- డేటా అనుసంధాన ప్రక్రియ వేగవంతం
- ఆర్టీజీఎస్‌పై సమీక్షలో సీఎస్ విజయానంద్ ఆదేశం
అమరావతి(చైతన్యరథం): ఆర్టీజీఎస్‌లో డేటా అనుసంధాన ప్రక్రియ మరింత వేగవంతం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ ఆదేశించారు. సోమవారం ఆర్టీజీఎస్ కార్యకలాపాలపై సచివాలయంలో అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. డేటా అనుసంధానంతో ఏర్పాటు చేస్తున్న డేటా లేక్ పనుల ప్రగతి గురించి తెలుసుకున్నారు. డేటా అనుసంధాన ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఇంకా డేటా అందించని శాఖల ఉన్నతాధికారులతో మాట్లాడి వారి నుంచి కూడా సాధ్యమైనంత త్వరగా డేటా తెప్పించి డేటా లేక్ పనులు వేగవంతం చేయాలని సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశయాలకనుగుణంగా ప్రజలకు మెరుగైన సేవలందించేలా డేటా లేక్ ఏర్పాటు పనులు చేపట్టాలని సూచించారు. వాట్సాప్ గవర్నెన్స్ అమలు ప్రగతిపైన కూడా సీఎస్ సమీక్షించారు. వాట్సాప్ ద్వారా 200కు పైగా సేవలందించడం శుభపరిణామన్నారు. ప్రజలకు మరింత చేరువగా వాట్సాప్ గవర్నెన్స్ ను తీసుకెళ్లాలని సూచించారు. ప్రభుత్వ శాఖల్లో అధికారులు, సిబ్బంది యంత్రాంగం పనితీరు మరింత పెంపొందించేలా ఈ-ఫైళ్ల క్లియరెన్స్‌ను మదింపు వేయాలన్నారు. ఐటీ, రియల్ టైం గవర్నెన్స్ శాఖ కార్యదర్శి భాస్కర్ కాటంనేని మాట్లాడుతూ వాట్సాప్ గవర్నెన్స్ ప్రగతి గురించి సీఎస్‌కు వివరించారు. పౌరులు వాట్సాప్ ద్వారా కేవలం టెక్ట్స్ మెసేజ్ ద్వారానే కాకుండా తమ వాయిస్ మెసేజ్ ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ సౌలభ్యంతో సులభంగా అన్ని సేవలు పొందేలా వాట్సాప్ గవర్నెన్స్‌ను అభివృద్ధి చేస్తున్నా మని, ప్రస్తుతం ఇది పరీక్ష దశలో ఉందని తెలిపారు.
త్వరలోనే దీనిని పౌరులకు అందుబాటులోకి తెస్తామని చెప్పారు. డేటా అనుసంధాన ప్రక్రియ కూడా వేగవంతం చేస్తున్నామన్నారు. ఇప్పటికే ప్రతి ప్రభుత్వ శాఖలో ఒక చీఫ్ డేటా టెక్నికల్ ఆఫీసర్ (సీడీటీఓ)ను నియమించడం జరిగిందన్నారు. దాదాపుగా అన్ని శాఖలు డేటా లేక్‌తో అనుసంధానం అవుతున్నాయని, కొన్ని శాఖల నుంచి ఇంకా డేటా రావాల్సి ఉందని వాటిపైన ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు. గ్రామస్థాయి నుంచి ప్రజలకు, రైతు లకు వాతావరణం గురించి క్షుణ్ణంగా వివరాలు ఎప్పటికప్పుడు అందించేలా ఆర్టీజీఎస్‌లో ఆవేర్ (ఆంధ్రప్రదేశ్ వెదర్ ఫోర్‌కాస్టింగ్ అండ్ ఎర్లీ వార్నింగ్ రీసెర్చి సెంటర్) హబ్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. త్వరలోనే ఇది కార్యరూపం దాల్చబోతుందని తెలిపా రు. ఈ సమావేశంలో జీఎడీ పొలిటికల్ ముఖ్య కార్యదర్శి ముఖేష్‌కుమార్ మీనా, సమాచార పౌరసంబంధాల శాఖ సంచాలకులు హిమాంషు శుక్లా, ఎక్సైజ్ శాఖ సంచా లకులు నిషాంత్‌కుమార్, ఏపీ మారిటైమ్ బోర్డు సీఈవో ప్రవీణ్ ఆదిత్య, ఆర్టీజీఎస్ ఇన్ చార్జి సీఈవో ఎం.మాధురి తదితరులు పాల్గొన్నారు.