- బలమైన ఆర్థిక వ్యవస్థగా ఏపీని ఆవిష్కరించాలన్నదే ఎన్డీఏ లక్ష్యం
- 10 నెలల్లోనే విధ్వంసమైన రాష్ట్రాన్ని గాడిలో పెట్టాం
- ఎస్సీ వర్గీకరణపై మాట నిలబెట్టుకున్నాం
- ఎస్సీల సంక్షేమం కోసం 27 పథకాలను అమలు చేశాం
- పీ-4తో రాష్ట్రంనుంచి పేదరికాన్ని తరిమికొడతాం
- ప్రకటించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
- ముప్పాళ్లలో ఘనంగా బాబూ జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు
- బాలికల గురుకుల వసతి గృహాన్ని సందర్శించిన చంద్రబాబు
ఎన్టీఆర్ జిల్లా, ముప్పాళ్ల (చైతన్య రథం): జగ్జీవన్‌రామ్ స్ఫూర్తితో బడుగుల అభ్యున్నతికి పునరంకితమవుతామని, బలమైన ఆర్థిక వ్యవస్థగా ఏపీని ఆవిష్కరించాలన్నదే ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యమని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఎస్సీల సంక్షేమం కోసం 27 పథకాలను అమలు చేశామని, ఎస్సీ వర్గీకరణపై ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామన్నారు. గత పాలకులు రాష్ట్రాన్ని సర్వశానం చేసి, రూ. 10 లక్షల కోట్ల అప్పల భారం మోపగా కేవలం 10 నెలల్లోనే విధ్వంసమైన రాష్ట్రాన్ని గాడిలో పెట్టామని అన్నారు. పేదరికంలేని సమాజమే తన లక్ష్యమని అందుకే పీ4 కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం ముప్పాళ్లలో జగ్జీవన్ రామ్ జయంతి వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. బాలికల గురుకుల వసతి గృహాన్ని సందర్శించారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.
జగ్జీవన్ స్ఫూర్తితో ముందుకెళ్తాం
జగ్జీవన్ రామ్ స్పూర్తితో అట్టడుగు వర్గాల అభ్యున్నతికి ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తోంది. చిన్నతనంలోనే సమాజంలోని అసమానతలపై జగ్జీవన్‌రామ్ పోరాడారు. ఆ రోజుల్లో పాఠశాలల్లో రెండు కుండల సిద్ధాంతం ఉంటే కుండలు బద్దలు కొట్టిన ధైర్యశాలి జగ్జీవన్‌రామ్. ఆయన సాధారణ కుటుంబంలో పుట్టి అసాధారణ శక్తిగా మారారు. జగ్జీవన్‌రామ్ 1935నుంచి 1977 వరకూ రాజకీయాల్లో ఉన్నారు. 30 ఏళ్లు కేంద్రంలో మంత్రిగా పనిచేశారు. 50 ఏళ్లు ఎంపీగా పనిచేశారు. ఏ పదవిని స్వీకరించినా దానికి వన్నె తెచ్చారని సీఎం చంద్రబాబు నివాళి అర్పించారు.
ఎస్సీ వర్గీకరణపై మాట నిలబెట్టుకున్నాం
ఎస్సీలు సమాజంలో ఎదుర్కొంటున్న అసమానతలు, అంటరానితనాన్ని కళ్లారా చూశాను. సమైక్యాంధ్రలో ముఖ్యమంత్రిగా అంటరానితనం రూపుమాపడానికి ఎన్నో జీవోలు జారీ చేశాం. గ్రామాల్లో సాంఘిక సమానత్వంపై అవగాహన సదస్సులు నిర్వహించాం. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అని నినదించిన ఎన్టీఆర్ స్పూర్తితో ఎస్సీ వర్గీకరణపై గళం విప్పాను. ఏబీసీడీ కేటగిరీ విభజన కోసం 1996లో కమిటీ వేశాం. అలా ఎస్సీ వర్గీకరణ సాకారం కావడంలో నా ప్రయాణం సుదీర్ఘంగా సాగింది. బడుగులకు రాజకీయ అవకాశాలు కల్పించిన ఘనత తెలుగుదేశానిదే. బాలయోగిని లోక్‌సభ స్పీకర్‌ని చేశాం. ప్రతిభా భారతిని అసెంబ్లీ స్పీకర్ చేశాం. ఎన్టీఆర్ నేషనల్ ఫ్రంట్ అధ్యక్షునిగా ఉన్నప్పుడు అంబేద్కర్‌కు భారతరత్న రావడంలోనూ, నేను యునైటెడ్ ఫ్రంట్ చైర్మన్‌గా ఉన్నప్పుడు కేఆర్ నారాయణన్ రాష్ట్రపతి కావడంలోనూ కీలకపాత్ర పోషించాం. దేశంలో తొలిసారిగా ఎన్టీఆర్ ఆధ్వర్యంలో జగ్గీవన్‌రామ్ విగ్రహం హైదరాబాద్‌లో ఏర్పాటు చేశామని గుర్తు చేశారు.
