- జూన్ 20నాటికి డీపీఆర్ సిద్ధం చేయాలి
- ఆర్ధిక భారం తగ్గేలా సరికొత్త ఆలోచన చేయండి
- అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచన
- ప్రాజెక్టుపై జనవనరుల అధికారులతో సమీక్ష
అమరావతి (చైతన్య రథం): పోలవరం- బనకచర్ల అనుసంధానం ప్రాజెక్టుకు ఆర్ధికభారం పడకుండా ఆపరేషన్ మోడల్‌లో నిర్వహించేందుకు గల అవకాశాలను పరిశీలించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. గోదావరి జలాలను పోలవరంనుంచి లిఫ్టుల ద్వారా తరలించేందుకు అయ్యే విద్యుత్ వినియోగాన్ని ప్రాజెక్టు ప్రాంతంలోనే పంప్డ్ స్టోరేజ్, సోలార్ విద్యుత్ ప్లాంట్లు నెలకొల్పడం ద్వారా ఉత్పత్తి చేసి భారం తగ్గించవచ్చని చెప్పారు. దీనిపై సోమవారం సచివాలయంలో జలవనరుల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ అనుసంధానానికి సంబంధించి డిటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టు ఈ ఏడాది జూన్ 20నాటికి పూర్తి చేయాలని, ఇదే ఏడాది అక్టోబర్ 20నాటికి ప్రాజెక్టుకు సీడబ్ల్యుసీ ఆమోదం పొందేలా చూడాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. పర్యావరణ అనుమతులు కూడా పొంది, త్వరగా పనులు ప్రారంభించాలని చెప్పారు.
మొత్తం ప్రాజెక్టు స్వరూపం
పోలవరం- బనకచర్ల అనుసంధానానికి మొత్తం రూ.81,900 కోట్లు ఖర్చుకానుంది. ఈ అనుసంధానం ద్వారా రోజుకు 2 టీఎంసీ డిశ్చార్జ్ అవుతుంది. 368.60 కి.మీ ఓపెన్ కెనాల్ ద్వారా నీరు తరలిస్తారు. మెయిన్ టన్నెల్ 20.50 కి.మీ ఉండగా, సిద్ధాపురం ట్విన్ టన్నెల్స్ 6.60 కి.మీ., పైపులైను 17 కి.మీ. వరకు నిర్మిస్తారు. ఇందుకోసం మొత్తం 9 లిఫ్ట్‌లు వినియోగిస్తారు. 3,377 మెగావాట్ల విద్యుత్ అవసరం అవుతుంది. ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చేందుకు 15,300 ఎకరాల అటవీ భూమితో కలిపి మొత్తం 54 వేల ఎకరాలు సేకరించాల్సి ఉంటుంది. అలాగే బొల్లాపల్లి రిజర్వాయర్ కోసం 5 గ్రామాల్లో 18 నివాస ప్రాంతాల వారికి పునరావాసం కల్పించాల్సి ఉంది. ఈ అనుసంధాన ప్రక్రియను ప్రభుత్వం మొత్తం 3 సెగ్మెంట్లుగా చేపట్టనుంది.
సెగ్మెంట్ 1:
పోలవరం నుంచి ప్రకాశం బ్యారేజ్ దిగువనున్న పవిత్ర సంగమం వరకు తాడిపూడి వరద కాలువ ద్వారా 175 కి.మీ వరకు 18,000 క్యూసెక్కుల డిశ్చార్జ్‌తో నీటిని తరలిస్తారు. దీనికి 1,401 ఎకరాల భూమి అవసరం అవుతుంది. ఇందుకోసం రూ.13,800 కోట్లు ఖర్చు కానుంది.
సెగ్మెంట్ 2:
వైకుంఠపురం నుంచి బొల్లాపల్లి రిజర్వాయర్ వరకు 23,000 క్యూసెక్కుల డిశ్చార్జ్‌తో నీటిని తీసుకువెళ్తారు. ఇందుకు ఓపెన్ కెనాల్ 83.40 కి.మీ., 12.05 కి.మీ. పైపులైన్, 6 లిఫ్ట్‌లు నిర్మిస్తారు. 2,493 మెగావాట్ల విద్యుత్ వినియోగిస్తారు. 230 మెగావాట్ల విద్యుదుత్పత్తి సాధ్యమవుతుంది. ఈ సెగ్మెంట్‌లోని బొల్లాపల్లి రిజర్వాయర్‌కు 152 టీఎంసీ లైవ్ స్టోరేజ్ సామర్ధ్యం ఉంటుంది. ఇందుకు రూ.35,750 కోట్ల ఖర్చవుతుంది.
సెగ్మెంట్ 3:
బొల్లాపల్లి రిజర్వాయర్ నుంచి బనకచర్ల రెగ్యులేటర్‌కు 23,000 క్యూసెక్కుల డిశ్చార్జ్‌తో నీటిని తరలిస్తారు. ఇందుకు ఓపెన్ కెనాల్ 109.80 కి.మీ., పైపులైన్ 5.7 కి.మీ., మెయిన్ టన్నెల్, సిద్ధాపురం ట్విన్ టన్నెల్స్ నిర్మిస్తారు. వ్యయం రూ.32,350 కోట్లు అవుతుంది.
12.4 లక్షల హెక్టార్లకు సాగునీరు:
పోలవరం- బనకచర్ల అనుసంధానం పూర్తయితే రాష్ట్రానికి ఎన్నో లాభాలు కలుగనున్నాయి. మొత్తం 12.4 లక్షల హెక్టార్లకు సాగునీరు అందుతుంది. కాలువ ప్రవహించే సుమారు 400 కి.మీ. పొడవునా ఉన్న గ్రామాలకు తాగునీటి సమస్య తీరడంతో పాటు భూగర్భ జలాలు పెరుగుతాయి. అలాగే 430 మెగావాట్ల విద్యుదుత్పత్తి అవుతుంది. బొల్లాపల్లి రిజర్వాయర్‌లో మత్స్య సంపద… ఇలా వివిధ మార్గాల్లో ఏడాదికి రూ.12,294 కోట్ల సంపద సృష్టి జరుగుతుందని అధికారులు అంచనా వేశారు.