- కూటమి ప్రభుత్వంతో బీసీలకు పూర్వవైభం
- బీసీ, ఈడబ్ల్యూఎస్ వర్గాల సంక్షేమానికి పెద్దపీట
- రూ.1000 కోట్లతో ఆదరణ పున:ప్రారంభం
- నేడు లక్ష మంది మహిళలకు కుట్టు శిక్షణ ప్రారంభం
- త్వరలో ఉచిత ఆన్‌లైన్ డీఎస్సీ కోచింగ్
- బీసీలను, కాపులను మోసం చేసిన జగన్
- అసెంబ్లీలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత
అమరావతి (చైతన్యరథం): సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రాకతో బీసీలకు మరోసారి పూర్వ వైభవం వచ్చిందని, మహిళలకు ఆర్థిక భరోసా కల్పించడమే ఆయన లక్ష్యమని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. బీసీ బిడ్డలు, మహిళల అభ్యున్నతికి తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందన్నారు. బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమానికి ప్రభుత్వం ఏ మేరకు సాయమందిస్తున్నదన్న సభ్యుల ప్రశ్నలకు అసెంబ్లీలో మంత్రి సవిత శుక్రవారం సమాధానం ఇచ్చారు. గతేడాది బడ్జెట్‌లో ఈడబ్ల్యూఎస్ లోని వివిధ వర్గాలకు సీఎం చంద్రబాబునాయుడు రూ.10,273 కోట్లు కేటాయించారన్నారు. అందులో స్వయం ఉపాధి, ఇతర పథకాల కోసం రూ.7,097.69 కోట్లు విడుదల చేసిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు.
హాస్టళ్ల విద్యార్థులకు సన్నబియ్యంతో భోజనం
గత ప్రభుత్వ హయాంలో బీసీ హాస్టళ్లు, గురుకులాలు తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యాయని, దీనివల్ల విద్యార్థులు ఇబ్బందులు పాలయ్యారని మంత్రి సవిత ఆవేదన వ్యక్తంచేశారు. ఐదేళ్ల నుంచి హాస్టళ్లలో చిన్న చిన్న మరమ్మతులు కూడా చేపట్టలేదన్నారు. ఇదే విషయం అధికారంలోకి రాగానే సీఎం చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్లగా, తక్షణమే హాస్టళ్ల మరమ్మతులకు నిధులు మంజూరు చేశారన్నారు. కొందరు ఎమ్మెల్యేలు సొంత నిధులతో హాస్టళ్లను మరమ్మతులు చేయించుకున్నారన్నారు. కలెక్టర్లు కూడా తమ జిల్లాలో హాస్టళ్ల మరమ్మతులకు నిధులు కేటాయిస్తున్నారన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి హాస్టళ్ల విద్యార్థులకు సన్న బియ్యంతో నాణ్యమైన భోజనం అందించబోతున్నామన్నారు. ఇదే విషయమై ఇప్పటికే రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటించిన విషయాన్ని మంత్రి సవిత గుర్తు చేశారు.
త్వరలో ఉచిత ఆన్‌లైన్ డీఎస్సీ కోచింగ్
బీసీ బిడ్డల విద్యకు, ఉద్యోగావకాశాలకు సీఎం చంద్రబాబునాయుడు పెద్దపీట వేస్తున్నారని మంత్రి సవిత వెల్లడిరచారు. త్వరలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ను ప్రభుత్వం విడుదల చేయనుందన్నారు. అత్యధిక మంది బీసీ బిడ్డలు ఉపాధ్యాయ పోస్టుల సాధించాలన్న లక్ష్యంతో ఉచిత డీఎస్సీ కోచింగ్‌లు నిర్వహిస్తున్నామన్నారు. ఇప్పటికే 26 జిల్లాలో ఉన్న బీసీ స్టడీ సర్కిళ్ల ద్వారా 7,200ల మంది బీసీ అభ్యర్థులకు ఉచిత డీఎస్సీ కోచింగ్ అందజేస్తున్నామన్నారు. ఉచిత సివిల్ సర్వీసెస్ కోచింగ్ కూడా అందజేస్తున్నామన్నారు. త్వరలో ఆన్‌లైన్ ద్వారా ఉచిత డీఎస్సీ కోచింగ్ ప్రారంభించబోతున్నట్లు మంత్రి సవిత వెల్లడిరచారు. ఆన్‌లైన్ ఉచిత డీఎస్సీ కోచింగ్ ద్వారా మహిళా అభ్యర్థులకు ఎంతో మేలు కలుగుతుందన్నారు.
బీసీలకు మరోసారి పూర్వ వైభవం
గత ప్రభుత్వ హయాంలో బీసీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని మంత్రి సవిత ఆవేదన వ్యక్తంచేశారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి బీసీలంతా అండగా నిలిచారన్నారు. బీసీలకు మరోసారి పూర్వ వైభవం ప్రారంభమైందన్నారు. ప్రస్తుత బడ్జెట్‌ను రూ. 3,22,359 కోట్లతో రూపొందిస్తే..అందులో బీసీల కోసం రూ.47,456 కోట్లు కేటాయించారన్నారు గత బడ్జెట్ లో బీసీలకు స్వయం ఉపాధి కోసం రూ.1977 కోట్లు వెచ్చించామని గుర్తు చేశారు.
ఆదరణ పథకం పున:ప్రారంభం
కుల వృత్తులకు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందని మంత్రి సవిత వెల్లడిరచారు. ఇందులో భాగంగా రూ.1000 కోట్లతో ఆదరణ పథకాన్ని పున:ప్రారంభించనున్నట్లు తెలిపారు. శుక్రవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా రాష్ట్రంలో లక్ష మందికి పైగా మహిళలకు టైలరింగ్‌లో ఉచిత శిక్షణ ఇచ్చి, కుట్టు మిషన్లు అందజేయనున్నట్లు తెలిపారు. సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఈ పథకం ప్రారంభించనున్నట్లు తెలిపారు. మహిళలు వారి సొంత కాళ్లమీద నిలబడాలన్న ఉద్దేశంతో సీఎం చంద్రబాబు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు.
బీసీలను, కాపులను మోసం చేసిన జగన్
నా బీసీలు…నా కాపులు…అంటూ కులాలను వినియోగించుకుని జగన్ వారిని మోసం చేశారని మంత్రి సవిత మండిపడ్డారు. బటన్ నొక్కడం తప్ప, బీసీలకు ఎటువంటి స్వయం ఉపాధి పథకాలు అందించలేదని అన్నారు. ముఖ్యంగా బీసీ బిడ్డలు చదువుకునే హాస్టళ్లను, గురుకులాలను జగన్ పూర్తిగా నిర్లక్ష్యం చేశారన్నారు. 108 ఎంజేపీ స్కూళ్లలో 106 స్కూళ్లను టీడీపీ ప్రభుత్వాలే మంజూరు చేశాయన్నారు. గత ప్రభుత్వంలో పులివెందులలో మంజూరు చేసిన ఎంజేపీ స్కూల్‌ను కూడా పూర్తి చేయలేక అసంపూర్తిగా విడిచిపెట్టేశారని ఎద్దేవా చేశారు. 2014-19లో టీడీపీ ప్రభుత్వ హయాంలో 25 గురుకుల పాఠశాలలు మంజూరు చేసి, నిధులు కేటాయించామన్నారు. వాటిలో 6 భవనాలు 60 నుంచి 80 శాతం వరకు పూర్తయ్యాయన్నారు. తరవాత వచ్చిన జగన్ ప్రభుత్వం వాటిని పక్కన పడేసిందన్నారు. రంగులు మార్చడం అలవాటున్న జగన్ రెడ్డి…ఆ భవనాలను నిర్మించి తనకు నచ్చిన ఫొటోలు, రంగులు వేసుకుని నిర్మించి ఉంటే బాగుండేదన్నారు. ఇదే విషయం సీఎం చంద్రబాబుకు తెలపగానే అసంపూర్తిగా నిలిచిపోయిన భవనాల నిర్మాణాలకు నిధులు మంజూరు చేశారని మంత్రి గుర్తు చేశారు. బీసీ హాస్టళ్లకు మరమ్మతులకు కూడా నిధులు మంజూరు చేశారని మంత్రి సవిత తెలిపారు.