- అభివృద్ధి చేస్తానని మంత్రి లోకేష్ ఉద్ఘాటన
- ఇచ్చిన ప్రతిమాట నిలబెట్టుకున్నాకే మళ్లీ ఎన్నికల్లో ప్రజలముందుకు
- అయిదేళ్లపాటు సేవలతో మంగళగిరి ప్రజల మనసు గెలిచా
- రూపాయి అవినీతి లేకుండా పేదలకు వెయ్యికోట్ల ఆస్తి పంపిణీ
- మన ఇల్లు ` మన లోకేష్ కార్యక్రమంలో పేదలకు ఇంటిపట్టాలు అందజేసిన మంత్రి లోకేష్
మంగళగిరి (చైతన్యరథం): మంగళగిరి ప్రజలను నా గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటా, భారతదేశంలో నెం.1 నియోజకవర్గంగా మంగళగిరిని చేసే బాధ్యత నేను తీసుకుంటానని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ఉద్ఘాటించారు. మన ఇల్లు ` మన లోకేష్ కార్యక్రమంలో భాగంగా 3వ రోజు సోమవారం యర్రబాలెం డాన్‌బాస్కో స్కూలు ఆవరణలో తాడేపల్లి మండలం కొలనుకొండకు చెందిన 231 మందికి, పద్మశాలి బజార్‌కి చెందిన 127మంది పేదలకు మంత్రి లోకేష్ పట్టాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ…. 2019 ఎన్నికల్లో తొలిసారి ఎన్నికల్లో మంగళగిరి ప్రజల ముందు నిలబడ్డానన్నారు. నియోజకవర్గంపై పెద్దగా అవగాహన లేదు, మీ సమస్యలు తెలుసుకోలేకపోవడం, కేవలం ఎన్నికలకు 21రోజుల ముందు రావడంతో 5300 ఓట్ల తేడాతో ఓడిపోయా. ఓడిన రోజు కొంచెం బాధ పడ్డా. రెండోరోజు నుంచి నాలో కసి పెరిగింది, మంగళగిరి ప్రజలకు సేవ చేయాలని నిర్ణయించుకున్నాను. అయిదేళ్లపాటు సొంత నిధులతో సేవా కార్యక్రమాలు నిర్వహించా. సొంతగా 26 సంక్షేమ కార్యక్రమాలను అమలుచేశానని మంత్రి లోకేష్ గుర్తు చేశారు.
సేవా కార్యక్రమాలతో మంగళగిరి ప్రజల మనసు గెలిచా
ఎన్టీఆర్ సంజీవని పేరిట తాడేపల్లి, మంగళగిరి, దుగ్గిరాలలో మొబైల్ క్లినిక్‌లు ఏర్పాటుచేశా. గ్రామాల్లో పేదల పెళ్లిళ్లకు గౌరవంగా బట్టలు పెట్టడం, ఉచితంగా ట్యాంకర్లతో తాగునీరు సరఫరా, పిల్లలు క్రికెట్ ఆడుకునేందుకు ప్లేగ్రౌండ్స్ ఏర్పాటుచేశాం, మంగళగిరి ప్రీమియర్ లీగ్ నిర్వహించాం. మహిళలు సొంతకాళ్లపై నిలబడాలనే ఉద్దేశంతో శిక్షణ ఇచ్చి కుట్టుమిషన్లు అందజేశాం. 2024లో రెండోసారి మీ ముందుకు వచ్చా. గెలిస్తే ఎంత చేస్తానో ఆలోచించాలని, 53వేల ఓట్లతో గెలిపించి అసెంబ్లీకి పంపించాలని కోరాను. ఎన్నికలకు ముందు సర్వేలో కుప్పం కంటే వెనుకబడి ఉన్నాం. ఆ తర్వాత ప్రజల్లో స్పందన చూశాక కుప్పం కంటే ఎక్కువ మెజారిటీ వస్తుందని చంద్రబాబుకి చెప్పాను. ఎవరూ ఊహించని విధంగా 91వేల మెజారిటీతో గెలిపించి శాసనసభకు పంపించారు. మంగళగిరిలో ఓడితే ఇబ్బంది అవుతుందని, 2 స్థానాల్లో పోటీ చేయమని కొందరు సన్నిహితులు చెప్పారు. అయితే.. 5 సంవత్సరాలు కష్టపడి మంగళగిరి ప్రజల మనసులను గెలుచుకున్నా, మంగళగిరి ప్రజల మధ్యే ఉంటానని వారికి చెప్పానని మంత్రి లోకేష్ తెలిపారు.
