- రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా టీచర్ల సీనియారిటీ జాబితా ప్రకటన
- రాబోయే నాలుగేళ్లలో ఏపీ మోడల్ ఎడ్యుకేషన్
- లోపాలకు తావులేకుండా ఈ నెలలోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్
- నైతికత, మహిళల గౌరవంపై ప్రత్యేక పాఠ్యాంశాలు
- వచ్చే కేబినెట్ సమావేశంలో టీచర్ల ట్రాన్స్‌ఫర్ యాక్ట్ ప్రతిపాదన
- శాసనసభలో విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్
అమరావతి (చైతన్యరథం): రాబోయే అయిదేళ్లలో స్కూల్ కిట్స్, చిక్కీ, గుడ్ల కొనుగోళ్ల టెండర్లలో అవకతవకలను అరికట్టి రాష్ట్ర ఖజానాకు వెయ్యికోట్ల రూపాయలు ఆదా చేయబోతున్నామని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. టెండర్లలో పారదర్శక విధానాలను అమలుచేయడం ద్వారా పెద్దఎత్తున ఖజానాకు నిధులు ఆదా చేస్తున్నామన్నారు. ఒక్క చిక్కీల్లోనే రూ.63 కోట్లు (36శాతం) ఆదా చేశాం, రాబోయే అయేదేళ్లలో రూ.300 కోట్లకు పైగా చిక్కీల కొనుగోలులోనే ఆదా అవుతాయని మంత్రి నారా లోకేష్ వెల్లడిరచారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీ, కరిక్యులమ్ మార్పులు, మౌలిక సదుపాయాలపై అనకాపల్లి ఎమ్మెల్యే కొణతల రామకృష్ణ అడిగిన ప్రశ్నకు శుక్రవారం మంత్రి నారా లోకేష్ సమాధానమిస్తూ…స్కూల్ కిట్స్‌లో కూడా 8 నుంచి 9శాతం వరకు అంటే రూ.70కోట్ల వరకు ఆదా అవుతాయన్నారు. కోడిగుడ్లలో కూడా 10నుంచి 12శాతం తగ్గింది. రేట్లు తగ్గించడంతోపాటు క్వాలిటీ మెయింటెన్ చేయాలని అధికారులకు చెప్పాను. విద్యావ్యవస్థలో సంస్కరణల అమలుపై మేం దృష్టిసారించాం. స్కూల్ కిట్స్ విషయంలో థర్డ్ పార్టీతో మానిటరింగ్ పెట్టాం. టెక్స్ట్ బుక్స్ విద్యార్థులకు బరువుగా ఉన్నాయని పలువురు చెప్పడంతో వివిధ రాష్ట్రాల్లో అధ్యయనం చేసి, పుస్తకాల బరువు తగ్గించేందుకు మహారాష్ట్ర మోడల్‌లో సెమిస్టర్ వారీ విధానం తెస్తున్నాం. స్కూలు కిట్స్ లో ఇంకా ఎక్కువ ఆదా అయ్యేది, కానీ యూనిఫాం నాణ్యతగా ఉండాలనే ఉద్దేశంతో టూ సైడ్ ప్రింటింగ్‌తో మంచి క్లాత్ ఇచ్చాం, ప్రస్తుత యూనిఫాం మరో ఏడాది కూడా వాడవచ్చు. అందువల్ల యూనిఫాంలో ఆదా తగ్గిందని మంత్రి లోకేష్ వివరించారు.
