- శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవాలయ అభివృద్ధికి చర్యలు
- ప్రశాంత వాతావరణంలో భక్తులు స్వామిని దర్శించుకోవాలి
- మౌలిక వసతుల కల్పన, భక్తులకు మెరుగైన సౌకర్యాలు
- దేవాలయాభివృద్ధి మాస్టర్ ప్లాన్‌పై సమీక్షలో మంత్రి లోకేష్ ఆదేశం
ఉండవల్లి (చైతన్య రథం): మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని ప్రముఖ దేవాలయాల తరహాలో అభివృద్ధి చేస్తామని విద్య, ఐటీ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఉండవల్లి నివాసంలో శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవాలయం అభివృద్ధికి సంబంధించి అధికారులు రూపొందించిన మాస్టర్ ప్లాన్‌పై మంత్రి సమీక్షించారు. కొండ దిగువన ఉన్న శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవాలయం, పానకాల నరసింహస్వామి, గండాలయ స్వామి దేవాలయ అభివృద్ధికి సంబంధించిన డిజైన్లను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులు వివరించారు. ఈ సందర్భంగా రహదారుల నిర్మాణం, వసతి, ఇతర సదుపాయాలు, పార్కింగ్ తదితర అంశాలపై అధికారులకు మంత్రి పలు సూచనలు చేశారు. మన సంప్రదాయాలను పాటిస్తూ భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భక్తులు రెండు, మూడురెట్లు పెరిగే అవకాశం ఉందని, అందుకు తగ్గట్లుగా సౌకర్యాలు, వసతి కల్పించాలన్నారు.
ప్రశాంత వాతావరణంలో భక్తులు స్వామివారిని దర్శించుకోవాలని, అందుకు అనుగుణంగా మాస్టర్ ప్లాన్‌ను తీర్చిదిద్దాలని ఆదేశించారు. ఇందుకు ఆలయ పండితులతోపాటు నిపుణుల సలహాలు తీసుకోవాలని సూచించారు. వీలైనంత త్వరగా డిజైన్‌ను పూర్తిచేసి పనులు ప్రారంభించాలన్నారు. ఏడాదిలోగా నిర్మాణాలను పూర్తి చేయాలని నిర్దేశించారు. ఎకో పార్క్ అభివృద్ధిపైనా సమావేశంలో చర్చించారు. సమీక్షలో ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి, ఎండోమెంట్స్ కమిషనర్ రామచంద్రమోహన్, ఎస్‌ఎంజీ కన్సల్టెంట్ మూర్తి, ఏపీటీడీసీ ఈడీ శేషగిరిరావు, లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఈవో కోటిరెడ్డి, లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రధాన అర్చకులు ఎమ్ శ్రీనివాస దీక్షితులు, ఏపీటీడీసీ ఎస్‌ఈ ఈశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు.