- సంక్షేమ వసతి గృహాన్ని సందర్శించిన వైనం
ముప్పాళ్ల/ నందిగామ (చైతన్య రథం): ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం ముప్పాళ్లలోని బాలికల గురుకుల సంక్షేమ వసతి గృహాన్ని, పాఠశాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం సందర్శించారు. బాబు జగ్జీవన్ రామ్ జయంతి కార్యక్రమంలో పాల్గొనడానికి ముప్పాళ్ల వెళ్లిన సీఎం చంద్రబాబు గురుకుల పాఠశాలకు వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడి విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. పాఠశాల అంతా కలియదిరిగారు. వంటశాల, భోజనశాలలో పరిశుభ్రతను పరిశీలించారు. కోడిగుడ్లు, బియ్యం, కూరగాయలు, సరుకుల నాణ్యతను పరిశీలించారు. భోజనం రుచిగా, నాణ్యతతో అందిస్తున్నారా? అని విద్యార్థులను అడిగి సీఎం తెలుసుకున్నారు. ప్రభుత్వం నిర్ధేశించిన మెనూ ప్రకారం అల్పాహారం, భోజనం అందిస్తున్నారా? అని అడిగారు. అనంతరం డార్మెటరీని పరిశీలించారు.