- ఉల్లాసపూరిత వాతావరణంలో ఆంధ్రప్రదేశ్ షైనింగ్ స్టార్స్ ` 2025 కార్యక్రమం
- మంత్రి లోకేష్ సన్మానంతో విద్యార్థులు, తల్లిదండ్రుల భావోద్వేగం
- తమను గుర్తించి ప్రోత్సహించడం పట్ల మంత్రి లోకేష్‌కు ధన్యవాదాలు
- ప్రత్యేక ఆకర్షణగా వాల్ బోర్డులు
అమరావతి (చైతన్యరథం): విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ షైనింగ్ స్టార్స్-2025 కార్యక్రమం ఆద్యంతం ఆహ్లాదభరిత వాతావరణంలో జరిగింది. ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, ఒకేషనల్ కాలేజీల్లో చదివి ఇంటర్‌లో టాప్ మార్కులు సాధించిన విద్యార్థులను ఉండవల్లి నివాసంలో మంగళవారం విద్య, ఐటీ శాఖల మంత్రి లోకేష్ సన్మానించడం పట్ల విద్యార్థులు, తల్లిదండ్రులు భావోద్వేగానికి గురయ్యారు. ప్రభుత్వ కాలేజీల్లో చదివిన వారిని గుర్తించి, మెడల్స్, ల్యాప్‌ట్యాప్‌లు బహూకరించి ప్రోత్సహించిన మంత్రి లోకేష్‌కు విద్యార్థులు, తల్లిదండ్రులు ధన్యవాదాలు తెలిపారు.
ప్రత్యేక ఆకర్షణగా వాల్ బోర్డులు
ఆంధ్రప్రదేశ్ షైనింగ్ స్టార్స్ ` 2025 కార్యక్రమంలో ఏర్పాటుచేసిన వాల్ బోర్డులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విద్యార్థుల భవిష్యత్ లక్ష్యాలను వివరించే డ్రీమ్ వాల్, విద్యార్థులు తమ కెరీర్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచేలా వారిని ప్రోత్సహించిన వారి పేర్లు ప్రదర్శిస్తూ గ్రాటిట్యూడ్ వాల్ బోర్డ్ … ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, ఒకేషనల్ కాలేజీల బలోపేతానికి విద్యార్థులు, తల్లిదండ్రుల సలహాలు, సూచనల కోసం ఏర్పాటుచేసిన సజెషన్ వాల్ బోర్డు, టాప్ మార్కులు సాధించిన విద్యార్థుల పేర్లతో కూడిన ఆంధ్రప్రదేశ్ షైనింగ్ స్టార్స్-2025 వాల్ బోర్డ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
మంగళగిరి చేనేత శాలువాతో విద్యార్థులను సత్కరించిన మంత్రి లోకేష్
ఏ కార్యక్రమం అయినా మంగళగిరి చేనేతల పట్ల విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రత్యేక అభిమానాన్ని చాటుకుంటారు. ఆంధ్రప్రదేశ్ షైనింగ్ స్టార్స్ `2025 పేరుతో నిర్వహించిన సన్మాన కార్యక్రమంలోనూ విద్యార్థులను మంగళగిరి శాలువాతో సత్కరించి మంత్రి లోకేష్ మరోసారి చేనేతల పట్ల తన అభిమానాన్ని చాటుకున్నారు.