- వలసల నివారణకు చర్యలు
- అసెంబ్లీలో రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి లోకేష్
అమరావతి (చైతన్యరథం): కర్నూలు జిల్లాలో వలసల నివారణకు చర్యలు తీసుకుంటామని, సీజనల్ హాస్టళ్ల పనితీరు మెరుగుపరుస్తామని విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. శాసనసభలో శుక్రవారం సభ్యుల ప్రశ్నలకు ఆయన సమాధానమిస్తూ.. యువగళం పాదయాత్ర ఆలూరు, ఆదోనిలో కొనసాగుతున్నపుడు కుటుంబాలు మూకుమ్మడిగా వలసల వెళ్లడం చూశానన్నారు. ఒకే వాహనంపై 200 మంది వెళ్లడం గమనించాను. అవన్నీ చూశాక ఇరిగేషన్, లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తిచేసి, సాగు, తాగునీరు ఇస్తామని హామీ ఇచ్చాను. ఇచ్చిన మాట ప్రకారం సాగు, తాగునీరు ఇచ్చే బాధ్యత ఎన్‌డీఏ ప్రభుత్వం తీసుకుంటుంది. నంద్యాల తర్వాత నేను కర్నూలుకు పాదయాత్రకు వెళ్లాను. రెండు ప్రాంతాల నడుమ ఎంతో వ్యత్యాసం కన్పించింది. కర్నూలు జిల్లాలో శివారు ప్రాంతాలకు సైతం సాగు, తాగునీరు అందించడమే మా లక్ష్యం. ఈ విషయాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌తో రెండుసార్లు చర్చించాను. గ్రాస్ ఎన్‌రోల్‌మెంట్ రేషియో, లిటరసీలో కర్నూలు వెనుకబడి ఉందన్నది వాస్తవం.
అందుకే రాబోయే డీఎస్సీలో కర్నూలుకు ఎక్కువమంది ఉపాధ్యాయులు రాబోతున్నారు. విద్యార్థులకు అపార్ ఐడిని కేంద్రం తప్పనిసరి చేస్తోంది. కేజీ నుంచి పీజీ వరకు ఒక కంట్రోల్ రూమ్ పెట్టి విద్యార్థులను ట్రాక్ చేస్తాం, ఇందుకు అవసరమైన ఐటీి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను తయారు చేస్తున్నాం. విద్యార్థుల్లో ఒక్కరు కూడా డ్రాపవుట్ కాకూడదనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాం. సీజనల్ హాస్టల్స్‌కు సంబంధించి కేవలం భోజనం పెట్టడానికి మాత్రమే అవకాశం ఉంది, హాస్టల్ వసతులు లేవు. కరువు ప్రాంతాల్లో ప్రజలు వేరేచోటకు వలసలు వెళ్లిన సమయంలో అక్కడ ప్రవేశాలు కల్పించే అంశాన్ని పరిశీలిస్తున్నాం. హాస్టళ్ల పనితీరు, విద్యార్థుల ట్రాకింగ్ ఉంటేనే డ్రాపవుట్స్ తగ్గుతాయి. రాష్ట్రంలో 2024-25లో 121 సీజనల్ హాస్టళ్లు ఉండగా, వాటిలో 6,040 మంది విద్యార్థులకు భోజన వసతి కల్పించాం. ఇందుకోసం 6.04కోట్లు ఖర్చు పెడుతున్నాం. సీజనల్ హాస్టళ్ల నిర్వహణ ఇప్పటివరకు ప్రణాళికాబద్ధంగా లేదు.
వివిధ సంవత్సరాల్లో ఎక్కువ, తక్కువలు ఉన్నాయి. పిల్లలకు మెరుగైన విద్య అందించాలన్నదే మా లక్ష్యం. పిల్లల వలసల నివారణకు గత ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. సీజనల్ హాస్టళ్ల పనితీరు మెరుగుదలకు అసెంబ్లీ అయ్యాక శాసనసభ్యులతో చర్చిస్తాం. హాస్టళ్ల పనితీరు, గ్రాస్ ఎన్‌రోల్‌మెంట్ రేషియో, స్టూడెంట్ టీచర్ రేషియో మెరుగుదలకు వచ్చే మూడేళ్లు కలసి పనిచేద్దాం. బీసీ, ఎస్సీ హాస్టళ్లను కన్వర్జెన్స్ చేసి సీజనల్ హాస్టళ్ల పనితీరు మెరుగుపర్చేందుకు చర్యలు తీసుకుంటాం. రాబోయే మూడేళ్లలో హాస్టళ్ల పనితీరులో మార్పు తెస్తాం. సీజనల్ హాస్టళ్లకు సంబంధించి పలు పత్రికల్లో కథనాలు వచ్చాయి, ఏ మీడియాలో వచ్చినా సీరియస్ గా తీసుకుంటున్నాం. రాబోయే రెండు, మూడునెలల్లో సీజనల్ హాస్టళ్ల పనితీరులో మార్పును గమనిస్తారని మంత్రి లోకేష్ పేర్కొన్నారు.