- పేదల రెండున్నర దశాబ్దాల కల నేరవేర్చాం
- నాకు ఎంత ఎక్కువ మెజార్టీ ఇస్తే అంత బలమొస్తుందని ఆనాడే చెప్పా
- కుప్పం కంటే ఒక్క ఓటైనా ఎక్కువ వస్తుందని చంద్రబాబుతో ఛాలెంజ్ చేశా
- మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా పరిష్కరిస్తాం
- మంగళగిరి ప్రజలను గుండెల్లో పెట్టుకుని పనిచేస్తా
- యర్రబాలెం గ్రామానికి చెందిన 248 కుటుంబాలకు శాశ్వత ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన మంత్రి లోకేష్
మంగళగిరి (చైతన్యరథం): బహిరంగ మార్కెట్‌లో రూ.వెయ్యి కోట్ల విలువైన ఆస్తిపై పేద ప్రజలకు శాశ్వత హక్కు కల్పిస్తున్నామని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. మంగళగిరి నియోజకవర్గంలో తొలి విడతలో 3వేల మందికి శాశ్వత ఇళ్ల పట్టాలు అందజేస్తున్నామన్నారు. మన ఇల్లు-మన లోకేష్.. పేదలకు పట్టాభిషేకం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఉదయం మంగళగిరి డాన్‌బాస్కో ఉన్నత పాఠశాల పక్కన ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సభలో యర్రబాలెం గ్రామానికి చెందిన 248 మంది పేద కుటుంబాలకు బట్టలు పెట్టి శాశ్వత ఇళ్ల పట్టాలు అందజేశారు. మొదట బొక్కసం సంధ్య, పూర్ణచంద్రరావు దంపతులకు బట్టలు పెట్టి శాశ్వత ఇంటి పట్టా అందజేశారు. మధ్యాహ్నం నీరుకొండ గ్రామానికి చెందిన 99 కుటుంబాలు, మంగళగిరి రత్నాలచెరువుకు చెందిన 199 మంది కుటుంబాలకు ఇళ్ల పట్టాలు అందజేశారు. శుక్రవారం మొత్తం 546 కుటుంబాలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. జీవితంలో మనం తీసుకున్న కొన్ని నిర్ణయాలు మనల్నే మార్చివేస్తాయి. 2019 ఎన్నికల్లో నేనొక నిర్ణయం తీసుకున్నా. నాకు పరిచయం లేని నియోజకవర్గంలో పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నా. ఆ నియోజకవర్గం పేరే మంగళగిరి. ఆనాడు అతి తక్కువ సమయం ఉన్నందున నేనేంటో మీకు తెలియదు, మీరేంటో నేను తెలుసుకోలేకపోయా. నేనొచ్చిన 20 రోజులకే ఎన్నికలు ముగిశాయి. 5,300 ఓట్ల తేడాతో ఆనాడు నేను ఓడిపోయా. ఓడిపోయిన రోజు బాధకలిగింది. రెండో రోజు నుంచి ఆ బాధ, ఆవేదన నాలో కసిపెంచింది. కష్టపడి మంగళగిరి ప్రజల మనస్సు గెలుచుకోవాలని ఆనాడు నిర్ణయించుకున్నా. ఏ మెజార్టీతో ఓడిపోయానో దానిపక్కన సున్నా పెట్టుకుని గెలవాలనే లక్ష్యంతో ఓడిపోయిన మరుసటి రోజు నుంచి మీకోసం పనిచేశానని మంత్రి లోకేష్ చెప్పారు.
