- వచ్చే నాలుగేళ్లు పూర్తిగా విద్యాప్రమాణాల మెరుగుదలపైనే దృష్టి
- ఆగస్టులో విద్యామంత్రుల కాంక్లేవ్‌కు విస్తృత ఏర్పాట్లు
- మే నెలాఖరుకు పూర్తిస్థాయి వివరాలతో డ్యాష్ బోర్డు సిద్ధం చేయండి
- న్యాయపరమైన చిక్కులు లేకుండా మెగా డీఎస్సీ నోటిఫికేషన్
- విద్యాశాఖ అధికారులతో సమీక్షలో మంత్రి నారా లోకేష్ ఆదేశాలు
అమరావతి (చైతన్యరథం): విద్యాశాఖలో చేపట్టిన సంస్కరణలను జూన్ నాటికి పూర్తిచేయాలని అధికారులను రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. విద్యాశాఖలో సంస్కరణలు, మెగా డీఎస్సీ, ఎస్‌ఎస్‌సి, ఇంటర్ ఫలితాలు, డ్యాష్ బోర్డు రూపకల్పన తదితర అంశాలపై అధికారులతో మంగళవారం లోకేష్ సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ… పూర్తిస్థాయి సంస్కరణల తర్వాత రాబోయే నాలుగేళ్లు విద్యాప్రమాణాల మెరుగుదలపైనే దృష్టి సారించాలని దిశానిర్దేశం చేశారు. న్యాయపరమైన చిక్కులు లేకుండా సాధ్యమైనంత త్వరగా మెగా డీఎస్సీ ప్రకటనకు ఏర్పాట్లు చేయాలన్నారు. ఎటువంటి సమస్యలు తలెత్తకుండా పకడ్బందీగా ఎస్‌ఎస్‌సి, ఇంటర్ ఫలితాల ప్రకటన విడుదలకు చర్యలు తీసుకోవాలని సూచించారు. సాంప్రదాయ ప్రసార మాధ్యమాలతోపాటు ప్రభుత్వం ఇటీవల అమలులోకి తెచ్చిన మనమిత్ర యాప్‌లో కూడా ఫలితాలు అందుబాటులో ఉంచేలా చర్యలు చేపట్టాలన్నారు.
ఆగస్టులో వివిధ రాష్ట్రాల విద్యామంత్రుల కాంక్లేవ్‌ను రాష్ట్రంలో నిర్వహించేందుకు కేంద్రమంత్రి ఇప్పటికే అంగీకారం తెలిపినందున, అందుకు విస్తృతమైన ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో లెర్నింగ్ అవుట్ కమ్స్, మౌలిక సదుపాయాలు, విద్యార్థుల అటెండెన్స్ వివరాలు, పెండిరగ్ ఫైల్స్ తదితర వివరాలతో పూర్తిస్థాయి డ్యాష్ బోర్డును మే నెలకల్లా సిద్ధం చేయాలని ఆదేశించారు. విద్యార్థులు లీప్ యాప్‌ను అపార్ ఐడితో లాగిన్ అయి వీక్షించే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇప్పటివరకు అపార్ ఐడి నమోదు 85శాతం పూర్తయిందని, సాంకేతిక సమస్యలను అధిగమించి పూర్తిస్థాయి అపార్ ఐడి పూర్తిచేయాలని సూచించారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వ స్కూళ్లలో ఎట్టి పరిస్థితుల్లో డ్రాపవుట్స్ ఉండకూడదని, అందుకు తగ్గట్లుగా చర్యలు చేపట్టాలని అన్నారు. సర్వశిక్ష నిర్వహణలో కొనసాగుతున్న పాఠశాలల్లో ఆన్ లైన్ విధానంలో పారదర్శకంగా అడ్మిషన్లు చేపడతున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుత సెలవుల్లో కేజీబీవీల్ల్లో టీచర్ల బదిలీలు పూర్తిచేసేందుకు మంత్రి లోకేష్ అంగీకారం తెలిపారు.
జీఓ 117కు ప్రత్యామ్నాయం సిద్ధం చేయాలి
అమరావతిలో సెంట్రల్ లైబ్రరీ, ట్రైనింగ్ అకాడమీ, ఆర్కివ్స్ మ్యూజియం నిర్మాణాలకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అన్నారు. విద్యార్థుల మేధస్సుకు పదును పెట్టే అధునాతన సాంకేతికతతో కూడిన క్లిక్కర్స్‌ను తొలుత 9వ తరగతి విద్యార్థులకు అందుబాటులోకి తేవాలని, పనితీరును బట్టి రాబోయే రోజుల్లో 6నుంచి 10తరగతులకు అమలు చేయాలని సూచించారు. జీఓ నెం.117కు ప్రత్యామ్నాయ జీఓను సాధ్యమైనంత త్వరగా సిద్ధం చేయాలని అన్నారు. ఈ విద్యాసంవత్సరం పాఠశాలలు తెరిచే రోజుకే పాఠ్యపుస్తకాలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే 48 శాతం పుస్తకాల ముద్రణ పూర్తయినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రంలో స్పెషల్ ఎడ్యుకేషన్‌కు సంబంధించిన పోస్టులకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు అమలుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. టీచర్ల బదిలీలు, పదోన్నతులకు సంబంధించి ఎటువంటి పైరవీలకు తావులేకుండా నిబంధనలకు లోబడి పూర్తి పారదర్శక చర్యలు చేపట్టాలని సూచించారు.
ఈ సమావేశంలో విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్, పాఠశాల విద్య డైరెక్టర్ విజయరామరాజు, ఇంటర్మీడియట్ విద్య డైరెక్టర్ కృతికా శుక్లా, కాలేజియేట్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నారాయణ్ భరత్ గుప్త, సర్వశిక్ష స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ బి.శ్రీనివాసరావు, ఏపీఈడబ్ల్యుఐడీసీ ఎండీ దీవెన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.