ఎస్సీలను ఆర్థికంగా పైకి తెచ్చాం
ఎస్సీల కోసం రూ.8,400 కోట్లతో ఆర్థిక చేయూత పథకాలు తీసుకొచ్చాం. ఎన్టీఆర్ ప్రారంభించిన రెసిడెన్షియల్ స్కూళ్లలో ఎస్సీ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తున్నాం. 1997లో స్టడీ సెంటర్లు ఏర్పాటుచేశాం. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 190 రెసిడెన్షియల్ స్కూళ్లలో లక్షా 18 వేల మంది విద్యార్థులున్నారు. రెసిడెన్షియల్ హాస్టళ్లలో లక్షమంది ఉన్నారు. నూటికి నూరుశాతం ఎస్సీ, బీసీ పిల్లలను రెసిడెన్షియల్ స్కూళ్లలో చదివించే బాధ్యత తీసుకుంటాం. ఎస్సీ కాలనీల్లో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టాం. జగ్జీవన్ జ్యోతి కింద ఎస్సీలకు 200 యూనిట్లు విద్యుత్ ఉచితంగా ఇస్తున్నాం. 2014-19 మధ్య కాలంలో ఎస్సీలకు ఇన్నోవా కార్లు ఇచ్చాం. ఎస్సీ పిల్లలను పారిశ్రామికవేత్తలుగా తయారుచేశాం. ఎస్సీల సంక్షేమం, అభ్యున్నతికి మేము తెచ్చిన 27 పథకాలను గత పాలకులు రద్దు చేశారు.. రాష్ట్రవ్యాప్తంగా 16 లక్షల 14 వేల ఎస్సీ కుటుంబాలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నాము. ఈ ఏడాది 20 లక్షల ఎస్సీ కుటుంబాల ఇళ్లకు సోలార్ విద్యుత్ అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఎన్టీఆర్ భరోసా కింద 11 లక్షల 38 వేలమంది ఎస్సీలకు పింఛను అందిస్తున్నాం. లక్షా 56 వేల కుటుంబాలకు హౌసింగ్‌లో మేలు జరిగేలా చర్యలు తీసుకుంటున్నాం. ప్రధాని ఆదర్శ గ్రామ యోజన కింద రూ.62 కోట్లతో ప్రత్యేక వసతులు కల్పిస్తున్నాం. ఎస్సీలకు నైపుణ్య శిక్షణ అందించడం ద్వారా స్వయం ఉపాధి కల్పిస్తున్నామని చంద్రబాబు వివరించారు.
పీ-4తో చరిత్ర తిరగరాస్తాం
పేదరికం నిర్మూలనే లక్ష్యంగా పీ`4 కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. సమాజంలో ధనవంతులు మరింత ధనవంతులుగా పేదలు మరింత పేదలుగా తయారవడం ప్రమాదకరం. సమాజం మనకు ఎంతో ఇచ్చింది. మనం తిరిగి సమాజానికి ఎంతోకొంత మేలు చేయాలి. అందుకే సమాజంలో అవకాశాలు అందిపుచ్చుకుని ఆర్థికంగా ఎదిగిన వారు అట్టడుగున ఉన్న పేదలను ఆదుకునే బాధ్యత తీసుకోవాలి. చేతనైనంత సాయంచేసి వారిని అన్ని విధాలా పైకి తేవాలి. పీ4 విధానం ద్వారా సమాజంలో ఆర్థికంగా అగ్రస్థానంలో ఉన్న 10 శాతం మంది… అట్టడుగున ఉన్న 20 శాతం మందికి చేయూతను ఇవ్వడం ద్వారా మంచి ఫలితాలు సాధించవచ్చు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 20 లక్షల కుటుంబాలను ఎంపిక చేశాం. ఒకప్పుడు నేనిచ్చిన జన్మభూమి పిలుపుకు స్పందించి ప్రపంచంలోని తెలుగువారు కదిలివచ్చారు. సొంతూర్లలో రోడ్లు వేశారు. స్మశానాలు కట్టించారు. ఆ స్పూర్తి కొనసాగించాలని మార్గదర్శిలను కోరుతున్నాను. దాతలు ముందుకొచ్చి బంగారు కుటుంబాలను తయారుచేస్తే వారు ఆర్థికంగా ఎదిగి మార్గదర్శిలుగా తయారవుతారని చంద్రబాబు ఉద్భోధించారు.
