- ఈ వలలో పడి జీవితాలు నాశనం
- ఈ సంస్కృతిని సమూలంగా నిర్మూలిస్తాం
- నిరంతర అవగాహన, కఠినచర్యలతో అడ్డుకట్ట
- దేశానికే ఆదర్శంగా ఉండేలా పటిష్టమైన విధానం తెస్తాం
- ఎక్స్‌లో యువకుడి పోస్ట్‌కు మంత్రి లోకేష్ స్పందన
అమరావతి (చైతన్యరథం): రాష్ట్రంలో బెట్టింగ్ యాప్‌లపై ఉక్కుపాదం మోపుతామని విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేష్ ఉద్ఘాటించారు. బెట్టింగ్ యాప్‌ల వల్ల జీవితాలు నాశనం అవుతున్నాయంటూ తనను, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశిస్తూ ఎక్స్‌లో ఒక యువకుడు పెట్టిన ఒక పోస్టుపై మంత్రి లోకేష్ తీవ్రంగా స్పందించారు. ఏపీలో బెట్టింపు యాప్‌ల నిషేదానికి సమగ్ర విధానాన్ని తీసుకువస్తామని తెలిపారు. ఇది దేశానికే ఆదర్శంగా ఉండేలా అత్యంత పకడ్బందీగా ఉంటుందన్నారు. న్యాయ, చట్టపరమైన అన్ని అవకాశాలను ఉపయోగించుకుని బెట్టింగ్ సంస్కృతిని ఆపేందుకు ప్రయత్నం చేస్తున్నామని, బెట్టింగ్ యాప్‌ల కారణంగా జీవితాలు నాశనం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అనేక మంది బెట్టింగ్ యాప్‌లకు ఆకర్షితులై ఆర్థికంగా దెబ్బతింటున్నారని, ఇటువంటి పరిస్థితి నుంచి వారిని కాపాడేందుకు అవగాహన కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.
బెట్టింగ్ యాప్‌ల్లో జూదం ఆడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. జూదానికి బానిసైన యువత నైరాశ్యంలో కూరుకుపోయి తీవ్ర నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ విషయంలో నేను వందలాది హృదయ విదారక ఘటనలు వింటున్నాను. దీనిని ఆపాలి. బెట్టింగ్ యాప్‌లపై నిరంతరం అవగాహన కార్యక్రమాలు కొనసాగిస్తూ, వాటిని అణిచేసేందుకు కఠినచర్యలతో ఉక్కుపాదం మోపటమే ఈ సమస్యకు దీర్ఘకాలిక పరిష్కారం. మొత్తం దేశానికే ఉదాహరణగా నిలిచేలా రాష్ట్రంలో సమగ్ర బెట్టింగ్ వ్యతిరేక విధానం తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నాం. ఈ ముప్పును అంతం చేయడానికి అన్ని చట్టపరమైన మార్గాలను అన్వేషిస్తామని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు.