- పేద కుటుంబాలు ఉన్నతికి చేరాలి
- ‘మార్గదర్శి-బంగారు కుటుంబం’లో సీఎం చంద్రబాబు
- గ్రామంలో స్ఫూర్తినింపిన సీఎం చంద్రబాబు
- మార్గదర్శి గోగినేని రవిచంద్రకు సన్మానం
నందిగామ/ ముప్పాళ్ల (చైతన్య రథం): సమాజానికి ఏదైనా మంచి చేసినప్పుడు తృప్తి కలుగుతుంది. గుర్తింపు, గౌరవం కావాలని కొందరు అనుకుంటుంటారు. డబ్బుతో ఎప్పుడూ గౌరవం రాదు. సమాజానికి మంచిపని చేస్తేనే గౌరవం, గుర్తింపు లభిస్తుంది’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం ముప్పాళ్లలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి కార్యక్రమం అనంతరం ‘మార్గదర్శి-బంగారు కుటుంబం’ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ గ్రామంలో 41 పేద కుటుంబాలు ఉన్నట్టు గుర్తించామన్నారు. ప్రజావేదిక సభలో బంగారు కుటుంబ సభ్యుల పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మార్గదర్శి గోగినేని రవిచంద్రను సన్మానించారు. అనంతరం సీఎం మాట్లాడారు.
ప్రపంచంలోనే అద్భుత కార్యక్రమం పీ`4
‘మార్గదర్శి-బంగారు కటుంబం’ ఒక చరిత్రాత్మక కార్యక్రమం. ఇటువంటిది ప్రపంచంలో ఎక్కడా లేదు. ప్రభుత్వాలు సంక్షేమ కార్యక్రమాలు తీసుకురావడంతో పాటు ఆర్థిక సంస్కరణలు కూడా తీసుకొచ్చాయి. సంక్షేమ కార్యక్రమాలతో కొంత వెసులుబాటు వచ్చినా అసమానతలు తగ్గడం లేదు. ప్రజల జీవన ప్రమాణాలు పడిపోతున్నాయి. పేదరికం వెంట తెచ్చుకుంటే వచ్చేది కాదు. తరతరాలు పేదరికంలోనే ఉంటూ ఇబ్బందులు పడుతున్నారు. పీ`4 ద్వారా పేదలకు సహకారం అందుతుంది. భారతరాజ్యాంగ నిర్మాత అయిన అంబేద్కర్‌కు ఆ రోజుల్లో బరోడా మహారాజు ఆర్థిక సహకారం అందించారు. లండన్ వెళ్లి చదువుకోవడానికి చేయూతనిచ్చారు. దేశం మెచ్చుకునే మేథావిగా అంబేద్కర్ తయారయ్యారు. అబ్దుల్ కలాంలాంటి గొప్ప వ్యక్తి వెనక కూడా అయ్యంగార్ ఉన్నారు. కలాంను అయ్యంగార్ శిష్యుడిగా దగ్గరకు తీసుకుని గణితం, సైన్స్ నేర్పించి శాస్త్రవేత్త అవ్వడానికి సాయపడ్డారు. వివేకానందను రామకృష్ణ పరమహంస తీర్చిదిద్దారు’ అని సీఎం ఉద్ఘాటించారు.
పేద పిల్లలు పైకి ఎదగాలి
‘స్వాతంత్య్ర సమరయోధులు గాంధీ అయినా, ఎన్టీఆర్, మోదీ, నేను చిన్న కుటుంబాల్లోనే పుట్టాం. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని అంచలంచెలుగా ఎదిగాం. మీ పిల్లలు కూడా ఇదేవిధంగా పైకి రావాలి. అందుకే ఈ పీ`4 కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. పేద కుటుంబాలను పేదరికం నుంచి పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ పీ`4 తెచ్చాం. ఈ గ్రామంలో గుర్తించిన 41 బంగారు కుటుంబాలతోపాటు ఎవరైనా బంగారు కటుంబంలో చేరే వారికి అవకాశం కల్పిస్తాం. బాగా చేసిన మార్గదర్శులను గౌరవించి, సన్మానిస్తాం’ అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు.
