- పరామర్శకు వచ్చి జేజేలు కొట్టించుకుంటారా
- జగన్ తీరుపై మండిపడ్డ పరిటాల సునీత
రాప్తాడు (చైతన్యరథం): చావు ఇంటికి పరామర్శకు వచ్చి జేజేలు కొట్టించుకోవటం పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డికే చెల్లిందని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత ఎద్దేవా చేశారు. పోలీసులను బెదిరిస్తూ జగన్ మాట్లాడటాన్ని ఆమె తీవ్రంగా తప్పుబట్టారు. రాప్తాడు నియోజకవర్గంలో మంగళవారం జగన్ మోహన్ రెడ్డి పర్యటనపై ఎమ్మెల్యే పరిటాల సునీత తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పులివెందుల ఎమ్మెల్యే జగన్ పరామర్శకు వచ్చారా.. ఎన్నికల ప్రచారానికి వచ్చారా అని ధ్వజమెత్తారు. చావు ఇంటికి వచ్చి జేజేలు కొట్టించుకుంటున్నారని మండిపడ్డారు. పరామర్శ సమయంలో జగన్ నవ్వుతున్నాడో… ఏడుస్తున్నావో అర్థం కావడం లేదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పాపిరెడ్డిపల్లిలో హత్యకు గురైన లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చిన జగన్ రెడ్డి మాట్లాడినవన్నీ పచ్చి అబద్ధాలన్నారు.
మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి రాసిచ్చిన స్క్రిప్ట్‌ను జగన్ చదివారని విమర్శించారు. పరీక్షల్లో కాపీ కొట్టినట్టుగా పేపర్లు చూసి చదువుతున్నారని ఎద్దేవా చేశారు. పాపిరెడ్డిపల్లిలో అనుకోకుండా జరిగిన సంఘటనను జగన్ రెడ్డి రాజకీయం చేస్తూ, గ్రామాల్లో తిరిగి ఫ్యాక్షన్ రెచ్చగొట్టేందుకు కుట్ర పన్నుతున్నారన్నారు. గ్రామాల్లోకి వచ్చి చిచ్చు పెట్టాలని జగన్ చూస్తున్నారని ఆరోపించారు. జగన్ చిన్నాన్నను చంపితే న్యాయం చేయమని చెల్లలు సునీత అడుగుతోందని, చెల్లెలికి న్యాయం చేయలేని జగన్ ఇక్కడికొచ్చి ఏం చేస్తారని ప్రశ్నించారు. తల్లి, చెల్లెళ్లకు న్యాయం చేయలేని జగన్.. లింగమయ్య కుటుంబానికి ఏం న్యాయం చేస్తారని నిలదీశారు. పోలీసులను గుడ్డలూడదీస్తానని జగన్ బెదిరించటం తగదన్నారు. జగన్ చేసిన వ్యాఖ్యల మీద పోలీసులు స్పందించాలని సునీత డిమాండ్ చేశారు.
“