- మద్దతుగా వచ్చిన మంత్రులు లోకేష్, అచ్చెన్నాయుడు, దుర్గేష్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా, పలువురు ఎమ్మెల్యేలు
అమరావతి (చైతన్యరథం): శాసనసభ సభ్యుల కోటాలో కూటమి తరుఫున ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ప్రకటించిన నలుగురు అభ్యర్థులు నామినేషన్ల దాఖలుకు చివరి రోజైన సోమవారం నామినేషన్లు దాఖలు చేశారు. జనసేన పార్టీ అభ్యర్థిగా కొణిదెల నాగబాబు గత శుక్రవారమే నామినేషన్ దాఖలు చేయగా, టీడీపీకి చెందిన ముగ్గురు అభ్యర్థులు, బీజేపీకి చెందిన ఒక అభ్యర్థి సోమవారం నామినేషన్లు దాఖలు చేశారు. దీంతో మొత్తం ఐదు స్థానాలకు కూటమి నుంచి ఐదుగురు అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేసినట్లయింది. తొలుత టీడిపీకి చెందిన ముగ్గురు అభ్యర్థులు బీద రవిచంద్ర, బి.టి.నాయుడు, కావలి గ్రీష్మ తమ నామినేషన్లను దాఖలు చేయగా తదుపరి బీజేెపీకి చెందిన సోము వీర్రాజు నామినేషన్ దాఖలు చేశారు. ఈ నలుగురు అభ్యర్థులు రెండో సెట్ల నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. రాష్ట్ర శాసనసభ భవనంలో ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, రాష్ట్ర శాసనమండలి ఉప కార్యదర్శి ఆర్. వనితా రాణికి వీరు తమ నామినేషన్ పత్రాలను అందజేశారు. రిటర్నింగ్ అధికారి వనితా రాణి ఆయా నామినేషన్ పత్రాలను పూర్తిగా పరిశీలించిన అనంతరం భారత సంవిధానపు 173 (ఎ) పరచ్ఛేదం ప్రకారం ఒక్కొక్క అభ్యర్థితో ప్రతిజ్ఞ చేయించారు.
ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసేందుకు వచ్చిన బీద రవిచంద్రతో పాటు రాష్ట్ర మానవ వనరుల అభివృద్ది శాఖ మంత్రి నారా లోకేష్, వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, శాసనసభ్యులు పి.విష్ణుకుమార్ రాజు హాజరయ్యారు. బి.టి.నాయుడు తోపాటు రాష్ట్ర మానవ వనరుల అభివృద్ది శాఖ మంత్రి నారా లోకేష్, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు, పి.విష్ణుకుమార్ రాజు హాజరు కాగా, మరో అభ్యర్థి కావలి గ్రీష్మతో పాటు రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్, శాసనసభ్యులు కె.లలిత కుమారి, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, శాసనమండలి చీఫ్ విప్ పి. అనురాధ హాజరయ్యారు. కూటమిలోని బీజేెపీ చెందిన అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన సోము వీర్రాజుతో పాటు రాష్ట్ర ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు, పి.విష్ణుకుమార్ రాజు హాజరయ్యారు. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు, సీనియర్ ఎమ్మెల్యేలు పితాని సత్యనారాయణ, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కురుగొండ్ల రామకృష్ణ, అమర్నాథ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ టీడీ జనార్దన్, తదితరులు హాజరయ్యారు. సహాయ రిటర్నింగ్ అధికారులు, ఆంధ్రప్రదేశ్ శాసనసభ సహాయ కార్యదర్శులు ఆర్. శ్రీనివాసరావు, ఎం. ఈశ్వరరావు నామినేషన్ పత్రాల పరిశీలనలో రిటర్నింగ్ అధికారికి సహకరించారు.