- 24 ప్రధాన అంశాలే అజెండాగా కేబినెట్ భేటీ
- ఎస్‌ఐపీబీ సమావేశ ప్రతిపాదనలకూ కేబినెట్ ఆమోదం
- ఐటీహిల్ -3పైన టీసీఎస్‌కు 2166 ఎకరాల కేటాయింపు
- 30 మెగావాట్ల సామర్థ్యంతో 2 హైడల్ ప్రాజెక్టులకూ ఓకే
- త్వరలోనే డిఎస్సీ నోటిఫికేషన్: మంత్రి నిమ్మల వెల్లడి
- ఎస్సీ రిజర్వేషన్లు సమంగా అందేలా రోస్టర్: మంత్రి డోలా
- శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే సహించం: హోంమంత్రి అనిత
అమరావతి (చైతన్య రథం): ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఎస్సీ ఉపవర్గీకరణలో 200 పాయింట్ల రోస్టర్ అమలుకు నిర్ణయించింది. విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల ఫలాలు సమానంగా అందేలా చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. ఎస్సీ ఉపవర్గీకరణ కింద గ్రూప్-1లో 12 ఉపకులాలకు 1 శాతం, గ్రూప్-2లో 18 ఉపకులాలకు 6.5 శాతం, గ్రూప్-3లో 29 ఉపకులాలకు 7.5 శాతం రిజర్వేషన్ వర్తిస్తుంది. అన్ని జిల్లాలో ఈ ఆర్డినెన్స్ అమల్లోకి వస్తుంది.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, హైకోర్టు శాశ్వత భవనాల టెండర్ల అంశాలపైనా మంత్రులు పూర్తిస్థాయిలో చర్చించి ఆమోదం తెలిపారు. ఎల్‌వన్‌గా నిలిచిన సంస్థలకు లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఇచ్చేందుకు క్యాబినెట్ అంగీకరించింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ క్యాబినెట్ సమావేశం మంగళవారం జరిగింది. ఏపీ సచివాలయంలో జరిగిన భేటీలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలను మంత్రిమండలి చర్చించి ఆమోదించింది. ఎస్సీ వర్గీకరణ, సీఆర్డీఏ, అసెంబ్లీ, హైకోర్టు నూతన భవనాలువంటి 24 ప్రధాన అంశాలే అజెండాగా క్యాబినెట్ చర్చలు జరిపింది. ఈ సందర్భంగా పలు అంశాలకు సంబంధించి మంత్రిమండలి ఆమోదం తెలిపింది.
జాతీయ ఎస్సీ కమిషన్‌నుంచి వచ్చిన ఎస్సీ వర్గీకరణ నివేదికపై మంత్రివర్గంలో పూర్తిస్థాయి చర్చ జరిగింది. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్‌ను చంద్రబాబు సర్కార్ నియమించిన సంగతి తెలిసిందే. ఆయన ఇచ్చిన నివేదికను ఏపీ శాసనసభలో ఆమోదించి జాతీయ ఎస్సీ కమిషన్‌కు పంపించారు. దాన్ని పరిశీలించిన జాతీయ ఎస్సీ కమిషన్ తిరిగి ఏపీ ప్రభుత్వానికి నివేదించింది. దీనిపై చర్చించిన మంత్రులు ఎస్సీ వర్గీకరణపై ఆర్డినెన్స్ జారీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అలాగే సీఆర్డీఏ 46వ అథారిటీ నిర్ణయాలకు సైతం మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, హైకోర్టు శాశ్వత భవనాల టెండర్ల అంశాలపైనా మంత్రులు పూర్తిస్థాయిలో చర్చించి ఆమోదం తెలిపారు.
ఎల్‌వన్‌గా నిలిచిన సంస్థలకు లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఇచ్చేందుకు క్యాబినెట్ అంగీకరించింది. రూ.617 కోట్లతో అసెంబ్లీ, రూ.786 కోట్లతో హైకోర్టు భవన నిర్మాణాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. నిర్మాణ పనులను ఎల్1 బిడ్డర్‌కు అప్పగించాలని నిర్ణయించింది. స్టేట్ సెంటర్ ఫర్ క్లైమేట్ ఇన్ సిటీస్ వ్యవస్థల ఏర్పాటును ఆమోదించింది. పట్టణ ప్రాంతాల్లో వరద నిర్వహణకు ప్రత్యేక వ్యవస్థలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అలాగే రూ.30,667 కోట్ల పెట్టుబడులతో 16 సంస్థల ఏర్పాటుకు ఇటీవల పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్‌ఐపిబి) 5వ సమావేశంలో నిర్ణయించారు. వీటిద్వారా 32,133మందికి ఉద్యోగాలు వస్తాయని అంచనా వేస్తున్నారు. ఈ పనులకు కూడా ఏపీ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈనెల 26న మత్స్యకార భరోసా సాయం కింద రూ.20 వేలు వేసేందుకు కాబినెట్ నిర్ణయించింది.
