- విశ్రాంతి తీసుకునేలా రూలింగ్ ఇవ్వాలని స్పీకర్‌కు వినతి
- శాసనసభలో, వెలుపల రామానాయుడుపై లోకేష్ ఆప్యాయత
అమరావతి (చైతన్యరథం): అసెంబ్లీలో శుక్రవారం ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు అనారోగ్యంతోనే సభకు రావటంపై విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేష్ అప్యాయతతో కూడిన మందలింసు ధోరణిలో మాట్లాడారు. కేవలం పనిపైనే కాకుండా కాస్త ఆరోగ్యంపై కూడా శ్రద్ధ వహించాలని సలహా ఇచ్చారు. శుక్రవారం అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి నిమ్మల జ్వరంతో బాధపడుతున్న విషయాన్ని లోకేష్ ప్రస్తావిస్తూ… రామానాయుడు విశ్రాంతి తీసుకునేలా రూలింగ్ ఇవ్వాలని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజును కోరడంతో శాసనసభలో నవ్వుల పువ్వులు విరిశాయి. విశ్రాంతి తీసుకుంటారా లేక సభ నుంచి సస్పెండ్ చేయించమంటారా అంటూ లోకేష్ చమత్కరించారు. ఆ తర్వాత అసెంబ్లీ లాబీల్లో మంత్రి రామానాయుడు ఎదురుపడినపుడు ఆయన ఆరోగ్యంపై లోకేష్ వాకబు చేస్తూ… ఒక చేతికి కాన్యులా (సెలైన్ ఎక్కించేందుకు వీలుగా చేతికి ఏర్పాటు చేసే పరికరం) పెట్టుకుని, మరో చేతిలో కాగితాలు పట్టుకుని తిరుగుతూనే ఉంటే ఆరోగ్యం ఏం కావాలని ఆప్యాయంగా ప్రశ్నించారు. ముందురోజు మీద ఆరోగ్యం బాగానే ఉంది, అందుకే వచ్చానని రామానాయుడు సమాధానమిచ్చారు. మాట వినకుంటే నా యాపిల్ వాచ్‌ని మీ చేతికి పెట్టి నేనే స్వయంగా మీ నిద్రను నేనే మానిటర్ చేస్తానని లోకేష్ చెప్పడంతో సభ అయ్యాక మీ మాట ప్రకారమే విశ్రాంతి తీసుకుంటానని రామానాయుడు అన్నారు.