తిరుమల (చైతన్యరథం): అభివృద్ధి పథంలో ఆంధ్రప్రదేశ్ ముందుండాలని శ్రీవారిని ప్రార్థించినట్లు హోంమంత్రి వంగలపూడి అనిత వెల్లడిరచారు. తిరుమల శ్రీవారిని కుటుంబసమేతంగా ఆమె ఆదివారం దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో మంత్రి అనిత స్వామివారి సేవలో పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఆమెకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామివారిని హోంమంత్రి దర్శించుకొని మొక్కులు చెల్లించారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వంలో రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోవాలని, రాష్ట్ర ప్రజలు బాగుండాలని శ్రీవారిని ప్రార్థించినట్లు అనిత తెలిపారు. శ్రీరామనవమి నాడు శ్రీవారిని దర్శించుకోవడం ఎంతో భాగ్యమని హోంమంత్రి అన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. అంతకుముందు శనివారం రాత్రి తిరుమలలోని భూవరాహ స్వామి ఆలయాన్ని హోంమంత్రి అనిత దర్శించుకున్నారు.