విధ్వంసమే అజెండాగా గత ఐదేళ్ల పాలన
నాయకుడు దూరదృష్టితో ఆలోచిస్తే రాష్ట్రం బాగుపడుతుంది. ఒక నాయకుడు విధ్వంసపు ఆలోచనలు చేస్తే ఆ రాష్ట్రం నాశనమవుతుంది. గత పాలకులు రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో భ్రష్టు పట్టించారు. రాష్ట్రాన్ని రాబందుల్లా దోచుకున్నారు. రూ.10 లక్షల కోట్ల అప్పులు మన నెత్తిపై వేశారు. ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. అయినప్పటికీ ప్రజా సేవే పమావధిగా ముందుకు వెళ్తున్నామని చంద్రబాబు వివరించారు.
బలమైన ఆర్థిక వ్యవస్థగా ఏపీ
నేను నిత్యం సమాజాన్ని అధ్యయనం చేస్తూ ఉంటాను. ఏదయినా 20, 30ఏళ్ల ముందే ఆలోచిస్తాను. నా మాటలు ఆచరణలో పెట్టిన వారు బాగుపడ్డారు. నాటి ప్రధాని పీవీ నరసింహరావు ఆర్థిక సంస్కరణలు తీసుకొస్తే నేను రెండోతరం సంస్కరణలకు శ్రీకారం చుట్టాను. ప్రధాని మోదీ సమర్థ నాయకత్వంలో 2047నాటికి ప్రపంచంలో భారతదేశం అగ్రస్థానంలో ఉంటుంది.. అమెరికావంటి దేశాల్లో అక్కడి వారికంటే మన భారతీయులదే అత్యధిక తలసరి ఆదాయం నమోదవుతోంది. స్వర్ణాంధ్ర విజన్‌లో బలమైన ఆర్థిక వ్యవస్థగా ఏపీని ఆవిష్కరించాలనేది ఎన్డీఏ ప్రభుత్వ సంకల్పంగా పెట్టుకున్నాం. 2047నాటికి రూ.54.60 లక్షల తలసరి ఆదాయం లక్ష్యంగా పెట్టుకున్నాం. తలసరి ఆదాయం 2023-24 మధ్య రూ.2.66 లక్షల కాగా 2024-25 మధ్య రూ.2.98 లక్షలకు పెరిగింది.
అందరికీ సంక్షేమం
ఓవైపు అర్హులకు సంక్షేమం అందిస్తూనే మరోవైపు రాష్ట్రమంతటా అభివృద్ధి పనులు పరుగులు పెట్టిస్తున్నాం. గత ప్రభుత్వం కక్షపూరితంగా నిలిపేసిన అమరావతి పనులు మొదలుపెట్టాం. గత పాలకులు గోదావరిలో కలిపేసి పోలవరం పనులు వేగంగా జరుగుతున్నాయి. నా ఆడబిడ్డలు ఇబ్బంది పడకూడదని ఆనాడు దేశంలోనే మొదటిసారిగా దీపం పథకానికి శ్రీకారం చుట్టాను.నేడు దీపం 2 కింద పేదలకు మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం. దేశంలో ఎక్కడా లేని విధంగా పింఛన్లు రూ.4 వేలు ఇస్తున్నాం. రూ.500 ఉన్న దివ్యాంగుల పింఛన్‌ను రూ.3 వేలు చేశాం. దాన్ని మళ్లీ ఇప్పుడు రూ. 6 వేలకు పెంచాం. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు రూ.10 వేలు ,మంచానికే పరిమితమైనవారికి మానవతా దృక్పథంతో రూ.15 వేలు ఇస్తున్నాం. ఇంతమంచి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతో ప్రతినెలా 1వ తేదీన పేదల సేవలో కార్యక్రమం నిర్వహిస్తున్నాం. రాష్ట్రంలో పేదల ఆకలి తీర్చేందుకు అన్నా క్యాంటీన్లు నెలకొల్పాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ప్రభుత్వ రుణాల ద్వారా స్వయం ఉపాధి కల్పిస్తున్నాం. మే నెలలో ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అందరికీ తల్లికి వందనం కింద నగదు జమ చేస్తాం. అన్నదాత సుఖీభవ కింద కింద రైతులకు రూ.20 వేలు ఇస్తాం. మత్స్యకారుల జీవనోపాధికి రూ.20 వేలు ఆర్థిక సాయం అందిస్తాం. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రభుత్వ సేవలను ప్రజలకు అందిస్తున్నాం. జనాభా తగ్గుదల ఆందోళన కలిగిస్తోంది. ఒకప్పుడు జనాభా నియంత్రణపై నేను మాట్లాడాను. ప్రతి జంటా ఇద్దరు లేదా ముగ్గురు పిల్లలను కనాలని నేనే పిలుపునిస్తున్నాను. అభివృద్ధి చెందిన దేశాలు జనాభా కొరతతో ఇబ్బందులు పడుతున్నాయి. ఆ పరిస్థితి మనదేశానికి రాకూడదన్నదే నా ఉద్దేశం. అలాగే నేను తెచ్చిన డ్వాక్రా సంఘాలు నేడు ఒక వ్యవస్థగా మారడం నాకు ఎంతో సంతోషాన్నిస్తుందని చంద్రబాబు అన్నారు.
నందిగామ నియోజకవర్గంలో అభివృద్ధి పరుగులు
నందిగామలో గత ఐదేళ్లలో అభివృద్ధి జరగలేదు. పాలకుల నిర్లక్ష్యంతో వేదాద్రి ఎత్తిపోతల పథకం పడకేసింది. వేదాద్రి లిఫ్ట్ ఇరిగేషన్ పనుల కోసం రూ.15 కోట్లు విడుదల చేస్తాం. రైతులకు ఇబ్బంది లేకుండా రైతు సంఘాల ఆధ్వర్యంలో ప్రతి ఎకరాకు నీరు అందిస్తాం. ఏటూరు, ముగులూరు కాజ్‌వే పనుల కోసం రూ.2 కోట్ల 20 లక్షలు విడుదల చేస్తాం. కంచకచర్ల మండలంలో స్థానికంగా బ్రిడ్జ్ ఏర్పాటుకు నిధులు మంజూరు చేస్తాం. సుబాబుల పంటకు గిట్టుబాటు ధర వచ్చేలా చర్యలు తీసుకుంటాం. అమెరికాలో పరిణామాలవల్ల ఆక్వా రంగం దెబ్బతినే పరిస్థితి నెలకొంది. ఆక్వా సాగుపై దృష్టిపెడతాం. అలాగే రైతులు పండిరచే ప్రతి పంటకూ గిట్టుబాటు ధర లభించేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. ప్రతి ఇంటికి కుళాయి ద్వారా సురక్షితమైన నీరు, అర్హులకు ఉచిత కరెంటు, ఇండ్లపై సోలార్ రూఫ్ టాప్‌ల ఏర్పాటు, ఇంటర్నెట్, మరుగుదొడ్లు నిర్మాణంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఎస్సీ, ఎస్టీలకు 200 యూనిట్లు వరకూ కరెంటు ఉచితంగా ఇస్తున్నాం. ముప్పాళ్ల గ్రామంలోని ఎస్సీలందరూ 240 యూనిట్లు కరెంటు ఉత్పత్తి చేసుకునేలా రూఫ్ టాప్ సోలార్ ఏర్పాటు చేస్తాం. బీసీలకు కూడా రెండు కిలోవాట్లకు రూ.20 వేల రూపాయిలు అదనంగా సబ్సిడీ ఇస్తాం. మూడు కిలోవాట్లు పెట్టుకుంటే రూ.98వేల సబ్సిడీ ఇస్తాం. అగ్రవర్ణాల వారు సోలార్ ఏర్పాటు చేసుకుంటే మూడు కిలోవాట్లకు రూ.78 వేలు ఇస్తాం. పొలాల్లో పంప్ సెట్లకు సోలార్ ఉచితంగా పెట్టిస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు.