- గోశాల సందర్శనకు, చర్చకు సిద్ధమని బీరాలు
- పోలీసులు అనుమతించినా వెళ్లకుండా డ్రామాలు
- చెప్పిన ప్రకారం అనుచరులు లేకుండానే గోశాల వద్దకు కూటమి ఎమ్మెల్యేలు
- వేలాదిమందితో వెళతానంటూ భూమన మొండిపట్టు
- హౌస్ అరెస్ట్ చేశారంటూ రోడ్డుపై పడుకుని అబద్ధాలు
తిరుపతి (చైతన్యరథం): తిరుమలలో రాజకీయాలు చేసినవారందరూ నష్టపోయారు. భారీ మూల్యం కూడా చెల్లించారని చరిత్ర చెబుతున్న వాస్తవం. ఇవేవీ పట్టని వైసీపీ నేత, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మాత్రం గురువారం తిరుపతిలో హై డ్రామా నడిపించారు. టీటీడీ గోశాల పరిశీలనకు వస్తానని, చర్చకు సిద్ధమని సవాల్ చేసిన ఆయన.. చివరికి తోక ముడిచి అడ్డంగా దొరికిపోయారు. ఛాలెంజ్ చేసిన ప్రకారం అనుచరులు లేకుండా కూటమి ఎమ్మెల్యేలు గోశాలకు చేరుకున్నారు. అయితే ఒక్క పోలీసు అడ్డు చెప్పకపోయినా హౌస్ అరెస్ట్ అంటూ రోడ్డెక్కి భూమన డ్రామాలకు దిగి, గోశాలకు వెళ్లకుండా తనకు అసలు సిగ్గనేది లేదని నిరూపించుకున్నాడు.
తిరుపతి గోశాలలో గడచిన 3 నెలల్లోనే 100 మేర గోమాతలు మృత్యువాత పడ్డాయంటూ తిరుపతి మాజీ ఎమ్మెల్యే, తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి రాజకీయ రచ్చకు తెర తీశారు. రాజకీయ దురుద్దేశాలతో భూమన కల్పిత కథలను ప్రచారం చేస్తున్నారంటూ ప్రభుత్వంతో పాటుగా టీటీడీ పాలక మండలి కూడా ప్రతిస్పందించింది. అప్పటికీ ఆగని భూమన టీటీడీ, ప్రభుత్వ ప్రకటనలపైనా మరోమారు విమర్శలు చేశారు. పొంతన లేని ప్రకటనలు చేస్తున్నారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు కూటమి ప్రభుత్వాన్ని అసహనానికి గురి చేశాయి. ఈ క్రమంలో భూమనపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు మండిపడ్డారు. దమ్ముంటే ఈ విషయంపై చర్చకు సిద్ధమా? అంటూ ఆయన సవాల్ విసిరారు. తప్పుడు ఆరోపణలు చేసినందుకు సంయమనం పాటించాల్సిన భూమన.. పల్లా సవాల్ కు తాను సిద్ధమేనని ప్రకటించి చివరికి తోక ముడిచారు.
అనుచరులు లేకుండానే వచ్చిన కూటమి ఎమ్మెల్యేలు
ఈ క్రమంలో గురువారం చర్చ కోసం కూటమిలోని టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు తిరుపతిలోని గోశాలకు చేరుకున్నారు. కేవలం నేతలు, వారి సెక్యూరిటీ గార్డులు మాత్రమే ఈ చర్చ కోసం వచ్చారు. భూమన సవాల్ చేసినట్లుగా టీడీపీ నేతలు మాత్రం అనుచరులు లేకుండా అక్కడకు వచ్చారు. గోశాల వద్దకు కూటమి ఎమ్మెల్యేలు పులివర్తి నాని, బొజ్జల సుధీర్రెడ్డి, ఆరణి శ్రీనివాసులతో పాటు తితిదే సభ్యుడు భాను ప్రకాశ్ రెడ్డి తదితరులు వెళ్లారు. గోశాలను పరిశీలించడానికి భూమన వస్తాడేమో ఎదురు చూశారు. ఎంతకూ రాకపోవడంతో అక్కడి నుంచే భూమన కరుణాకర్‌రెడ్డ్డికి వారు ఫోన్ చేశారు. అసత్య ఆరోపణలు చేయడం కాదని.. క్షేత్రస్థాయికి రావాలని కోరారు. పోలీసులు సూచనల మేరకు ఐదుగురితో రావాలని ఆయనను కోరారు. ఎమ్మెల్యేల ఫోన్ నేపథ్యంలో గోశాలకు వస్తానని భూమన తెలిపారు.
రోడ్డుపై పడుకుని భూమన డ్రామాలు
పోలీసులు కూడా భూమన వెళ్తేందుకు అభ్యంతరం చెప్పలేదు. పోలీసులు తనని అడ్డుకుంటారనే ధీమాతో ఉన్న భూమన కరుణాకర్ రెడ్డి.. అందుకు విరుద్ధంగా జరగటంతో కంగుతిని కొత్త నాటకం ప్రారంభించారు. తన నివాసం నుంచి సుమారు 2,000 మందిని వెంటబెట్టుకొని గోశాలకు బయలుదేరారు. దీంతో ఆయన ఊహించిన్నట్లే పోలీసులు వారిని అడ్డుకొన్నారు. గోశాలకు గుంపులుగా వెళ్లొద్దని పోలీసులు సూచించారు. కార్యకర్తలతో కాకుండా హడావుడి లేకుండా గోశాలను సందర్శించి, మీడియాతో మాట్లాడి శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా వెళ్లిపోవాలని చెప్పారు. భూమన కరుణాకర్ రెడ్డి, మరో ముగ్గురు ముఖ్య నేతలను మాత్రమే అనుమతిస్తామని చెప్పి అడ్డుకున్నారు. వెంటనే భూమన కరుణాకర్ రెడ్డి రోడ్‌పై పడుకొని డ్రామా మొదలుపెట్టేశారు. తనను గృహ నిర్బంధం చేశారని కల్లబొల్లి మాటలు మొదలెట్టారు. మాజీ మంత్రి రోజా ఆయన పక్కనే కూర్చొని పోలీసులపై విరుచుకు పడ్డారు. గోశాలకు రమ్మనని ఫోన్లు చేసి పోలీసులతో అడ్డుకుంటారా? మమ్మల్ని ఎదుర్కోలేకనే పోలీసులతో అడ్డుకుంటున్నారని రోజా ఆరోపించారు. ఈ ఆరోపణలపై తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్దన్ రాజు స్పందించారు. ఎవరినీ గృహ నిర్భందం చేయలేదని ఎస్పీ తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కల్పించకుండా గోశాలను ఏ పార్టీ నేతలైనా సందర్శించవచ్చునని ఆయన అన్నారు.
భూమనవి తప్పుడు ఆరోపణలు..
ఎస్వీ గోశాలపై వైకాపా నేతల ఆరోపణలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉన్నాయని కూటమి ఎమ్మెల్యేలు, నేతలు విమర్శించారు. వైసీపీ హయాంలో టీటీడీలో ఎన్నో అక్రమాలు జరిగాయన్నారు. అధికారంలో ఉన్న ఐదేళ్లు పవిత్రమైన తిరుమలను అపవిత్రం చేస్తూ, వ్యాపార కేంద్రంగా మార్చారన్నారు. గోవుల మృతిపై అసత్య ప్రచారం, తప్పుడు ఆరోపణలు చేసి తీరా చర్చకు రమ్మంటే భయపడి తోక ముడిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏదేమైనా గోశాలలో ఆవులు చనిపోతుంటే అందుకు ఎవరైనా బాధపడతారు. కానీ మనుషులతో శవ రాజకీయాలు చేసే వైసీపీ నేతలు, ఆవులతో కూడా శవరాజకీయాలు చేస్తుండటమే దిగ్బ్రాంతి కలిగిస్తోంది.