- శాప్ ఛైర్మన్ అనిమిని రవినాయుడు
- ఐజీఎంసీ, దండమూడి స్టేడియాల పరిశీలన
విజయవాడ (చైతన్య రథం): ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఈనెల 18, 19, 20 తేదీల్లో నిర్వహించనున్న క్రీడలకు సంబంధించి శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, క్రీడాశాఖామంత్రి ఎమ్ రాంప్రసాద్‌రెడ్డి సూచనల మేరకు శాప్ ఆధ్వర్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్టు శాప్ ఛైర్మన్ అనిమిని రవినాయుడు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియం, దండమూడి ఇండోర్ స్టేడియాలను మంగళవారం పరిశీలించారు. తొలుత ఐజీఎంసీ స్టేడియంలోని బ్యాడ్మింటన్, సాఫ్ట్ టెన్నిస్, వాలీబాల్, క్రికెట్ ప్రాంగణాలను పరిశీలించారు. ప్రజాప్రతినిధులకు సౌకర్యాలు కల్పించాల్సిన ఏర్పాట్లపై శాప్ ఇంజినీరింగ్ అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం దండమూడి ఇండోర్ స్టేడియంలోని టేబుల్ టెన్నిస్, షటిల్, పలు ఇండోర్ కోర్టులను పరిశీలించారు. అనంతరం శాప్ ఛైర్మన్ మాట్లాడుతూ క్రీడల నిర్వహణ విషయంలో స్పీకర్, క్రీడాశాఖమంత్రి ప్రత్యేక శ్రద్ధ వహించి పలు సూచనలిచ్చారన్నారు.
వారి సూచనలకు అనుగుణంగా, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లకు చేపట్టామన్నారు. మహిళలకు, పురుషులకు ప్రత్యేకంగా క్రీడలు నిర్వహించేందుకు పక్కా ప్రణాళికలు రూపొందించామన్నారు. పోటీల్లో పాల్గొనేవారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా తాగునీరు, లైటింగ్, టాయిలెట్లు, పార్కింగ్ సౌకర్యాలు కల్పించాలని, దానికి సంబంధించి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కూడా పూర్తిస్థాయిలో సహకరించాలన్నారు. ముఖ్యంగా వీక్షకులకు, న్యాయనిర్ణేతలకు ప్రత్యేక గ్యాలరీలు, స్టేజీలు ఏర్పాటు చేయాలన్నారు. క్రీడల నిర్వహణకు సంబంధించి ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడిరచారు. క్రీడా ఏర్పాట్లను వేగవంతం చేయాలని, ప్రజాప్రతినిధులకు అనుగుణంగా ఉండేలా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని శాప్ సిబ్బందిని సూచించారు. కార్యక్రమంలో శాప్ ఏఓ ఆర్ వెంకటరమణ నాయక్, ఎన్టీఆర్ జిల్లా డీఎస్డీఓ అజీజ్, వీఎంసీ అమృత్ పథకం జేడీ డి లత, శాప్ కోచ్‌లు, ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు.