- అంబేద్కర్ జయంతి రోజున సీఎం చంద్రబాబు వరం
- ఎస్సీ పిల్లలకు అత్యున్నతమైన విద్య అందించడమే లక్ష్యం
- మరిన్ని రెసిడెన్షియల్ స్కూళ్లు ఏర్పాటుకు సిద్ధం
- గత ప్రభుత్వం అమరావతిని నాశనం చేస్తే… మేము నిర్మిస్తున్నాం..
- దళితుల కోసం యుద్ధం చేసిన యోధుడు అంబేద్కర్
- అంబేద్కర్ స్ఫూర్తితో దళిత అభ్యున్నతికి టీడీపీ కట్టుబడి ఉంది
- అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు
- తాడికొండ నియోజకవర్గం పొన్నెకల్లులో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
అమరావతి (చైతన్య రథం): దళితుల కోసం యుద్ధం చేసిన యోధుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని, ఆ మహనీయుని స్ఫూర్తితో దళితుల అభ్యున్నతి, సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఎస్సీ విద్యార్థులు విదేశాల్లో చదవాలన్న కలను మళ్లీ నిజం చేస్తామని, అంబేద్కర్ విదేశీ విద్యా దీవెనను తిరిగి ప్రారంభిస్తున్నామని ప్రకటించారు. భవిష్యత్‌లో ఎస్సీ పిల్లలకు నాణ్యమైన విద్య అందించేందుకు మరిన్ని రెసిడెన్షియల్ స్కూళ్లు ఏర్పాటు చేస్తామన్నారు. గత పాలకులు కక్షపూరితంగా అమరావతిని నాశనం చేశారని, ప్రజల ఆశీస్సులతో ప్రపంచంలోనే మేటి నగరంగా అమరావతిని తీర్చిదుద్దుతామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. తాడికొండ నియోజకవర్గం పొన్నెకల్లులో అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి అక్కడ ఏర్పాటు చేసిన ప్రజావేదిక సభలో మాట్లాడారు.
భారత ప్రజాస్వామ్యానికి దశ- దిశ చూపిన అంబేద్కర్
1891 ఏప్రిల్ 14న మహారాష్ట్రలోని మోవ్ గ్రామంలో అంబేద్కర్ జన్మించారు. ఆ రోజుల్లో బడుగులంటే సమాజంలో చిన్నచూపు ఉండేది. అంటరానితనం, వివక్ష, అసమానత, అవమానాలపై అంబేద్కర్ అలుపెరుగని పోరాటం చేశారు. దళితుల కోసం యుద్ధం చేశారు. 1927లో దళితులకు నీటి హక్కు కల్పించారు. 1930లో కాలారం ఆలయ ప్రవేశం చేయడమే కాకుండా తనవెంట దళితులను ఆలయానికి తీసుకెళ్లారు. 1947లో స్వాతంత్య్రం వచ్చాక తొలి మంత్రివర్గంలో కీలకపాత్ర పోషించారు. సామాజిక న్యాయం, మౌలికహక్కులు, సమానత్వం గురించి రాజ్యాంగంలో పొందుపరిచారు. రాజ్యాంగం ఒక పేపరో, పుస్తకం కాదు… పవిత్రమైన గ్రంథం. భారత ప్రజాస్వామ్యానికి దశ, దిశా నిర్దేశించిన వ్యక్తి అంబేద్కర్. ఆయన ఏ ఒక్కరి వ్యక్తో, ఓ వర్గానికో ప్రతినిధి కాదు.. మనందరివాడు అని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు.
దళితుల సంక్షేమం టీడీపీతోనే
పార్టీ ఆవిర్భావం నుంచీ దళితుల సంక్షేమానికి తెలుగుదేశం పెద్దపీట వేస్తోంది. 2002లో ముందగుడు కార్యక్రమం పెట్టాం. స్టడీ సెంటర్లు పెట్టి ఎస్సీ, ఎస్టీ పిల్లలను చదివించాం. అంబేద్కర్ విదేశీ విద్యానిధి పథకం ద్వారా పేద విద్యార్థులను చదివిస్తాం. ఈ పథకాన్ని మరింత మెరుగుపరుస్తాం. గతంలో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రూ.15 లక్షలు, బీసీ, ఈబీసీ, కాపు, మైనారిటీ విద్యార్థులకు రూ.10 లక్షలు ఆర్థిక సాయం చేశాం. సుమారు 7 వేలమందిని చదివించాం. ఇందుకోసం రూ.467 కోట్లు వెచ్చించాం. 2014-2019 మధ్య 619 మంది ఎస్సీ విద్యార్థులను, 55మంది ఎస్టీ విద్యార్థులను చదివించాం. ఇందుకోసం రూ.50 కోట్లు ఖర్చు చేశాం. గత ప్రభుత్వం కేవలం 430మందినే చదివించింది. దీన్నిబట్టి పేదలపై వారికి ఏమాత్రం ప్రేమ ఉందో అర్ధం చేసుకోవచ్చు. సబ్ ప్లాన్ తెచ్చాం. ఎస్సీ రైతుల కోసం రూ.1,300 కోట్లు, హార్టికల్చర్ రంగంలోని ఎస్సీల కోసం రూ.130 కోట్లు, ఇళ్ల నిర్మాణానికి రూ.1,253 కోట్లు, గ్రామాల్లో అభివృద్ధి పనులకు రూ.1,200 కోట్లు, జలజీవన్ మిషన్ కింద రూ.478 కోట్లు ఖర్చు చేస్తాం. రాష్ట్రవ్యాప్తంగా 1,241 ఎస్సీ సంక్షేమ హాస్టళ్లలో 2 లక్షల 35 వేల 600 మంది విద్యార్థులున్నారు. వారికి రూ.1,331 కోట్లు ఖర్చు చేస్తున్నాం. రాష్ట్రంలో 21 లక్షల పేద ఎస్సీ, ఎస్టీ కుటుంబాలు ఉన్నాయి. వారి కోసం 200 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇస్తున్నాం.