మంగళగిరి ప్రజల కోసం 26 సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాం
తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మంగళగిరిలో దాదాపు 26 సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాం. ఎన్టీఆర్ సంజీవని పేరుతో తాడేపల్లి, మంగళగిరిలో క్లినిక్‌తో పాటు దుగ్గిరాలలో మొబైల్ క్లినిక్ పెట్టి ప్రజలకు ఉచితంగా వైద్యం అందించాం. ఇప్పటికీ మందులు కూడా అందిస్తున్నాం. నీటి సమస్య ఉంటే వాటర్ ట్యాంకర్ల ద్వారా నీరు అందించాం. యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు నైపుణ్య శిక్షణ అందించాం. ఇంట్లో పెళ్లి జరిగితే బట్టలు పెట్టాం. నిరుపేద కుటుంబాలు సొంత కాళ్లపై నిలబడాలనే ఆలోచనతో తోపుడు బండ్లు అందించాం. మహిళల ఆర్థిక స్వాతంత్య్రం కోసం కుట్టుమిషన్ శిక్షణ అందించడంతో పాటు వారికి కుట్టుమిషన్లు కూడా అందించాం. కోవిడ్ సమయంలో ఆక్సిజన్, మందులు సరఫరా చేశాం. అమెరికా డాక్టర్ల ద్వారా ఆన్ లైన్‌లో చికిత్స కూడా అందించాం. అవసరమైన మందులు ఇచ్చాం. ఈ విధంగా మంగళగిరి ప్రజల కోసం సొంత ఖర్చుతో 26 సంక్షేమ కార్యక్రమాలు అమలుచేశామని మంత్రి లోకేష్ వివరించారు.
అందరికీ దిమ్మతిరిగే విధంగా గెలిపించారు
2024లో జరిగిన ఎన్నికల్లో అందరికీ దిమ్మతిరిగే విధంగా 91వేల ఓట్ల మెజార్టీతో నన్ను గెలిపించి శాసనసభకు పంపించారు. 2024 ఎన్నికల ముందు రచ్చబండ కార్యక్రమం ద్వారా నియోజకవర్గ ప్రజలను కలిశాను. అక్కడ పార్టీ జెండాలు, బ్యాక్ డ్రాప్‌లు లేవు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని ఆనాడు స్పష్టమైన హామీ ఇచ్చా. రెండున్నర దశాబ్దాల కల అయిన శాశ్వత ఇంటి పట్టాలు అందించాలని ఆనాడు ప్రజలు నన్ను కోరారు. మూడు విడతలుగా ఇంటి పట్టాలు అందిస్తామని చెప్పా. సులభంగా చేసే వాటిని ప్రభుత్వ నిర్ణయం మేరకు మొదటి విడతగా అందిస్తాం. ఎండోమెంట్ భూములు, రైల్వే భూముల విషయంలో కొంచెం సమయం పడుతుందని చెప్పా. అతి కష్టమైన పని కాలువ, అటవీ భూముల్లో నివసిస్తున్న వారికి పట్టాలు ఇవ్వడం. అందరితో చర్చించేందుకు రెండు, మూడేళ్ల సమయం పడుతుందని, కానీ నేను చేసి తీరతానని ఆనాడు హామీ ఇచ్చానని మంత్రి లోకేష్ గుర్తు చేశారు.
రెండున్నర దశాబ్దాల కల నెరవేర్చాం
ప్రజాప్రభుత్వం ఏర్పడి 10 నెలలైంది. పది నెలల్లో మొత్తం ఎన్యూమరేషన్ చేశాం. ఇంటి కొలతలు తీశాం. అధికారులు, అన్ని పార్టీల నాయకులు వచ్చారు. కొలతలు తీసి వివరాలు కనుక్కున్నారు. తర్వాత నేనే స్వయంగా రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్, ముఖ్యమంత్రి చంద్రబాబుతో అనేకసార్లు చర్చించి, ఏకంగా కేబినెట్‌కు తీసుకెళ్లి, కేబినెట్ ఆమోదం తెలిపిన తర్వాతనే ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. అందరూ ఒక్కసారి గుండెపై చేయిపెట్టి ఆలోచించాలి. గత రెండున్నర దశాబ్దాల కల ఇది. అనేక మంది నాయకులను మీరు కలిశారు. జిరాక్స్ ప్రింటింగ్‌లకే ఎక్కువ ఖర్చు అయింది. అలాంటిది మేం కష్టపడి, మీ దగ్గర బాటిల్ నీళ్లు కూడా తాగకుండా, మీ కోసం కష్టపడి, అవినీతికి తావులేకుండా ఇళ్ల పట్టాలు ఇస్తున్నాం. మొదటి విడతలో మార్కెట్‌లో రూ.వెయ్యి కోట్ల విలువైన ఆస్తిపై శాశ్వత హక్కు కూటమి ప్రభుత్వం పేదలకు కల్పిస్తోందని మంత్రి లోకేష్ చెప్పారు.
