అమరావతి (చైతన్య రథం): వార్తా పత్రికల్లో ప్రభుత్వ ప్రకటనలపై ఏపీ శాసన మండలిలో చైర్మన్ మోషేనురాజు ప్రశ్నోత్తరాలు చేపట్టారు. తెదేపా ఎమ్మెల్సీ అశోక్‌బాబు మాట్లాడుతూ గత ఐదేళ్లలో ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేశారని ఆరోపించారు. సాక్షి పత్రికకు రూ.400 కోట్లు చెల్లించారని చెప్పారు. దీనిపై విచారణకు సభా సంఘం వేయాలని మండలి చైర్మన్‌ను ఆయన కోరారు. అనంతరం మంత్రి పార్థసారథి మాట్లాడుతూ పత్రిక కొనుగోలు కోసం గత ప్రభుత్వం వాలంటీర్లకు రూ.200 చొప్పున చెల్లించిందని చెప్పారు. అక్రమంగా జరిగిన ఈ చెల్లింపులపై విచారణ చేపడతామని.. సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని మంత్రి స్పష్టం చేశారు.
వరద బాధితులకు జగన్ విరాళం ఇవ్వలేదు
మరోవైపు వరద బాధితులకు ఆర్థిక సాయంపై మండలిలో చర్చ జరిగింది. ప్రభుత్వానికి వైకాపా అధ్యక్షుడు జగన్ రూ.కోటి విరాళం ఇచ్చారని ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ పేర్కొనగా.. మంత్రి పార్థసారథి స్పందించారు. ప్రభుత్వానికి జగన్ విరాళం ఇవ్వలేదని తెలిపారు. దీనిపై విచారణకు కమిటీ వేసేందుకు సిద్ధమని హోంమంత్రి అనిత ప్రకటించారు.