- 13 సంస్థలకు భూ కేటాయింపులు రద్దు
- 31 సంస్థలకు యథాతథం
అమరావతి (చైతన్యరథం): ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంలో భాగంగా చేసే భూకేటాయింపుల విషయంలో గతంలో ఉన్న విధానాన్నే కొనసాగిస్తామని మంత్రుల కమిటీ స్పష్టం చేసింది. రాజధాని అమరావతిలో సంస్థలకు భూకేటాయింపులపై రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ నేతృత్వంలో మంత్రుల కమిటీ సోమవారం సమావేశమైంది. రాష్ట్ర మంత్రులు పయ్యావుల కేశవ్, కొల్లు రవీంద్ర, టీజీ భరత్, కందుల దుర్గేష్ సమావేశానికి హాజరయ్యారు. భేటీ అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు. గతంలో 131 సంస్థలకు భూములు కేటాయించాం. వాటిలో 31 సంస్థలకు చేసిన కేటాయింపులను యథాతథంగా కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నాం.13 సంస్థలకు భూ కేటాయింపులు రద్దు చేయాలని నిర్ణయించాం. రెండు సంస్థలకు గతంలో కేటాయించిన విధంగా కాకుండా వేరే చోట కేటాయింపులు చేయాలని నిర్ణయించాం. 16 సంస్థలకు స్థలంతోపాటు పరిధిని మార్చామని మంత్రి నారాయణ తెలిపారు.
2014-19లో రాజధాని నిర్మాణం కోసం రైతులు దాదాపు 34 వేల ఎకరాలు ఇచ్చారు. రూ.43 వేల కోట్ల విలువైన పనులకు టెండర్లు పిలిచాం. రాజధాని పరిధిలో రహదారుల నిర్మాణాలు కూడా చేపట్టాం. సుమారు రూ.9వేల కోట్లు ఖర్చు చేశాం. ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అంతా మారిపోయింది. కక్ష సాధింపుతో మూడు ముక్కలాటలాడి రాజధాని నిర్మాణాన్ని పక్కన పడేశారు. ప్రజల మనోభావాలు దెబ్బతీసిందని మంత్రి ధ్వజమెత్తారు. కక్ష సాధించడమే లక్ష్యంగా రాజధానిని మూడు ముక్కలు చేసే ప్రయత్నం చేసిందని ఆగ్రహించారు. వారి దుష్టపాలనలో రాజధాని అభివృద్ధి ఒక్క అడుగూ ముందుకు సాగలేదన్నారు. తాజాగా కూటమి అధికారం చేపట్టడంతో అమరావతి మళ్లీ ఊపిరిపోసుకుందని అన్నారు. ఏపీ రాజధాని అమరావతే అని ఎన్నికలకు ముందు కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం చెప్పడంతో అధికారంలోకి వచ్చిన వెంటనే కూటమి ప్రభుత్వం దీనిపై దృష్టి సారించింది. దాదాపు 8 నెలలు కష్టపడి అనేక న్యాయపరమైన చిక్కులను పరిష్కరించాం. రూ.48 వేల కోట్లకు టెండర్లు పిలిచాం. వాటిని ఓపెన్ చేశాం. రెండు రోజుల్లో అగ్రిమెంట్ ప్రక్రియ కూడా పూర్తవుతుంది. ఆ వెంటనే ఆయా సంస్థలు పనులు ప్రారంభిస్తాయని మంత్రి నారాయణ తెలిపారు.
రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టారు: పయ్యావుల కేశవ్
అమరావతి సెల్ఫ్ సస్టెయినబుల్ ప్రాజెక్టు అని ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ స్పష్టం చేశారు. మెజారిటీ నిధులను సీఆర్డీఏనే సమకూర్చుకునే విధంగా ప్రాజెక్టును డిజైన్ చేశాం. రాష్ట్ర ప్రభుత్వం నుంచి తాత్కాలికంగా సపోర్ట్ ఇస్తున్నాం అంతే. అదికూడా బయట సంస్థల ద్వారా రుణాల రూపంలో నిధులను సమకూర్చి ఇస్తున్నాం. భవిష్యత్తులో అభివృద్ధి చెందిన తర్వాత మిగులు భూములను అమ్మేసి అప్పులన్నీ కట్టే విధంగా డిజైన్ చేశాం. రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై భారం పడకుండా అన్ని చర్యలు తీసుకున్నాం. రాజధాని కట్టాలంటే రూ. లక్షల కోట్లు కావాలని మాజీ సీఎం జగన్ గతంలో అన్నారు. రూ. లక్షల కోట్లు ఏమైనా మేం ఖర్చు చేస్తున్నామా? లేదు కదా. సీఆర్డీఏ ద్వారా నిధుల సమీకరణ జరుగుతోంది. సీఆర్డీఏ ఆధ్వర్యంలోనే అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి. భవిష్యత్తులో అభివృద్ధి చెందిన తర్వాత సీఆర్డీఏనే రుణాలు తీర్చేస్తుంది. రాజధానిలో పెట్టే ప్రతి రూపాయి మళ్లీ తిరిగి వస్తుంది. ఇన్ని రోజులు రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టారు. వారి జీవితాలతో ఆడుకున్నారు. ఇప్పటికే పోలవరం, అమరావతి ప్రాజెక్టులు పూర్తయి ఉంటే ఇతర జిల్లాల అభివృద్ధిపై దృష్టి పెట్టేందుకు వీలుండేదని పయ్యావుల పేర్కొన్నారు.