- మద్యం కుంభకోణంపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి
- ముగిసిన సిట్ విచారణ, మూడు గంటలు ప్రశ్నించిన అధికారులు
విజయవాడ (చైతన్యరథం): వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో బిగ్ బాస్ ఎవరో రాజ్ కసిరెడ్డే (కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి) చెప్పాలని మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. మద్యం కుంభకోణం కేసులో సిట్ బృందం శుక్రవారం దాదాపు 3 గంటల పాటు విజయసాయి రెడ్డిని విచారించింది. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గతంలో జరిగిన రెండు సమావేశాల గురించి సిట్ అధికారులు తనను ప్రశ్నించినట్లు తెలిపారు. ఆ రెండు సమావేశాల్లో ఏం చర్చించారని, ఎవరెవరు పాల్గొన్నారని సిట్ అధికారులు అడిగారన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక 2019 చివరలో హైదరాబాద్‌లోని జర్నలిస్టు కాలనీ పరిధిలో ఉన్న తన ఇల్లు, ఆ తర్వాత విజయవాడలోని తన విల్లాలో రెండు సార్లు సమావేశాలు జరిగాయని, ఈ సమావేశాల్లో నూతన మద్యం పాలసీపై చర్చలు జరిగాయని సాయిరెడ్డి తెలిపారు. ఈ సమావేశాల్లో రాజ్ కసిరెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి, సత్య ప్రసాద్, వాసుదేవరెడ్డి, శ్రీధర్‌రెడ్డి, తాను పాలుపంచుకున్నామని తెలిపారు. అన్ని ప్రశ్నలకూ రాజ్ కసిరెడ్డి మాత్రమే సరైన జవాబులు చెప్తాడని చెప్పా. మొత్తం నాలుగు ప్రశ్నలు అడిగారు. నా సమాధానాలతో తృప్తి చెందారని భావిస్తున్నా. మరోసారి పిలిచినా వస్తానని సిట్ అధికారులకు చెప్పాను. రాజ్ కసిరెడ్డిని ప్రశ్నిస్తే మరిన్ని వివరాలు తెలుస్తాయి. రాజ్ కసిరెడ్డి వసూలు చేసిన డబ్బులు ఎవరికి వెళ్లాయో తనకు తెలియదని చెప్పానన్నారు.