రచ్చబండలో ఇచ్చిన హామీ మేరకే పేదలకు పట్టాలు
ఎన్నికలకు ముందు రచ్చబండ కార్యక్రమానికి వచ్చినపుడు ఎక్కడ నివసించే వారికి అక్కడే స్థలాలు రెగ్యులరైజ్ చేయాలని స్థానికులు నాకు విజ్ఞప్తిచేశారు. వారికి ఇచ్చిన మాట ప్రకారం ఇప్పుడు 3వేల మందికి పట్టాలు అందజేస్తున్నాం. రెండో విడతలో రైల్వే, ఎండోమెంట్ భూముల్లో నివసించేవారికి ఏడాది లోగా అందజేస్తాం. జటిలమైన అటవీ భూములు, ట్యాంక్ బండ్‌లపై నివసించేవారికి 3వ విడతలో 3 ఏళ్లలో తప్పనిసరిగా శాశ్వత పట్టాలు అందజేస్తా. ఏపీ చరిత్రలో ఎక్కడా లేని విధంగా మంగళగిరి కోసం జీఓ తెస్తే అది అందరికీ ఉపయోగపడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా రెగ్యులరైజేషన్ కోసం 7వేల మంది దరఖాస్తుచేయగా, అందులో 4వేలమంది మంగళగిరి ప్రజలు ఉన్నారు. ఈరోజు 3వేల మందికి పట్టాలు ఇస్తున్నాం. పట్టాలు పొందిన లబ్ధిదారులు వాటిని రిజిస్టర్ చేసుకోవచ్చు, కుటుంబ అవసరాల కోసం పట్టాలు అమ్ముకునే హక్కు కూడా కల్పిస్తున్నాం. 5 రోజుల్లో వెయ్యికోట్ల విలువైన భూములను ఉచితంగా అందిన్నాం. పేదల పట్టాల అంశాన్ని కేబినెట్‌తో ఆమోదింపచేశానని మంత్రి లోకేష్ వివరించారు.
పారదర్శకంగా రూ.వెయ్యికోట్ల ఆస్తి పంపిణీ
రచ్చబండలో ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకునేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నా. మంగళగిరి ప్రజల చిరకాల కోరిక అయిన వందపడకల ఆసుపత్రికి ఈనెల 13వ తేదీన శంకుస్థాపన చేస్తాం. ఈ హాస్పటల్ నిర్మాణాన్ని ఏడాదిలోగా పూర్తిచేసే బాధ్యత ఏపీఎస్‌ఎంఐడీసీ చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావుది. మంగళగిరి నియోజకవర్గ పరిధిలో పోలీస్ స్టేషన్లు, పార్కులు, చెరువులు, చేనేత కార్మికులకు క్లస్టర్, స్వర్ణకారుల కోసం జెమ్స్ అండ్ జ్యుయలరీ పార్కు వంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టబోతున్నాం. ఇచ్చిన ప్రతిమాట నిలబెట్టుకున్న తర్వాతే వచ్చే ఎన్నికల్లో మళ్లీ మీ ముందుకు వస్తా. అదే నా లక్ష్యం. నియోజకవర్గ ప్రజలంతా ఒక్కసారి ఆలోచించండి. మీ ఇంటి కొలతలు తీసుకోవడానికి వచ్చినపుడు జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు ఎవరివద్దా ఒక్క కప్పు కాఫీ కూడా తాగలేదు. స్వచ్ఛందంగా మీకు సేవచేయడానికి వచ్చారు. ఒక్క రూపాయి అవినీతి లేకుండా వెయ్యికోట్ల ఆస్తి పేదలకు అందించాం. అది ఎన్‌డీఏ ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని మంత్రి లోకేష్ చెప్పారు.