- దేశంలోనే ఆదర్శంగా వంద పడకల ఆస్పత్రి నిర్మాణం
- పేదలకు మెరుగైన సౌకర్యాలతూ నాణ్యమైన వైద్యం
- వంద పడకల ఆసుపత్రిపై మంత్రి లోకేష్ సమీక్ష
అమరావతి (చైతన్య రథం): మంగళగిరి సమీపంలోని చినకాకానివద్ద ప్రతిష్టాత్మకంగా నిర్మించతలపెట్టిన వందపడకల ఆసుపత్రిని భవిష్యత్తులో జి ప్లస్ 3కి విస్తరించేలా నిర్మాణం చేపట్టాలని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ మంత్రి నారా లోకేష్ సూచించారు. వందపడకల ఆసుపత్రి నిర్మాణంపై ఆసుపత్రి సాధన కమిటీ సభ్యులు, అధికారులతో మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… డాక్టర్లు, నర్సులు, పేషెంట్ల బంధువులు, రోగులకు వేర్వేరు నడకదారులు ఉండేవిధంగా డిజైన్‌లో మార్పులు చేయాలన్నారు. వైద్యులు, సిబ్బంది ప్రశాంత వాతావరణం ఉంటేనే మెరుగైన వైద్యం అందించగలరని చెప్పారు. మంగళగిరి వంద పడకల ప్రభుత్వ హాస్పటల్ ట్రెడిషనల్‌గా కాకుండా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌గా ఉండాలన్నారు.
మంగళగిరి హాస్పటల్ నిర్మాణం ఈ ప్రాంతవాసుల దశాబ్ధాల కల అని, ఎట్టి పరిస్థితుల్లో నాణ్యత విషయంలో రాజీపడవద్దని ఆదేశించారు. ఇటీవల కాలంలో డ్రగ్ అడిక్షన్ కేసులు ఎక్కువగా వస్తున్నందున ఆసుపత్రిలో ప్రత్యేకంగా డి`అడిక్షన్ సెంటర్‌ను కూడా ఏర్పాటు చేయాలని సూచించారు. ఫ్యామిలీ మెడిసిన్, ప్రివెంటివ్ మెడిసిన్ విభాగాలను కూడా ఏర్పాటు చేసేందుకు ప్రత్యేక గదులు నిర్మించాలన్నారు. సాధన కమిటీ సూచనల మేరకు డిజైన్‌లో పలు మార్పులు, చేర్పులు చేశారు. ఈ కార్యక్రమంలో ఎపిఎస్‌ఎంఐడిసి చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు, మంగళగిరి మున్సిపల్ కమిషనర్ హలీమ్ బాషా, ఎస్‌ఇ చిట్టిబాబు, మంగళగిరి ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ స్నేహరాజ్, హాస్పటల్ అభివృద్ధి కమిటీ సభ్యులు మాజేటి వంశీకృష్ణ, మాగంటి ప్రసాద్, రాజునాయుడు, భారతీదేవి, సాయిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.