- గత వైసీపీ ప్రభుత్వంలో పేదల ఇళ్లను కూల్చేశారు
- నేడు లోకేష్ శాశ్వత పట్టాలు ఇస్తున్నారు
- ఆయన పేరు చెప్పుకుని సంతోషంగా బతుకుతాం
- మంత్రి లోకేష్ చేతుల మీదుగా శాశ్వత ఇళ్ల పట్టాలు పొందిన లబ్ధిదారుల్లో హర్షాతిరేకాలు
మంగళగిరి (చైతన్యరథం): మంగళగిరి నియోజకవర్గాన్ని మంత్రి నారా లోకేష్ శాశ్వతంగా ఏలాలని ఆయన చేతుల మీదుగా శాశ్వత ఇళ్ల పట్టాలు అందుకున్న లబ్ధిదారులు ఆకాంక్షించారు. కొండ, చెరువు, కాలువ పోరంబోకు, రైల్వే, ఎండోమెంట్ భూముల్లో దశాబ్దాలుగా నివాసముంటున్న నిరుపేద కుటుంబాలకు మన ఇల్లు-మన లోకేష్.. పేదలకు పట్టాభిషేకం పేరుతో శాశ్వత ఇళ్ల పట్టాల పంపిణీకి మంత్రి నారా లోకేష్ శ్రీకారం చుట్టారు. మొదటి విడతలో 3వేల మందికి శాశ్వత ఇళ్ల పట్టాలను అందజేస్తున్నారు. గురువారం ఉదయం ఉండవల్లి అమరారెడ్డి నగర్‌లోని రాజమండ్రి గోవిందు, సీతామహాలక్ష్మి ఇంటికి స్వయంహా వెళ్లిన మంత్రి లోకేష్.. బట్టలు పెట్టి మొదటి శాశ్వత ఇంటి పట్టా అందజేశారు. శుక్రవారం యర్రబాలెం గ్రామానికి చెందిన 248 మంది లబ్ధిదారులకు శాశ్వత ఇళ్ల పట్టాలను మంత్రి లోకేష్ అందజేశారు. దీంతో స్వయంగా మంత్రి లోకేష్ చేతుల మీదుగా శాశ్వత ఇళ్ల పట్టాలను అందుకున్న లబ్ధిదారుల్లో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి.
లోకేష్ పేరు చెప్పుకుని సంతోషంగా బతుకుతాం
మంగళగిరి నియోజకవర్గం యర్రబాలెం గ్రామంలో ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన కుంభా తిరుమల, గోపీ దంపతులు మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా శాశ్వత ఇంటి పట్టా అందుకున్నారు. తిరుమల అనే మహిళ స్పందిస్తూ.. నా భర్త పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేస్తున్నాడు. గత పదేళ్లుగా ఇద్దరు పిల్లలతో కలిసి యర్రబాలెం ట్యాంక్ వద్ద పూరిపాకలో నివాసం ఉంటున్నాం. వైసీపీ ప్రభుత్వంలో ఇళ్లను తొలగిస్తుండటంతో లోకేష్‌ని కలిసి మా ఆవేదన వ్యక్తం చేశాం. లోకేష్ మమ్మల్ని ఓదార్చి తమ ప్రభుత్వంలో శాశ్వత పట్టాలు అందజేస్తామని హామీ ఇచ్చారు. అన్నట్లుగానే ఇంటి పట్టా అందించారు. మాకు ఎంతో ఆనందంగా ఉంది. లోకేష్ పేరు చెప్పుకుని సంతోషంగా బతుకుతామని కృతజ్ఞతలు తెలిపారు.
మంగళగిరిని లోకేష్ శాశ్వతంగా ఏలాలి
తమకు శాశ్వత ఇంటి పట్టా అందించిన మంత్రి నారా లోకేష్ శాశ్వతంగా మంగళగిరిని ఏలాలని యర్రబాలెం గ్రామానికి చెందిన 70 ఏళ్ల కాజ్జా భారతి అనే వృద్ధురాలు దీవెనలు అందజేశారు. ఎస్టీ సామాజికవర్గానికి చెందిన తాము కుమార్తెతో కలిసి యర్రబాలెం ఆంజనేయస్వామి గుడి వద్ద పూరిపాక ఏర్పాటుచేసుకుని 17 ఏళ్లుగా నివాసం ఉంటున్నామన్నారు. నా కుమార్తెకు ఇద్దరు సంతానం. భర్త లేడు. ప్రభుత్వం నాకు పెన్షన్ అందిస్తోంది. పూరిల్లు కావడంతో వర్షాకాలంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. మంత్రి నారా లోకేష్ ఇప్పుడు శాశ్వత పట్టా మంజూరుచేయడంతో నూతన ఇల్లు నిర్మించుకుంటామని సంతోషంగా చెప్పారు. పట్టా అందించి అండగా నిలిచిన మంత్రి లోకేష్‌కు కృతజ్ఞతలు తెలిపారు.