శ్రీకాకుళం (చైతన్యరథం): శ్రీకాకుళం జిల్లా నుండి ఉపాధి కోసం మస్కట్ వెళ్లిన కార్మికుల సమస్యపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు స్పందించారు. మస్కట్‌లో NASEEM AL SALAM కంపెనీలో పని లేకుండా, జీతభత్యాలు లేకుండా ఇబ్బందులు ఎదుర్కొంటున్న 9 మంది తెలుగు కార్మికులతో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు శుక్రవారం శ్రీకాకుళం కార్యాలయం నుండి వీడియో కాల్ ద్వారా మాట్లాడి అక్కడి పరిస్థితులను గురించి అడిగి తెలుసుకొని వారికి ధైర్యం చెప్పారు. కార్మికులు తమ సమస్యలను కేంద్ర మంత్రికి వివరించగా, సంబంధిత అధికారులతో మాట్లాడి వారిని త్వరితగతిన స్వదేశానికి సురక్షితంగా తీసుకురావడానికి అవసరమైన చర్యలు చేపడుతామని వారికి హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. అలాగే కార్మికుల కుటుంబాలు ఏమాత్రం అధైర్య పడొద్దని, ప్రభుత్వం తరపున కార్మికులకి అన్ని విధాలుగా సహాయసహకారాలు అందిస్తామని మంత్రి స్పష్టం చేశారు.