విశాఖలోని ఐటీహిల్ -3 పైన టీసీఎస్‌కు 2166 ఎకరాలు, ఉరుస క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు 3.5 ఎకరాలు కేటాయిస్తూ కేబినెట్ నిర్ణయం. ఉరుస క్లస్టరుకు కాపులుప్పాడలో 56 ఎకరాల భూమిని కేటాయింపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బలిమెల, జోలాపుట్ రిజర్వాయర్ల వద్ద చేపట్టాల్సిన హైడల్ ప్రాజెక్టులకు సంబంధించిన నిర్మాణాలపై ఒడిశా పవర్ కన్సార్టియంకు కూడా రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. 30 మెగావాట్ల సామర్థ్యంతో 2 హైడల్ ప్రాజెక్టుల నిర్మాణానికి జలవనరుల శాఖ చేసిన ప్రతిపాదనలను కేబినెట్ ఆమోదం తెలిపింది. వివిధ ప్రాంతాల్లో పవన విద్యుత్, సౌర విద్యుత్ ప్లాట్ల ఏర్పాటుకు కేబినెట్ పచ్చజెండా ఊపింది.
ఒప్పంద సమయంలో పనిచేయని కాలానికి పరిహారం చెల్లించడానికి ఎటువంటి అదనపు చెల్లింపు అవసరం లేకుండా ఏడు పూర్వ జిల్లాల (శ్రీకాకుళం, విజయనగరం, తూర్పు గోదావరి, గుంటూరు, చిత్తూరు, కడప, అనంతపురం) సీనరేజ్ ఫీజు వసూలు కాంట్రాక్టుల కాంట్రాక్ట్ వ్యవధిని పొడిగించడానికి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ చిన్న ఖనిజాల విధానం 2025ను మంత్రివర్గ సమావేశంలో ఆమోదించారు. ఈ విధానం ద్వారా రాష్ట్రంలో ఖనిజ ఉత్పత్తులు పెరగడం,పెట్టుబడిదారులను ఆకర్షించడం, కార్యకలాపాలను పెంచడం, సుస్థిర గణన పద్ధతులను ప్రోత్సహించడం, అనుసరణను సరళీకరించడం, పాత సమస్యలను పరిష్కరించడం, పారదర్శక సాంకేతిక నియంత్రణను అమలు చేయడం, రాష్ట్ర ఖజానాకు నిశ్చితమైన ఖనిజ ఆదాయాన్ని నిర్ధారించడం లక్ష్యంగా పెట్టుకుంది.
ఏపీసీపీడీసీఎల్ పరిధిలోని మూడు పాత జిల్లాల్లో మిగిలిన 199కు సంబంధించిన 11 కేవీ మిశ్రమ వ్యవసాయ ఫీడర్ల విభజన పనులను చేపట్టడానికి మంజూరు చేసిన సవివర ప్రాజెక్ట్ నివేదికలను ఆమోదించడానికి, ఆర్డీఎస్‌ఎస్ కింద పనులు చేపట్టడానికి చేసిన ప్రతిపాదనలకు కేబినెట్ ఓకే చెప్పింది. ఏలూరు జిల్లా ద్వారక తిరుమల మండలంలోని రాఘవపురం శివారు జగన్నాధపురంలో 30 ఎకరాల ప్రభుత్వ భూమిని ‘శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం’ అభివృద్ధి కోసం దేవాదాయ శాఖకు ఉచితంగా కేటాయించడానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. చిత్తూరు జిల్లా కుప్పం మండలం బైరుగనిపల్లె గ్రామంలో కేంద్రీయ విద్యాలయం స్థాపనకు ప్రభుత్వ భూమిని పట్టాభూమిగా మార్పునకు ఓకే చెప్పింది. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలోని కృష్ణపట్నం గ్రామంలో ఏర్పాటు చేయనున్న ఇండస్ట్రీయల్ పార్క్‌కు 87.56 ఎకరాల ప్రభుత్వ భూమిని ఏపీఐఐసీకి ఉచితంగా కేటాయిస్తూ చేసిన ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. అలాగే, నేలటూరు గ్రామంలో ఇండస్ట్రీయల్ పార్క్‌కు 220.81 ఎకరాల ప్రభుత్వ భూమిని ఉచితంగా కేటాయించేందుకు చేసిన ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది.