మీ ఇళ్లపై సోలార్ ప్యానెల్స్ పెట్టి కరెంటు ఉత్పత్తి చేసి 200 యూనిట్లు వాడుకుని మిగిలింది ప్రభుత్వానికి ఇస్తే రూ.యూనిట్‌కు 2.09 పైసలు ఇస్తాం. దీనివల్ల మీ ఆదాయం పెరుగుతుంది. నెలకు మీరు 100 యూనిట్లు ఇస్తే రూ.210 రూపాయిలు మీ అకౌంట్‌లో పడతాయి. ఏడాదికి రూ.2500 నుంచి 3000 వేల వరకూ అదనపు ఆదాయం వస్తుంది. ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు ఇల్లు కట్టుకునేందుకు 50 వేలు అదనంగా డబ్బు ఇస్తాం. ఇందుకోసం రూ.780 కోట్లు ఖర్చవుతుంది. ఏ సమాజపు పురోగతి అయినా ఆ సమాజంలోని బలహీన వర్గాల అభివృద్ధిపై ఆధారపడుతుందని అంబేద్కర్ అన్నారు. ఒక ప్రముఖ వ్యక్తికి గొప్ప వ్యక్తికి వ్యత్యాసం ఏమంటే గొప్పవ్యక్తి సమాజసేవకుడిగా ఉండేందుకు సిద్ధపడతాడు. గొప్ప వ్యక్తి కావాలంటే పేదలకు అండగా నిలబడి వారిని పైకి తేవాలి. అప్పుడు మీరు గొప్ప వ్యక్తులవుతారు. నేను ఇచ్చిన మాట ప్రకారం పేదలకు అండగా నిలబడతాను. పేదలే దేవుళ్లు సమాజమే దేవాలయం అని చెప్పిన ఎన్టీఆర్ స్ఫూర్తితో ముందుకెళ్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు మంచి స్థానాల్లో ఉన్నారు. 2047 నాటికి దేశంలోనే నెంబర్ వన్ స్టేట్‌గా ఏపీ నిలుస్తుంది అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
ప్రపంచంలోనే మేటి నగరంగా అమరావతి
గత ప్రభుత్వంలో పాలకులు అమరావతిని చంపేశారు. ఎడారి, స్మశానం అని ఎగతాళి చేశారు. మూడు రాజధానుల పేరుతో అమరావతిపై విష ప్రచారం చేశారు. కులం, మతం, ప్రాంతాల వారీగా వైషమ్యాలు రగిల్చిన వారికి ప్రజలు బుద్ధి చెప్పారు. ప్రజల ఆశీస్సులతో అమరావతిని అత్యద్భుతంగా తీర్చిదిద్దుతాం. అమరావతికి దేశంలోని ప్రఖ్యాత విద్యాసంస్థలు రాబోతున్నాయి. ఇప్పటికే ఎస్‌ఆర్‌ఎమ్, విట్ కొలువుదీరాయి. అన్ని కాలేజీలను తీసుకొచ్చి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తామని సీపం హామీ ఇచ్చారు.
కూటమి పాలనలో ప్రజలకు స్వేచ్ఛ
నేను నా ప్రజలకు ఆయుధం ఇవ్వలేదు. దానికి బదులుగా ఓటుహక్కు ఇచ్చాను. దాన్ని ఉపయోగించుకుని ధీరుడిగా అవుతారో, లేక దానిని అమ్ముకుని బానిసలుగా మారతారో వారి చేతుల్లో ఉందని అంబేద్కర్ అన్నారు. మొన్నటి ఎన్నికల్లో సరిగ్గా అదే జరిగింది. మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకుని ఆంధ్రప్రదేశ్ ఓటర్లు అందరూ ధీరులమని నిరూపించుకున్నారు. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక ప్రజలకు స్వేచ్ఛ లభించింది. గత ప్రభుత్వంలో ఐదేళ్లు మాట్లాడాలంటేనే ప్రజలు భయపడ్డారు. నేను ఎప్పుడూ చూడని రాజకీయం ఆ ఐదేళ్లలో చూశాను. నాలాంటి వారు కూడా బయటకు రాలేని పరిస్థితి. కష్టాలన్నీ పోయాయి. మన పాలనలో స్వర్ణయుగం రానుంది. గత పాలనలో ప్రజలను సభలకు బలవంతంగా తీసుకొచ్చేవారు. ప్రజలు పారిపోతుంటే చుట్టూ కందకాలు తవ్వారు. పాలకులు హెలికాఫ్టర్‌లో వస్తుంటే కింద చెట్లు కూల్చేవారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడమే కాకుండా నష్టపోయిన రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలనే ఉద్దేశంతో జనసేన, బీజేపీతో కలిసి కూటమిగా ఎన్నికలకు వెళ్లాం. అద్వితీయమైన గెలుపును ప్రజలు అందించారు. 10 నెలల్లో ఊహించిన దానికంటే ఎక్కువే చేశాం. చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా సూపర్ సిక్స్ ద్వారా పేదలకు అండగా నిలబడ్డాం. దీపం 2 పథకం ద్వారా ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తున్నాం. ఓ వైపు సంక్షేమం -అభివృద్ధి, మరోవైపు సుపరిపాలన… ఇదే ఎన్డీఏ ప్రభుత్వ విధానమని గర్వంగా చెబుతున్నాను.
కుల వివక్షపై పోరాడాం
పార్టీ ఆవిర్భావం నుంచి కుల వివక్షతపై తెలుగుదేశం యుద్ధం చేసింది. 694 జీవో ప్రకారం జిల్లా, డివిజన్, మండలస్థాయిలో ఎస్సీ, ఎస్టీల సమస్యల పరిష్కార కోసం ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశాం. అధికారులంతా వారానికోసారి గ్రామానికి వెళ్లేలా ఆదేశాలిచ్చాం. కుల వివక్ష చూపే వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టేందుకు ఆదేశాలు ఇచ్చాం. దేవాలయాలు, బహిరంగ ప్రదేశాల్లో అంటరానితనం నిర్మూలనకు చర్యలు తీసుకున్నాం. ఎస్సీ అట్రాసిటీ కేసుల పరిష్కారం కోసం ప్రత్యేక కోర్టులు పెట్టాం. మొదటిసారిగా దళితుణ్ణి లోక్‌సభ స్పీకర్‌ని చేసిన ఘనత తెలుగుదేశానిదే. ఎస్సీ బిడ్డ బాలయోగి స్పీకర్‌గా బ్రహ్మాండంగా రాణించి దేశాన్ని మెప్పించారు. 1999లో దళిత మహిళ ప్రతిభా భారతిని అసెంబ్లీ స్పీకర్‌ని చేసిన ఘనత కూడా తెలుగుదేశానికే దక్కింది. ఎన్టీఆర్ నేషనల్ ఫ్రంట్ అధ్యక్షునిగా ఉన్నప్పుడే బిఆర్ అంబేద్కర్‌కి భారతరత్న వచ్చింది. ఎన్డీఏ ప్రభుత్వంలోనే అంబేద్కర్ ఫోటో పార్లమెంటులో పెట్టారు. నేను యునైటడ్ ఫ్రంట్ కన్వీనర్‌గా ఉన్నప్పుడు ఎస్పీ వర్గానికి చెందిన నారాయణన్‌ను రాష్ట్రపతిని చేశాం. నాటి ప్రధాని వాజ్‌పేయి సహకారంతో అబ్దుల్ కలామ్‌ని రాష్ట్రపతిని చేయడంలోనూ టీడీపీ పాత్ర ఉన్నందుకు గర్వంగా ఉంది అన్నారు.
అర్హులందరికీ సంక్షేమం
ప్రతి ఇంటికి కుళాయి ద్వారా సురక్షితమైన నీరు, అర్హులకు ఉచిత కరెంటు, ఇండ్లపై సోలార్ రూఫ్ టాప్‌ల ఏర్పాటు, ఇంటర్నెట్, మరుగుదొడ్లు నిర్మాణం, సొంతింటిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఒకప్పుడు రోడ్లు సరిగా ఉండేవి కావు. టెలిఫోన్ సౌకర్యం సరిగా లేదు. ఒకప్పుడు చదువుకోవాలంటే స్కూళ్లు లేవు, ప్రభుత్వం, ప్రవేటు భాగస్వామ్యంలో అన్నీ వచ్చాయి. ఒకప్పుడు ప్రభుత్వ లైసెన్స్ వస్తేనే ఇండస్ట్రీ పెట్టాలి. ఇప్పుడు తెలివి ఉంటే చాలు ఇండస్ట్రీ పెట్టొచ్చు. ఆదాయంతో పాటు ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయి. దీన్ని అరికట్టాలి అని సీపం చంద్రబాబు పిలుపునిచ్చారు.