అమరావతి (చైతన్య రథం): వయోవృద్ధుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ, విభిన్న ప్రతిభావంతులు మరియు వయో వృద్ధుల సంక్షేమ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజ నేయస్వామి పేర్కొన్నారు. మంగళవారం శాసనసభలో వయోవృద్ధుల సంక్షేమంపై ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. వయో వృద్ధుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని చెబుతూ.. వృద్ధాప్య పింఛన్లు, వృద్ధాశ్రమాలు, ఆరోగ్య సంరక్షణ, రవాణా సౌకర్యాలు, పరికరాలు ఉపకరణాల పంపిణీకి చర్యలు తీసుకుంటున్నామని వెల్లడిరచారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వం రెండు వృద్ధాశ్రమాలు నిర్వహిస్తోందని, ఎన్జీవోఎస్ ఆధ్వర్యంలో 25, పలు ప్రయివేట్ సంస్థల ఆధ్వర్యంలో 119 వృద్ధాశ్రమాలు నిర్వహిస్తున్నారన్నారు. 2024 -25 ఆర్థిక సంవత్సరానికి కేంద్రం ఏపీకి కొత్తగా 12 వృద్ధాశ్రమాలు మంజూరు చేసిందని, వృద్ధుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి డోలా స్పష్టం చేశారు.