తిరుపతి (చైతన్యరథం): వైసీపీ అధ్యక్షుడు జగన్ వీధి రౌడిలా మాట్లాడటం మానుకోవాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు మండిపడ్డారు. చిల్లర మాటలు మాట్లాడటం సరికాదన్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లా రాప్తాడులో పర్యటించిన జగన్.. పోలీసులను బట్టలూడదీసి కొడతానని, వారి యూనిఫాంలు తీయిస్తానంటూ రెచ్చిపోయిన ఘటనపై స్పందించారు. పోలీసులు చట్టపరిధిలోనే పనిచేస్తున్నారన్నారు. తిరుపతిలో మంగళవారం పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. కడపలో మహానాడును ఘనంగా నిర్వహిసామన్నారు. పదవులు రాలేదనే ఆవేదన నేతల్లో ఉంది. త్వరలోనే అన్ని పదవులూ భర్తీ చేస్తాం. తిరుమలను గత ఐదేళ్లలో అపవిత్రం చేశారు. కూటమి ప్రభుత్వం తిరుమలకు పూర్వ వైభవం తీసుకొస్తోంది. వైసీపీ హయాంలో టీడీఆర్ బాండ్ల వ్యవహారంపై దర్యాప్తు జరుగుతుంది’’ అని అన్నారు. రామగిరి మండలం పాపిరెడ్డిపల్లిలో ఇటీవలే హత్యకు గురైన వైసీపీ కార్యకర్త కురబ లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించిన జగన్ మాట్లాడుతూ పోలీసు అధికారులపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీసులను యూనిఫాం ఊడబీకి ఉద్యోగాల్లేకుండా చేస్తామని జగన్ హెచ్చరించారు. పోలీసుల బట్టలూడదీస్తానని జగన్ అనడం ఇదే మొదటి సారి కాదు. ఇంతకు ముందు కూడా పలు సందర్భాల్లో ఇదే విధంగా సంస్కారం లేకుండా మాట్లాడారు.