ఈ నెలలోనే మెగా డీఎస్సీ ప్రకటన
1994 నుంచి 2024వరకు డీఎస్సీల ద్వారా వివిధ ప్రభుత్వాలు 2.53 లక్షల ఉపాధ్యాయులను నియమించగా, అందులో 71శాతం..అంటే 1,80,272 పోస్టులు టీడీపీ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నపుడు భర్తీచేశాం. విద్యపట్ల మన ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని ఈ గణాంకాలు తెలియజేస్తున్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తొలి సంతకం డీఎస్సీ ఫైలుపై పెట్టారు, అందులో భాగంగా పారదర్శకంగా టెట్ కూడా నిర్వహించాం. టెట్ నుంచి నోటిఫికేషన్ ప్రకటించేలోపు సమస్యలపై వన్ మ్యాన్ కమిషన్ కూడా వేశాం. దానివల్ల కొంచెం జాప్యమైంది. ఎట్టి పరిస్థితుల్లో 16,347 పోస్టుల భర్తీకి ఈ నెలలో నోటిఫికేషన్ ఇస్తున్నాం. 1994నుంచి ఇప్పటివరకు డీఎస్సీపై పడిన కేసులన్నింటినీ పరిగణనలోకి తీసుకొని లోపాలకు తావు లేకుండా నోటిఫికేషన్ ఇవ్వాలని అధికారులను ఆదేశించాను. పాఠశాల విద్యలో అనేక సంస్కరణలు తీసుకొస్తున్నాం. జీఓ 117కు ప్రత్యామ్నాయంపై ఉపాధ్యాయ సంఘాలతో సుమారు అయిదున్నర గంటలపాటు సుదీర్ఘంగా చర్చించా. మన ప్రభుత్వం పరదాలు కట్టుకుని, 144 సెక్షన్ పెట్టి పాలించేది కాదు. ప్రజలకు జవాబుదారీతనం ఉండాలన్నదే మన ప్రభుత్వ లక్ష్యం. చర్చలు జరిపిన సంఘాల్లో వైసీపీ అనుబంధ సంఘం కూడా ఉంది. వాళ్లు లోపల ఏం మాట్లాడలేదు, అన్నీ బాగున్నాయని వెళ్లారు. అందరితో చర్చించి జీఓ 117 రద్దుచేసి, ప్రత్యామ్నాయం తెస్తామని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు.
పారదర్శకంగా సీనియారిటీ లిస్టు ప్రకటన
ఏపీ చరిత్రలో మొదటిసారి టీచర్స్ సీనియారిటీ లిస్టు ప్రకటించబోతున్నాం. సాధారణంగా సీనియారిటీ లిస్టులు గందరగోళంగా ఉంటాయి. మేం ప్రకటించే లిస్టులో తప్పులు ఉంటే డీఇఓ వద్దకు వెళ్లి సరిచేసుకోవచ్చు. వచ్చే మంత్రివర్గ సమావేశం నాటికి టీచర్ ట్రాన్స్‌ఫర్ యాక్ట్ తెస్తాం. అది కూడా పూర్తి పారదర్శకంగా చేస్తున్నాం. టీచర్ల బదిలీల్లో ఎవరివద్దకు పైరవీలకు వెళ్లాల్సిన పనిలేదు. విద్యావ్యవస్థలో ఉపాధ్యాయులది కీలకపాత్ర. లేనిపోని యాప్‌లు, రాజకీయ జోక్యం వల్ల వారు విద్యార్థులకు సరిగా చదువు చెప్పలేకపోతున్నారు. గత ప్రభుత్వం పెద్దపెద్ద మాటలు చెప్పింది. మాజీ సీఎంకు ఆత్మతో మాట్లాడటం ఇష్టం. ఆత్మలతో మాట్లాడి ఐబి, సిబిఎస్‌ఇ, టోఫెల్ అంటూ అనాలోచిత నిర్ణయాలు తీసుకున్నారు. ఐబి స్కూళ్లు పెట్టకుండానే కేవలం రిపోర్టు తేవడానికి రూ.5కోట్లు ఖర్చుపెట్టారు. టోఫెల్ అమలు చేయలేదు. సిబిఎస్‌ఇ మోడల్ మాక్ ఎగ్జామినేషన్ పెడితే 90శాతం మంది విద్యార్థులు ఫెయిలయ్యారు. ఇందులో బాలికలు ఫెయిల్ అయితే ఆ ప్రభావం సామాజిక సమస్యగా తలెత్తుతుంది. చదువు మధ్యలో ఆపేసి వారికి పెళ్లిళ్లు చేస్తారు. అందుకే ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, పిల్లలను సిద్ధం చేసి మూడేళ్ల తర్వాత సిబిఎస్‌ఇ అమలు చేద్దామని నేను చెప్పారు. ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడానికి వన్ క్లాస్ ` వన్ టీచర్ ఉండాలని మేం భావిస్తున్నాం. ప్రతి పంచాయితీకి ఒక మోడల్ ప్రైమరీ స్కూల్ ఉండేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. ప్రస్తుతం వన్ క్లాస్ ` వన్ టీచర్ ఉన్న పాఠశాలలు కేవలం 1400 మాత్రమే ఉన్నాయి. సంస్కరణల తర్వాత 10వేలకు పెరుగుతాయని మంత్రి లోకేష్ తెలిపారు.