అహర్నిశలు మీ గురించే ఆలోచన
నాకు ఎంత ఎక్కువ మెజార్టీ ఇస్తే అంత బలమొస్తుందని ఆనాడే చెప్పా. వంద పడకల ఆసుపత్రి కోసం కేబినెట్‌లో అడిగితే ఎవరూ కాదనలేకపోయారు. దానికి కారణం..మీరు నాకిచ్చిన మెజార్టీ. దేవాలయ అభివృద్ధికి నిధులు అడిగితే కాదనలేకపోయారు. భూగర్భ డ్రైనేజీ, భూగర్భ గ్యాస్, భూగర్భ వాటర్.. చివరకు భూగర్భ కరెంట్ కూడా మంగళగిరిలో వచ్చే రెండు నెలల్లో పనులు ప్రారంభిస్తాం. దీనికి కారణం మీరు నాకిచ్చిన మెజార్టీ. మీరు నాపైనా భరోసాతో గెలిపించారు. నాపై బాధ్యత పెట్టారు. అహర్నిశలు మీ గురించే ఆలోచిస్తున్నా. మీ తరపున పనిచేస్తున్నా. చేయాల్సిన అనేక కార్యక్రమాలు ఉన్నాయని మంత్రి లోకేష్ అన్నారు.
ఎలాంటి సమస్యలు ఉన్నా పరిష్కరిస్తాం
ఓ వైపు సూపర్ సిక్స్ కార్యక్రమాలతో పాటు మంగళగిరిలో పార్క్‌లు, చెరువుల అభివృద్ధితో పాటు కల్యాణ మండపాలు, జెమ్స్ అండ్ జ్యూయలరీ పార్క్, హ్యాండ్ లూమ్ క్లస్టర్ ఏర్పాటుచేసి నేనిచ్చిన హామీలు నిలబెట్టుకుంటా. వంద పడకల ఆసుపత్రికి ఈ నెల 13న శంకుస్థాపన చేసి ఏడాదిలో 2026, ఏప్రిల్ 13న ప్రారంభిస్తాం. కూటమి ప్రభుత్వంలో మేం అందరం మీ కోసం వచ్చాం, మీకు సేవ చేసేందుకు వచ్చాం, మీ కోసం పోరాడేందుకు వచ్చాం. అహర్నిశలు మీ కోసం కష్టపడతాం. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా పరిష్కరించే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని మంత్రి లోకేష్ హామీ ఇచ్చారు.
కుప్పం కంటే ఒక్క ఓటైనా ఎక్కువ వస్తుందని చెప్పా
ఎన్నికలప్పుడు అందరం సర్వేలు చేస్తాం. సర్వేలో కుప్పం కంటే మంగళగిరి వెనుకబడి ఉంది. ఎంతపని చేశావు.. మంగళగిరి వెనుకబడి ఉందని చంద్రబాబు చెప్పారు. కుప్పం కంటే ఒక్క ఓటైనా ఎక్కువ వస్తుందని చెప్పా. అప్పుడు ఎగతాళి చేశారు. కుటుంబ సభ్యులం అందరం ఉన్నాం. మీరెప్పుడైతే మెజార్టీ చూపించారో, చంద్రబాబు డిసైడ్ అయిపోయి కష్టపడ్డారని ప్రశంసించారు. మీ దగ్గర నుంచి మిగతా నియోజకవర్గాలు నేర్చుకోవాలని చెప్పారు. దానికి కారణం మీరు నాపై చూపించిన ప్రేమ, అభిమానం. మంగళగిరి ప్రజలను గుండెల్లో పెట్టుకుని పనిచేస్తానని ఆనాడే చెప్పానని మంత్రి లోకేష్ తెలిపారు.