- సొంత మీడియా ద్వారా అసత్య ప్రచారం
- మంత్రి నిమ్మల ధ్వజం
పాలకొల్లు (చైతన్యరథం): రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ప్రజలు ఇచ్చిన తీర్పుతో లూటీ, దోపిడీలకు అవకాశం లేని జగన్ మళ్ళీ అధికారం పై కన్నేసి, ప్రజల మధ్య కుల, మత, ప్రాంత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో మన రైతు మన రామానాయుడు కార్యక్రమంలో రూ.2.62 కోట్లతో చేపట్టే అభివృద్ధి పనులకు శుక్రవారం మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ సొంత అవినీతి పత్రిక, ఛానల్ ద్వారా అసత్యాలను అచ్చుగుద్ది ప్రజల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టడమే జగన్ పన్నాగమని ఆయన వ్యవహార శైలిని బట్టి తెలుస్తోందన్నారు. పాస్టర్ ప్రవీణ్ యాక్సిడెంట్ మరణాన్ని మత విద్వేషంగా మలిచి క్రైస్తవుల్లో అలజడి సృష్టించాలనుకున్నారన్నారు. వక్ఫ్ బిల్లుపై రాజ్యసభలో అనుకూలంగా ఓటేసి, బయట విమర్శించి ద్వంద్వ ప్రమాణాల రాజకీయాలకు పాల్పడ్డారు. పార్లమెంట్ చరిత్రలో ఓటింగ్ అయిన తర్వాత విప్ జారీచేసిన ఘనత జగన్ పార్టీ వైసీపీకే దక్కుతుందని మంత్రి నిమ్మల ఎద్దేవా చేశారు.
నాస్తికుడైన, దేవుడిని నమ్మని కరుణాకర రెడ్డిని పవిత్రమైన టీటీడీ చైర్మన్‌గా నియమించడం జగన్ చేసిన పెద్ద తప్పు అన్నారు. టీటీడీ చైర్మన్‌గా పనిచేసిన కరుణాకర్ రెడ్డి ఆయన కుమార్తె వివాహం ఏ మత సాంప్రదాయం ప్రకారం చేశారో అందరూ చూశారన్నారు. తిరుమలలో డిక్లరేషన్ ఇమ్మంటే..ఇదేమి హిందూయిజం అంటూ మొండికేసి శ్రీవారి దర్శనానికే పోనని చెప్పిన జగన్‌కు నేడు టీటీడీ గురించి మాట్లాడే అర్హత ఎక్కడ ఉందని మంత్రి నిమ్మల ప్రశ్నించారు. జగన్ హయాంలో టీటీడీలో జరిగిన అవినీతి అంతా కాదన్నారు. గోశాలకు సంబంధించి దాణా, కల్తీ నెయ్యి తదితర విషయాల్లో కోట్లాది రూపాయలను దారి మళ్లించి అవినీతికి పాల్పడ్డారన్నారు. వైసీపీ వికృత చేష్టల ఫలితంగానే రాష్ట్రంలో ఎప్పుడూ లేని ఫలితాన్ని తిరుమల శ్రీవారు.. వైసీపీకి ఇచ్చారన్నారు. జగన్ అక్రమ ఆస్తులు.. 800 కోట్ల రూపాయల విలువైన షేర్లు ఈడీ సీజ్ చేసిందన్నారు. దేశంలో పెద్ద విచారణ సంస్థలన్నీ జగన్‌ను వేలెత్తి చూపుతున్నాయి. ఇప్పటికైనా తప్పులు తెలుసుకొని జగన్ రాజకీయాల నుంచి తప్పుకోవాలి. ప్రజలు కూడా జగన్ మాయమాటలు, కల్లబొల్లి మాటలు నమ్మకుండా అప్రమత్తంగా ఉండాలని మంత్రి రామానాయుడు పిలుపు ఇచ్చారు.