- మాలాంటి పేద విద్యార్థులకు అండగా ఉంటే ఉన్నత శిఖరాలను అధిరోహిస్తాం
- మా ర్యాంకులు చూసి తల్లిదండ్రులు చాలా గర్వపడుతున్నారు
- మంత్రి లోకేష్ సన్మానిస్తారని కలలో కూడా ఊహించలేదు
- ఇంటర్‌లో మంత్రి లోకేష్ సంస్కరణల వల్లే ఉత్తమ ఫలితాలు
- ‘‘షైనింగ్ స్టార్స్-2025’’ ముఖాముఖి కార్యక్రమంలో విద్యార్థుల భావోద్వేగం
- పై చదువులకు ప్రభుత్వం సాయం చేయాలని తల్లిదండ్రుల విజ్ఞప్తి
అమరావతి (చైతన్యరథం): ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, ఒకేషనల్‌లో విద్యనభ్యసించి రాష్ట్రస్థాయిలో అత్యుత్తుమ మార్కులు సాధించిన 52 మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఉండవల్లి నివాసంలో మంగళవారం ముఖాముఖి నిర్వహించారు. వారి నుంచి సలహాలు, సూచనలు స్వీకరించారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు భావోద్వేగానికి గురయ్యారు. పలు సమస్యలను, భవిష్యత్ ప్రణాళికలను మంత్రి లోకేష్‌తో పంచుకున్నారు. పై చదువులకు సాయం చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరారు. ప్రతి ఒక్కరిని ప్రోత్సహించి, అండగా నిలుస్తామని ఈ సందర్భంగా మంత్రి హామీ ఇచ్చారు. 52 మంది విద్యార్థుల్లో 43 మంది బాలికలు కాగా 9 మంది బాలురు ఉన్నారు. వీరిలో ఆరుగురు విభిన్న ప్రతిభావంతులు ఉన్నారు.
1. మా లాంటి పేద విద్యార్థులను ప్రోత్సహిస్తే ఉన్నత శిఖరాలు అధిరోహిస్తాం
స్టేట్ ఫస్ట్ ర్యాంకు రావడం చాలా ఆనందంగా ఉంది. మా తల్లిదండ్రులు నా మార్కులు చూసి చాలా గర్వపడుతున్నారు. లోకేష్ మంత్రిగా వచ్చిన తర్వాత టెక్ట్ బుక్స్, నోట్ బుక్స్ అందించారు. మధ్యాహ్న భోజనం కూడా పెడుతున్నారు. చాలా ఆనందంగా ఉంది. మా లాంటి పేద విద్యార్థులను ప్రోత్సహిస్తే ఉన్నత శిఖరాలను అధిరోహిస్తాం. మాకు జేఈఈ మెయిన్స్ కోచింగ్ లేకపోయినా జూనియర్స్‌కు ఇస్తున్నారు. మాకు ఆర్థికంగా సహకారంతో పాటు పై చదువులకు కాలేజీలో ఉచితంగా సీటు, కోచింగ్ ఇప్పించాలని విజ్ఞప్తి చేస్తున్నాం.
`బండి పావని, విద్యార్థిని
గ్రూప్:ఎంపీసీ
మార్కులు:986/1000
కాలేజీ: జీజేసీ కాలేజీ, కర్నూలు టౌన్
2. మంత్రి లోకేష్ సన్మానిస్తారని కలలో కూడా ఊహించలేదు
మా నాన్న రోజు కూలికి వెళ్తారు. నేను చిన్నప్పటి నుంచి పదో తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలోనే చదివాను. ప్రైవేటు కాలేజీలో చదవాలనే కోరిక ఉండేది. అయినా మా ఆర్థిక పరిస్థితి కారణంగా చదవలేకపోయాను. హైస్కూల్ ప్లస్‌లో బైపీసీలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. దీంతో నా తల్లిదండ్రులు చాలా సంతోషపడ్డారు. అత్యధిక మార్కులు సాధించడానికి ఉపాధ్యాయులు చాలా మద్దతు ఇచ్చారు. పుస్తకాలు కూడా అందించారు. మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా సన్మానం పొందుతానని కలలో కూడా ఊహించలేదు. నాకు తెలిసిన అమ్మాయి గతంలో నారా చంద్రబాబునాయుడు చేతుల మీదుగా అవార్డు అందుకుంది. నేను కూడా బాగా చదివి అవార్డు పొందాలనుకున్నాను. ఇప్పుడు మీ చేతుల మీదుగా అవార్డు అందుకోవడం ఆనందంగా ఉంది. ఏదో ఒక రోజు చంద్రబాబునాయుడి చేతుల మీదుగా కూడా అవార్డు అందుకుంటాను. నేను డాక్టర్ కావాలనుకుంటున్నాను. గైనకాలజిస్ట్ కావాలనేది నా లక్ష్యం. నాకు సపోర్ట్ చేయండి. నాకు ఉచితంగా కోచింగ్ అందించాలని విజ్ఞప్తి చేస్తున్నాను.
