811, కర్నూలు: 2,678
అదనంగా, రెసిడెన్షియల్ స్కూల్స్, మోడల్ స్కూల్స్, బీసీ, గిరిజన పాఠశాలల్లో 2,281 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అంతేకాకుండా డీఎస్సీ ద్వారా 2,260 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ల భర్తీకి జీవో కూడా విడుదల చేశారు. అభ్యర్థులకు గరిష్ఠ వయోపరిమితిని జులై ఒకటో తేదీ నాటికి 44ఏళ్లుగా, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు గరిష్ఠ వయోపరిమితి 49ఏళ్లు, దివ్యాంగ అభ్యర్థులకు 54ఏళ్లుగా నిర్ణయించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎన్నికల ముందు విడుదల చేసిన డీఎస్సీ-2024కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేకుండా దరఖాస్తు చేసుకునే అవకాశం కూడా కూటమి ప్రభుత్వం కల్పించింది.
2014-2019 మధ్య..
విభజిత ఏపీలో 2014-19 మధ్య అప్పటి టీడీపీ ప్రభుత్వం 2 డీఎస్సీలు జరిపి 18వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసింది. చంద్రబాబు నాయుడు 14 ఏళ్ల ముఖ్యమంత్రి హోదాలో దాదాపు 11 డీఎస్సీలు జరిపి 1,80,208 పోస్టులు భర్తీ చేసి చరిత్ర సృష్టించారు. ఇప్పుడు విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుల్లో అధిక భాగం ఆయన హయాంలో ఉద్యోగాలు పొందినవారే.
జగన్మోహన్ రెడ్డి దగా డీఎస్సీ
2019 ఎన్నికలకు ముందు రాష్ట్రంలో 2 లక్షల 30 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, టీచర్ పోస్టులు 23 వేలకు పైగా ఖాళీగా ఉన్నాయని మెగా డీఎస్సీ ఇస్తానని యువతకు హామీ ఇచ్చి అధికారం చేపట్టిన జగన్ రెడ్డి 4 ఏళ్ల 9 నెలల తరువాత 2024 ఎన్నికలకు సరిగ్గా 2 నెలల ముందు కేవలం 6,100 పోస్టులకు డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసి నిరుద్యోగులను మోసం చేశాడు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో నోటికి వచ్చిన హామీలు ఇచ్చి అధికారంలోకి రాగానే తన నిజ స్వరూపం బయటపెట్టాడు. 2014-2019 మధ్య చంద్రబాబు నాయుడు హయాంలో రెండుసార్లు డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తే 2019-2024 మధ్య జగన్ ఒక్కసారి కూడా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయకపోవటం సిగ్గు పడాల్సిన విషయం.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతి ఏడాది డీఎస్సీ అని నమ్మించి, అధికారం చేతుల్లో ఉన్నప్పుడు ఒక్క డీఎస్సీ కూడా ప్రకటించకుండా మెగా, జంబో, మినీ డీఎస్సీ అని కాలం గడిపేసిన దగాకోరు జగన్ రెడ్డి. టెట్, డీఎస్సీ కలిపి నోటిఫికేషన్ ఇచ్చి అభ్యర్థులను గందరగోళానికి గురి చేసిన ఘనత కూడా జగన్ రెడ్డిదే. నోటిఫికేషన్ ఇచ్చిన 30 రోజుల్లోనే పరీక్షలు పెట్టడానికి షెడ్యూల్ రూపొందించిన తుగ్లక్ దేశంలో ఎవడైనా ఉన్నాడు అంటే కేవలం జగన్ రెడ్డి మాత్రమే. నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం నాణ్యమైన విద్యలో రాష్ట్రాన్ని 3వ స్థానం నుంచి 19వ స్థానానికి దిగజార్చాడు. 2013లోనే రద్దు చేసిన అప్రెంటీస్ విధానాన్ని కూడా జగన్ రెడ్డి పునరుద్ధరించాడు. అంటే డీఎస్సీ ద్వారా ఉద్యోగాలు పొందిన టీచర్లకు రెండేళ్లపాటు పే స్కేలు అమలుచేయకుండా, గౌరవ వేతనంతో సరిపెట్టేలా ప్లాన్ చేసిన దగాకోరు జగన్ రెడ్డి.
టీచర్లపై కత్తికట్టినట్లుగా..
ఐదేళ్ల పాలనలో ప్రభుత్వ టీచర్లపై జగన్ రెడ్డి కత్తికట్టినట్లుగా వ్యవహరించాడు. రాష్ట్ర వ్యాప్తంగా 1,69,642 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులపై దారుణంగా కక్ష సాధింపులకు దిగాడు. పీఆర్సీ సాధన కోసం విజయవాడలో బీఆర్టీఎస్ రోడ్డు ముట్టడికి ప్రయత్నించిన ఉపాధ్యాయులపై లాఠీఛార్జ్ చేయించాడు. గౌరవప్రదమైన వృత్తిలో ఉన్న గురువులను మద్యం దుకాణాల ముందు కాపలా పెట్టించాడు. మరుగుదొడ్లను కడిగించాడు. సిఫార్సు బదిలీల పేరుతో వైసీపీ నేతలు రూ.50 కోట్లు అక్రమంగా లాగేసుకున్నారు. ఎన్నికల విధుల నుంచి ఉపాధ్యాయులను కావాలని తప్పించే ప్రయత్నం చేసి విఫలమయ్యాడు. పని వేళల్లో కాకుండా రాత్రి సమయంలో విద్యార్ధుల ఇళ్లకు వెళ్లి నోటు పుస్తకాలు తనిఖీలు చేయాలని టీచర్లను హింసకు గురి చేశాడు. ఆన్‌లైన్ లోనూ నోటు పుస్తకాలు తనిఖీ చేయాలంటూ టీచర్లపై తీవ్రమైన ఒత్తిడి తెచ్చాడు. పాఠశాలల్లో 27 అంశాలు పరిశీలించాలంటూ ముప్పుతిప్పలు పెట్టాడు.
మధ్యాహ్న భోజన పథకం, నాడు నేడు పనుల బాధ్యతలను పగబట్టినట్లుగా టీచర్లకు అప్పగించాడు. ఫోటోలు తీసి, యూప్‌లో అప్ లోడ్ చేయాలనే నిబంధన పెట్టి, ఫోటోలు అప్ లోడ్ కాకపోతే షోకాజ్ నోటీసులు ఇచ్చి వేధింపులకు గురిచేశాడు. నాడు నేడు పనుల పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించి ప్రధానోపాధ్యాయులపై ఒత్తిడి తెచ్చి రోగాలబారిన పడేట్లు చేశాడు. కోడిగుడ్లను గుత్తేదారు సకాలంలో బడికి సరఫరా చేయని చోట విద్యార్ధులకు గుడ్డుపెట్టలేదని ప్రధానోపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు ఇచ్చి వేధించాడు. వృత్తిపరంగా ఇన్ని వేధింపులకు గురిచేసి కూడా ఏ ఒక్క నెల కూడా సకాంలో జీతాలు ఇవ్వకుండా ఆర్థికంగానూ ఉపాధ్యాయులను ముప్పుతిప్పలు పెట్టిన శాడిస్ట్ జగన్‌రెడ్డి.. నేడు కూటమి ప్రభుత్వం జారీ చేసిన డీఎస్సీ నోటిఫికేషన్‌పై తన సొంత పత్రిక సాక్షిలో అసత్య కథనాలు వండి వారుస్తూ పైశాచికానందం పొందుతున్నాడు.