త్వరలోనే డిఎస్సీ నోటిఫికేషన్: నిమ్మల
మంత్రివర్గ నిర్ణయాలను జల వనరుల మంత్రి నిమ్మల రామానాయుడు మీడియాకు వివరించారు. త్వరలోనే డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేస్తామన్నారు. వచ్చే విద్యా సంవత్సరంలోగా ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తామని స్పష్టం చేశారు. ఈనెల 26న మత్స్యకార భరోసా సాయం కింద లబ్దిదారులకు రూ.20వేలు పంపిణీ చేస్తామన్నారు. ‘‘రాష్ట్రంలో టీసీఎస్ విస్తరణకు భూమి కేటాయించాలని నిర్ణయించాం. ఐటీని విస్తరించేందుకు మంత్రి లోకేశ్ ప్రయత్నిస్తున్నారు. భూగర్భ కేబుల్ వ్యవస్థ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నాం. గుంటూరులో ఈఎస్‌ఐ ఆస్పత్రికి ఉచితంగా భూమి ఇవ్వాలని నిర్ణయించాం. గ్రేహౌండ్స్ విభాగానికి కొత్తవలసలో భూమి కేటాయిస్తాం. రాష్ట్రవ్యాప్తంగా మంచి రోడ్లు వేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. తెదేపా అధికారంలోకి వచ్చిన తర్వాతే ప్రజలకు సామాజిక న్యాయం జరిగింది’’ అని నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు.
రోస్టర్ అమలుకు నిర్ణయం: మంత్రి డోలా
ఎస్సీ ఉపవర్గీకరణకు కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. ఎస్సీ ఉపవర్గీకరణలో 200 పాయింట్ల రోస్టర్ అమలుకు కేబినెట్ నిర్ణయం తీసుకుందన్నారు. ‘‘విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల ఫలాలు సమానంగా అందేలా చర్యలు తీసుకుంటాం. ఎస్సీ ఉపవర్గీకరణ కింద గ్రూప్-1లో 12 ఉపకులాలకు 1శాతం రిజర్వేషన్ రానుంది. గ్రూప్-2లో 18 ఉపకులాలకు 6.5 శాతం రిజర్వేషన్ అమలు కానుంది. గ్రూప్-3లో 29 ఉపకులాలకు 7.5 శాతం రిజర్వేషన్ వర్తించనుంది. అన్ని జిల్లాల్లో ఈ ఆర్డినెన్స్ అమల్లోకి వస్తుంది’’ అని తెలిపారు.
ఎవ్వరినీ వదలం: హోంమంత్రి అనిత
తిరుపతి ఆధ్యాత్మికంగా చాలా సున్నితమైన ప్రదేశమని, కానీ అక్కడా విద్వేషాలు రెచ్చగొట్టేందుకు వైసీపీ కుట్రలు చేస్తోందని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. ఎస్వీ గోశాలలో ఆవులు మృతిచెందాయంటూ తప్పుడు ప్రచారం చేశారని మండిపడ్డారు. క్యాబినెట్ మీటింగ్ అనంతరం హోంమంత్రి మీడియాతో మాట్లాడారు. గతంలోనూ పింక్ డైమండ్ అని చెప్పి ప్రభుత్వంపై బురదజల్లారని అనిత ఆగ్రహించారు. చివరికి విచారణలో అసలు పింక్ డైమండే లేదని తేలిందని చెప్పుకొచ్చారు. పాస్టర్ ప్రవీణ్ విషయంలోనూ కొందరు పాస్టర్ల ముసుగులో మాట్లాడకూడని మాటలు మాట్లాడారని దుయ్యబట్టారు. మతసామరస్యాన్ని దెబ్బతీయడానికి చాలా ప్రయత్నాలు చేశారని ఆరోపించారు. పవన్ కల్యాణ్ పర్యటన వల్ల విద్యార్థులు పరీక్షలకు ఆలస్యం అయ్యారనే వార్తలో నిజం లేదని తేల్చి చెప్పారు. అసత్య ఆరోపణలు చేస్తున్న ప్రతి ఒక్కరిపై చర్యలు ఉంటాయని హోంమంత్రి అనిత హెచ్చరించారు.