- పుట్టపర్తి విమానాశ్రయంలో అపూర్వ స్వాగతం
- కదిరి వరకు అడుగడుగునా బ్రహ్మరథం
- గ్రామాల్లో పూలవర్షం, బాణసంచా మెరుపులు
- కాన్వాయ్ ఆపి అందరినీ ఆప్యాయంగా పలకరించిన మంత్రి
పుట్టపర్తి (చైతన్యరథం): కదిరి శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందుకు వచ్చిన విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేష్‌కు సత్యసాయి జిల్లాలో అడుగడుగునా జనాలు నీరాజనాలు పలికారు. జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రి లోకేష్‌కు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. సోమవారం సాయంత్రం పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకున్న మంత్రి లోకేష్‌కు అపూర్వ స్వాగతం లభించింది. కదిరి ఎంఎల్‌ఏ కందికుంట వెంకట ప్రసాద్, హిందూపూర్ ఎంపీ బీకే పార్థసారథి, ఇతర టీడీపీ ప్రజాప్రతినిధులు, కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, నియోజకవర్గ ప్రజలు భారీగా తరలివచ్చి ఘన స్వాగతం పలికారు. పెద్దసంఖ్యలో తరలివచ్చిన కూటమి పార్టీల నాయకులను, కార్యకర్తలతో ఎయిర్‌పోర్ట్ లాంజ్‌లో మంత్రి లోకేష్ మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారి నుంచి అర్జీలు స్వీకరించి ప్రత్యేకంగా ఫోటోలు దిగారు. మంత్రి లోకేష్ రాకతో పుట్టపర్తి ఎయిర్‌పోర్ట్ రహదారి, పట్టణ వీధులన్నీ జనసంద్రంగా మారాయి. పుట్టపర్తి విమానాశ్రయం నుంచి కదిరి వస్తుండగా మంత్రి లోకేష్‌కు అడుగడుగునా ప్రతి ఊరిలోనూ ఘనస్వాగతం లభించింది. ఆయా గ్రామాల్లో ఘనస్వాగతం పలుకుతూ స్థానికులు పూలవర్షం కురిపించారు. దారిపొడవునా బాణసంచా కాల్చుతూ అభిమానం చాటుకున్నారు. మంత్రి లోకేష్ కాన్వాయ్‌ను ఆపి ప్రతిఒక్కరినీ ఆప్యాయంగా పలకరించారు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానని హామీ ఇచ్చారు.