విశాఖపట్నం (చైతన్యరథం): టాటా గ్రూపునకు చెందిన టీసీఎస్ సంస్థకు విశాఖలో భూముల కేటాయింపుపై వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని విశాఖ ఎంపీ శ్రీభరత్ మండిపడ్డారు. వైసీపీ నేతల వ్యాఖ్యలను ఖండిరచారు. దేశంలో పేరున్న, నమ్మకమైన టాటా వంటి కంపెనీ రాష్ట్రానికి వస్తే.. దానిని చూసి మరిన్ని కంపెనీలు వస్తాయన్నారు. సమాజంలో మంచి పేరున్న కంపెనీని ఆహ్వానిస్తే.. అనుకున్న దానికంటే ఎక్కువ పెట్టుబడులు. ఎక్కువ ఉద్యోగాలు పెరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. టాటా సంస్థను విమర్శించేంత స్థాయి వైసీపీకి లేదని, ఎప్పటికీ రాదని స్పష్టం చేశారు. అక్కడ ఎకరం ఎంత ధరకు ఇచ్చామన్నది ప్రధానం కాదని, ఐటీ రంగంలో అగ్రస్థానంలో ఉన్న కంపెనీ విశాఖలో క్యాంపస్ ఏర్పాటు చేయనుండటం ముఖ్యమన్నారు. ఈ క్యాంపస్ ద్వారా 12 వేల ఉద్యోగాలు వస్తాయన్నారు. విశాఖలో ఐటీ రంగం అభివృద్ధికి టీసీఎస్ రాక గేమ్ ఛేంజర్ అవుతుందన్నారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో మైక్రోసాఫ్ట్ రావటంతోనే ఐటీ రంగంలో హైదరాబాద్ దశ మొత్తం మారిపోయిందన్నారు. వైసీపీ పేటీఎం బ్యాచ్‌కి ఇవన్నీ అర్థం చేసుకునే శక్తి లేదని ఎంపీ భరత్ అన్నారు.