బంగారు కుటుంబానికి ఎంపికైన పగడాల నాగరత్నం మాట్లాడుతూ ‘నాకు ఇద్దరు పిల్లలు. బాబు రెండవ క్లాసు చదవుతున్నాడు. నా భర్త పొలం పనులకు వెళ్తున్నారు. నేను మిషన్ నేర్చుకుంటున్నాను. సొంత ఇల్లు, స్థలం కూడా లేదు. నేను కుట్టుమిషన్ నేర్చుకుంటున్నాను. నాకు కుట్టు మిషన్, నా భర్తకు ఆటో అందిస్తే ఉపాధి పొందుతాం’ అని చెప్పుకున్నారు.
మరో బంగారు కుటుంబ సభ్యురాలు భాగ్యమ్మ మాట్లాడుతూ.. నాకు ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. నేను ప్రస్తుతం వేరుగా ఉంటున్నా. నా భర్త ఏడాది క్రితం చనిపోయారు. నాకు పెన్షన్ అందించాలని కోరుతున్నా అని అడిగారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిస్పందిస్తూ.. ‘కలెక్టర్ గారూ… భాగ్యమ్మకు వెంటనే పింఛను మంజూరు చేయండి’ అని ఆదేశించారు. మరో బంగారు కుటుంబ సభ్యురాలు రమాదేవి మాట్లాడుతూ.. నేను ఇంటర్మీడియట్ చదివా. నా భర్త ఆరవ తరగతి చదివారు. మాకు ఇద్దరు పిల్లలున్నారు. వారు ప్రభుత్వ స్కూల్లో చదువుకుంటున్నారు. నా భర్త కూలీ పనులకు వెళ్తే రోజూ రూ.300 వస్తోంది. మాకు ఉండటానికి సొంత ఇల్లు లేదు. ఇల్లు కట్టించి, గేదెలు అందిస్తే వాటిని చూసుకుంటాం’ అని అడిగారు. మరో సభ్యుడు కోండ్రు రమేష్ మాట్లాడుతూ ‘మాకు సొంత ఇల్లు లేదు. నా భార్య, కుమారుడు చనిపోయారు. చిన్న కొడుకు ఏడవ తరగతి చదువుకుంటున్నాడు. నేను కూలీ పనులకు వెళ్తే రోజుకు రూ.350 వస్తుంది. 18 ఏళ్ల వయసు కొడుకును పోగొట్టున్నా, సాయం
అందిస్తే చిన్నకొడుకునైనా చదివించుకుంటాను.
మార్గదర్శి గోగినేని రవిచంద్ర మాట్లాడుతూ.. ‘సీఎం చంద్రబాబు తీసుకొచ్చిన పీ4 -జీరో పావర్టీ కార్యక్రమం స్ఫూర్తి నింపేలా ఉంది. పారిశ్రామికవేత్తలు, ఎన్‌ఆర్‌ఐలు దీని గురించి ఆసక్తిగా అడుగుతున్నారు. గతంలో ఏదైనా సాయం అందించడానికి లబ్ధిదారుల జాబితా సిద్ధం చేయడానికి సమయం పట్టేది. లబ్ధిదారులకు నిజంగా చేరుతుందా? లేదా? అనే సంశయం కలిగేది. కానీ ఈ పీ`4 అందరికీ అందుబాటులో ఉంది. పెద్దవరం గ్రామంలో మాకు ఇథనాల్ తయారీ యూనిట్ ఉంది. గతేడాది కొత్త యూనిట్ కూడా ప్రారంభించాం. 480మంది ఉపాధి పొందుతున్నారు. బంగారు కుటుంబంలో ఎంపికైన పగడాల నాగరత్నం బిడ్డల చదవును మేం భరిస్తాం. ఆమె భర్తకు ఆటో ఇవ్వడంతోపాటు మా ప్యాక్టరీలో వ్యాపారం చేసుకుని ఎంట్రప్రెన్యూర్ అయ్యే అవకాశాన్ని కల్పిస్తాం. నాగరత్నం కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకుంటాం. వారి కుటుంబ ఎదుగుదలకు మా సంస్థ నుంచి పూర్తి సహకారం అందిస్తాం’ అన్నారు. ఈ సందర్భంగా గోగినేని రవిచంద్రను ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందించారు. గ్రీన్ వే గ్రూప్ ఆఫ్ కంపెనీ అధినేత తోటకూర శ్రీనివాసరావు మాట్లాడుతూ ‘పరిటాలలో మేము బ్రిక్స్ ఫ్యాక్టరీ పెట్టాం.
