- పట్టువస్త్రాలను సమర్పించిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- కుమార్తెతో కలిసి పట్టువస్త్రాలు సమర్పించిన అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతిరాజు
- స్వామివారిని దర్శించుకొని పూజలు చేసిన మంత్రి గుమ్మిడి సంధ్యారాణి
రామతీర్థం (చైతన్యరథం): శ్రీరామనవమి పురస్కరించుకుని విజయనగరం జిల్లా రామతీర్థంలో సీతారాముల కల్యాణోత్సవం ఆదివారం అత్యంత వైభవంగా జరిగింది. దేవాదాయ శాఖ పర్యవేక్షణలో ఈ మహోత్సవం కనులపండుగగా సాగింది. దేవస్థానం కల్యాణోత్సవ మండపంపై సీతారాముల కల్యాణోత్సవాన్ని నిర్వహించారు. ఉదయం పది గంటలకు ఈ వేడుక ప్రారంభం కాగా… ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా కల్యాణోత్సవ మండపానికి తీసుకొచ్చారు. అనంతరం సీతారాముల కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. వేలాది మంది భక్తులు జేజేలు పలుకుతుండగా సీతమ్మవారి మెడలో శ్రీరామచంద్రుడు మాంగల్య ధారణ చేశారు. ముత్యాల తలంబ్రాలు పోశారు. ఈ అపూర్వ దృశ్యాలను చూసి భక్తులు పరవశించారు.
రాష్ట్ర ప్రభుత్వం తరపున ఎంఎస్‌ఎంఈ, సెర్ప్, ఎన్నారై వ్యవహారాల శాఖా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సతీసమేతంగా అధికార లాంఛనాలతో శ్రీ సీతారాములకు పట్టువస్త్రాలను, ముత్యాల తలంబ్రాలను సమర్పించారు. సంప్రదాయానుసారం ఆలయ అనువంశిక ధర్మకర్త, మాజీ కేంద్ర మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు, ఆయన కుమార్తె, విజయనగరం ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతిరాజుతో కలిసి స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఆనవాయితీ ప్రకారం సింహాచలం వరాహ లక్ష్మీ నృసింహస్వామి క్షేత్రం నుంచి పట్టు వస్త్రాలను, మంత్రి శ్రీనివాస్, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు దంపతుల చేతుల మీదుగా, సింహాచలం ఈవో సుబ్బారావు అందజేశారు. మంత్రి కొండపల్లి, ఎంపీ కలిశెట్టి దంపతులు కళ్యాణ మండపంలో కూర్చొని పరిణయ వేడుకను కనులారా తిలకించారు. అంతకుముందు రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖా మంత్రి గుమ్మిడి సంధ్యారాణి దంపతులు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.