అమరావతి (చైతన్యరథం): రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ నిరంతర ప్రయత్నాలు ఫలించి వైజాగ్‌లో టీసీఎస్‌కు 21.16 ఎకరాల భూమిని 99 పైసల నామమాత్రపు ధరకు కేటాయించడానికి రాష్ట్ర మంత్రివర్గం మంగళవారం ఆమోదం తెలిపింది. టీసీఎస్ వైజాగ్ క్యాంపస్‌లో రూ.1370 కోట్ల పెట్టుబడితో 12,000 ఉద్యోగాలను కల్పిస్తుంది. మంత్రి నారా లోకేష్ గత ఏడాది అక్టోబర్‌లో ముంబయిలో టాటా హౌస్‌ను సందర్శించి, ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేసేలా టీసీఎస్‌ను ఒప్పించారు. ఈ విషయంపై అప్పటి నుంచి ఆ సంస్థ ముఖ్యులతో మంత్రి లోకేష్ నిరంతరం ఫాలోఅప్ చేస్తూనే ఉన్నారు. చివరికి టీసీఎస్‌కు భూ కేటాయింపులో మంత్రి లోకేష్ విజయం సాధించారు.
ఇంత నామమాత్రపు ధరకు భూమి కేటాయించటం సాహసోపేత నిర్ణయమే అయినప్పటికీ, ఐటీ రంగంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా సీరియస్‌గా ఉందనే సంకేతాలను పరిశ్రమ వర్గాలకు దీనిద్వారా తెలియజేసినట్లయింది. ఈ సందర్భంగా ఒక విషయాన్ని ప్రస్తావించుకోవాలి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గతంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇదే విధంగా 99 పైసలకు భూమిని కేటాయించి టాటా మోటార్స్‌ను తమ రాష్ట్రంలోని సనద్‌కు తీసుకెళ్లారు. ఆ నిర్ణయం గుజరాత్‌లో ఆటో పరిశ్రమ విస్తరణలో మైలురాయి ఘట్టంగా నిలిచింది.