- ప్రజలు, ప్రాంతాలమధ్య చిచ్చుపెట్టే కుట్రలు సాగకూడదు
- ప్రభుత్వంపై బురదచల్లే ప్రయత్నాలను ఉపేక్షించొద్దు
- కట్రమి నేతలంతా అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి
- ప్రజాభీష్టం మేరకే కూటమి ప్రభుత్వ నిర్ణయాలు
- వక్ఫ్ బిల్లుపై వైసీపీ వైఖరిని ఎండగట్టాలి
- సూర్యఘర్ పథకాన్ని వేగంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి
- కేబినెట్ అనంతరం మంత్రులతో భేటీలో సీఎం చంద్రబాబు
అమరావతి (చైతన్య రథం): పచ్చి అబద్ధాలతో ప్రభుత్వ ప్రతిష్టపై బురదజల్లే కుట్రలకు పాల్పడుతున్న వైసీపీపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టేందుకు వైసీపీ కుట్రలు చేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల, తిరుమల గోశాల, వక్ఫ్ బిల్లువంటి అంశాలపై వివిధ వర్గాల ప్రజలను రెచ్చగొట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ నేతలంతా ఒకదానివెంట మరొకటిగా సమస్యలను తీసుకువచ్చి ఏపీ ప్రభుత్వంపై బురదచల్లే ప్రయత్నాలు చేస్తున్నారని ఆగ్రహించారు. ఏపీ క్యాబినెట్ సమావేశం అనంతరం మంత్రులతో సీఎం చంద్రబాబు మాట్లాడారు. కూటమి నేతలంతా అప్రమత్తంగా ఉండాలని, పాస్టర్ ప్రవీణ్ విషయంలో అన్ని సాక్ష్యాలు చూపించినా ఇంకా బురదచల్లే ప్రయత్నాలు చేస్తోన్న వైసీపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాజంలో అశాంతిరేపి అల్లర్లు సృష్టించాలని వైసీపీ నేతలు కుట్రలు చేస్తున్నారని అన్నారు.
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ‘‘మనం ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజలకు క్లియర్‌గా చెప్పి చేద్దాం. వక్ఫ్ బిల్లు, ఎస్సీ వర్గీకరణ అంశాల్లో మనం క్లియర్‌గా ఉన్నాం. వక్ఫ్ బిల్లుపై వైసీపీ మూడు రకాలుగా వ్యవహరించింది. ఆ పార్టీ ఎంపీలు లోక్‌సభలో వ్యతిరేకిస్తూ రాజ్యసభలో అనుకూలంగా ఓటేశారు. మరోవైపు బయటికొచ్చి మళ్లీ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. పాస్టర్ ప్రవీణ్ విషయంలోనూ విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రవర్తిస్తున్నారు. వైసీపీ వైఖరి ఎలా ఉందనేది అందరికీ అర్థం అవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం, కూటమి నేతలు ఇలాంటి విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి. రాజధాని అమరావతిలో అన్ని పనులకు టెండర్లు పిలిచాం. రహదారులు, రైతుల రిటర్నబుల్ ప్లాట్లలో మౌలిక సదుపాయాలు కల్పనకూ టెండర్లు పిలిచాం. భవనాలన్నింటికీ టెండర్లు ఖరారు చేశాం. వీటన్నింటినీ మూడేళ్లలో పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నాం.
అందుకు అనుగుణంగానే ప్రణాళికలు రూపొందించామని మంత్రులతో చర్చించారు. ఇన్‌ఛార్జ్ మంత్రులు జిల్లాల పర్యటను వెళ్లినప్పుడు మూడు పార్టీలు నేతలను సమన్వయం చేసుకుంటూ కార్యక్రమాలు నిర్వహించాలి. సూర్యఘర్ పథకాన్ని ఇంకా వేగంగా అమలు చేయాలి. ప్రభుత్వ భవనాలపైనా సూర్యఘర్ ఫలకాలు అమర్చాలి. రాజకీయంగా మేమంతా ఎక్కడా తప్పు చేయడం లేదు. కానీ అధికారుల అవినీతిపై ఎక్కువగా చర్చ జరుగుతోంది. దీన్ని వారు సరిచేసుకోవాల్సిన అవసరం ఉంది. లేనిపక్షంలో తగిన చర్యలు ఉంటాయి. జిల్లాస్థాయిల్లో రెవెన్యూ అంశాల సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వీటిలో పోలీసులు జోక్యం చేసుకుంటున్నారని తెలిసింది. అందరూ జాగ్రత్తగా పని చేయాలని’’ అని మంత్రులకు చంద్రబాబు సూచించారు.