జన్మభూమి కార్యక్రమం రూపంలో పీ`4 వచ్చింది. మేం ఒక కుటుంబాన్ని దత్తత తీసుకున్నాం. ప్రతిరోజూ ఇద్దరు ముగ్గురితో మాట్లాడి నాలుగైదు కటుంబాలు దత్తత తీసుకునేలా చేస్తాం. మాకు దాదాపు 500 కన్సల్టెన్సీలతో సంబంధాలు ఉన్నాయి. డిజిటల్ మార్కెట్‌లో ఈ పీ`4 ప్రమోట్ చేస్తాం. ఒక వెయ్యి కుటుంబాలు బంగారు కుటుంబంలో ఎంపికయ్యేందుకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తాను’ అని ప్రకటించారు. ట్విల్స్ క్లాతింగ్ ఇండియా డైరెక్టర్ జయేష్ కుమార్ షా మాట్లాడుతూ… ‘మేం ఈ నేలపై పుట్టి పెరిగాం. మాకు ఈ జన్మభూమి చాలా ఇచ్చింది. వచ్చిన అవకాశాలతో వ్యాపారం చేసి పైకి ఎదిగాం. మాకు ఎంతో ఇచ్చిన ఈ సమాజానికి తిరిగి ఇచ్చే బాధ్యత ఉంది. ఈ పీ`4 గురించి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ చెప్పినప్పుడు చాలా సంతోషాన్ని, ఉత్సాహాన్ని ఇచ్చింది. నాకు ఏ బాధ్యత అప్పగించినా తప్పకుండా ముందుకు తీసుకెళ్తాను’ అని హామీ ఇచ్చారు.
కేసీపీ ఇండియా సుగర్ ఫ్యాక్టరీ ప్రతినిధి మధుసూధన్ రావు మాట్లాడుతూ ‘ఈ పీ`4 వినూత్న కార్యక్రమం.
దేశంలోనే ఇది మొట్టమొదటి కార్యక్రమం. పేదరిక నిర్మూలన కోసం మీరు వేసిన అడుగులో మేం అడుగుల వేస్తాం. ముక్త్యాల గ్రామాన్ని మేం దత్తత తీసుకున్నాం. గ్రామంలో 800 మందికి హెల్త్ కార్డులు అందించాం. ముప్పాలలో వేల్పుల మణెమ్మ కుటుంబాన్ని దత్తత తీసుకుంటాం. ఆ కుటుంబంలోని విద్యార్థులకు విద్యకు అవసరమైన సాయాన్ని అందిస్తాం’ అని ప్రకటించారు. అంబా కోచ్ బిల్డర్స్ నుంచి వల్లభనేని రామకృష్ణ మాట్లాడుతూ.. ‘మీ స్ఫూర్తితో మేం ఒక కుటుంబాన్ని దత్తత తీసుకుంటాం. విద్య, వైద్యానికి సంబంధించి కుటుంబ అభివృద్ధికి పూర్తిగా సహకరిస్తాం’ అని ముఖ్యమంత్రి చంద్రబాబుకు హామీ ఇచ్చారు.