` భుక్యా హరిణి, విద్యార్థిని
గ్రూప్:బైపీసీ
మార్కులు:978/1000
కాలేజీ: హైస్కూల్ ప్లస్ గర్ల్స్, మైలవరం, కృష్ణా జిల్లా
3. పారా ఒలంపిక్స్‌లో పాల్గొని మెడల్ సాధిస్తాను
మాది పల్నాడు జిల్లా గుత్తికొండ గ్రామం. అక్కడ పనులు లేక మా తల్లిదండ్రులు గుంటూరుకు వలస వచ్చి పలకలూరులోని ఓ అపార్ట్‌మెంట్‌లో వాచ్ మెన్‌గా పనిచేస్తున్నారు. నాకు దివ్యాంగ కోటాలో సీఈసీలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. మంత్రి లోకేష్ చేతుల మీదుగా నాకు ఈ అవకాశం వస్తుందని ఊహించలేదు. నా మొదటి సన్మానం లోకేష్ చేతుల మీదుగా జరగడం అదృష్టంగా భావిస్తున్నా. గతేడాది మాకు పాఠ్యపుస్తకాలు అందించలేదు. ఈ ఏడాది అందించారు. స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ వల్ల షటిల్, క్యారమ్స్ నేర్చుకున్నాను. బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు ఒలింపిక్స్‌లో పతకం తెచ్చిన మాదిరిగా నేను కూడా పారా ఒలంపిక్స్‌లో పాల్గొని మెడల్ సాధిస్తాను. పీ-4 వల్ల నాలాంటి వారికి చాలా ఉపయోగం ఉంటుంది. చదువు విషయంలో నా తల్లిదండ్రులు నన్ను బాగా ప్రోత్సహించారు. పై చదువులకు మీ సాయం కావాలి. ఐఏఎస్ కావాలనేది నా లక్ష్యం. దివ్యాంగులకు నా వంతు సాయం చేస్తాను.
` వల్లెపు కుసుమ శ్రీలక్ష్మీ కుమారి, దివ్యాంగ విద్యార్థిని
గ్రూప్:సీఈసీ
మార్కులు:827/1000
కాలేజీ: ఎన్ ఎల్ వీఆర్ జీఎస్‌ఆర్వీ జూనియర్ కాలేజీ, నిమ్మకూరు, పామర్రు
4. 902 మార్కులు తెచ్చుకుని మీ ముందు నిల్చొన్నాను
నాకు చెవులు సరిగా వినిపించవు. నేను చదవలేనని చుట్టుపక్కల వారు హేళన చేసేవారు. మా నాన్న నన్ను బాగా ప్రోత్సహించారు. 902 మార్కులు తెచ్చుకుని మీ ముందు నిల్చొన్నాను. ఐఏఎస్ కావాలనేది నా కల. చదువుకోవడానికి సాయం చేయాలి. కొన్ని కారణాల వల్ల మా నాన్న చదువుకోలేక పోయారు. అందుకే నన్ను కష్టపడి చదివించారు. ఇక్కడ ఇంతమంది మాట్లాడినా నాకు ఏమీ అర్థం కాలేదు.
` జంగా కీర్తన, దివ్యాంగ విద్యార్థిని
గ్రూప్:ఎంపీసీ
మార్కులు:902/1000
కాలేజీ: మోడల్ స్కూల్ జూనియర్ కాలేజీ, రూపెనగుంట్ల, నకరికల్లు, పల్నాడు జిల్లా
5. నీకు నేనే స్ఫూర్తి అని చెప్పాను
మాది చాలా పేద కుటుంబం. మా అమ్మాయికి వినపడదు. నా పనులు మానుకుని నా కూతురును చదివించాను. నీకు నేనే స్ఫూర్తి అని చెప్పాను 1 నుంచి 10 వరకు ప్రభుత్వ పాఠశాలలో చదివించాను. ప్రతి రోజూ వెళ్లి ఉపాధ్యాయులను కలిసి నా కూతురు చదువు గురించి వాకబు చేసేవాడిని. వాట్సాప్ ద్వారా వారు బాగా మద్దతు ఇచ్చారు. నా కూతురుని ప్రోత్సహించాలని విజ్ఞప్తి చేస్తున్నా.
` జంగా బ్రహ్మయ్య, జంగా కీర్తన తండ్రి
ఈ కార్యక్రమంలో పాఠశాల విద్య కార్యదర్శి కోన శశిధర్, డైరెక్టర్ వి.విజయ్ రామరాజు, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ కృతికా శుక్లా, సమగ్ర శిక్ష ఎస్పీడీ బి.శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.