మహిళలను గౌరవించేలా పాఠ్యాంశాలు
కరిక్యులమ్ మార్పుల్లో ముఖ్యంగా మహిళల పట్ల గౌరవం పెంచేలా చర్యలు చేపడుతున్నాం. 1,2 తరగతుల టెక్స్ట్ బుక్స్‌లో ఇంటిపనుల ఫోటోల్లో మహిళలు, పురుషులు చెరిసగం ఉండేలా చేశాం. అన్నిపనుల్లో సమానమనే భావన రావాల్సి ఉంది. సినిమాల్లో కూడా ఇటువంటి మార్పు రావాలి. గాజులు తొడుక్కున్నారా, చీరకట్టుకున్నారా అనే మాటలు పోవాలి. గతంలో మంత్రులు కూడా చిన్నచూపుతో మాట్లాడారు. అటువంటివి పోతేనే సమాజంలో మార్పు వస్తుందని నేను బలంగా నమ్ముతున్నాను. ప్రస్తుతం ఇంగ్లీషు మీడియం వచ్చింది. ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తున్నాం. టెక్స్ట్ బుక్స్‌లో కూడా ఇంగ్లీషు, తెలుగు రెండూ ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. ఎయిడెడ్ వ్యవస్థ గందరగోళంగా ఉంది. దీనికి శాశ్వతమైన పరిష్కారం తేవాలని భావిస్తున్నాం. ఇందుకు ప్రత్యేక పాలసీ రూపొందిస్తున్నామని మంత్రి లోకేష్ చెప్పారు.
ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ తెస్తాం
ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధులు కలసికట్టుగా పనిచేసి రాబోయే మూడేళ్లలో ఏపీ మోడల్ ఎడ్యుకేషన్‌ను ప్రపంచానికి పరిచయం చేస్తాం. టీచర్ ట్రైనింగ్ కు వరల్డ్ క్లాస్ ఇనిస్టిట్యూట్ అమరావతిలో పెట్టాలని భావిస్తున్నాం. దీనిపై మంత్రి నారాయణతో చర్చించాం. ఇతర రాష్ట్రాలు, దేశాలనుంచి ఇక్కడకు వచ్చి ట్రైనింగ్ తీసుకునేలా ప్రతిష్టాత్మకమైన సంస్థను ఏర్పాటుచేస్తాం. సంస్కరణల అమలును ఈ ఏడాది జూన్ కల్లా పూర్తిచేస్తాం. నైతిక విలువలతో కూడిన విద్యావిధానానికి శ్రీకారం చుట్టబోతున్నాం. ఇందుకోసం ప్రముఖ ఆధ్యాత్మకవేత్త చాగంటి కోటేశ్వరరావు నేతృత్వంలో నైతికతపై పాఠ్యంశాలు తయారవుతున్నాయి. లింగసమానత్వంపై కూడా పాఠ్యాంశాలు రూపొందిస్తున్నాం. రాజ్యాంగ దినోత్సవం నాడు పిల్లలకు అర్థమయ్యేలా బాల రాజ్యాంగం తయారుచేసి అందించాలని నిర్ణయించాం. ఈ ఏడాది నుంచే అమలు చేస్తాం. వచ్చే నాలుగేళ్లు కేవలం లెర్నింగ్ అవుట్ కమ్స్‌పై శ్రద్ధ పెట్టి, అందరి సహకారంతో ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ తేవాలనే కృతనిశ్చయంతో పనిచేస్తున్నామని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.