అమరావతి (చైతన్యరథం): గత వైసీపీ ప్రభుత్వ హయాంలో టీడీఆర్ బాండ్ల జారీలో అనేక అక్రమాలు జరిగాయని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. వీటిపై విజిలెన్స్, సీఐడీ విచారణ జరుగుతోందని.. నివేదిక రాగానే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో విశాఖపట్నం తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు అడిగిన ప్రశ్నకు శుక్రవారం మంత్రి నారాయణ సమాధానం ఇచ్చారు. గత ప్రభుత్వ హయాంలో విశాఖపట్నంలో టీడీఆర్ బాండ్ల జారీలో జరిగిన అక్రమాలపై రీజినల్ విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌తో పాటు సీఐడీ విచారణ కొనసాగుతోందన్నారు. విచారణ నివేదిక రాగానే బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. టీడీఆర్ బాండ్ల జారీలో ఒక్క విశాఖపట్నంలోనే కాకుండా తణుకు, తిరుపతిలో కూడా అక్రమాలు జరిగాయన్నారు.
తణుకులో రూ.63.24 కోట్ల విలువైన బాండ్లు ఇవ్వాల్సి ఉండగా రూ.754 కోట్లకు బాండ్లు జారీ చేసారని తెలిపారు. రూరల్ ఏరియాలో భూమి ఇచ్చి పట్టణంలో ఉన్న ఇంటి అడ్రస్ ఇవ్వడంతో ఆ ఇంటి స్థలం విలువ ఆధారంగా బాండ్లు జారీ చేసినట్లు మంత్రి తెలిపారు. అదే విధంగా తిరుపతిలో రూ.170.99 కోట్ల విలువైన 29 బాండ్లు జారీ చేసారన్నారు. గత ప్రభుత్వంలో టీడీఆర్‌ల బాండ్ల జారీలో అక్రమాలు జరగడంతో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఐదు నెలల పాటు టీడీఆర్ బాండ్లు నిలిపివేసామని మంత్రి తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 965 టీడీఆర్ బాండ్ల జారీ పెండిరగ్‌లో ఉందన్నారు. గత ప్రభుత్వంలో టీడీఆర్ బాండ్ల జారీలో అక్రమాలతో పాటు అన్ని అంశాలపై మూడు నెలల్లో స్పష్టత ఇస్తామని మంత్రి నారాయణ తెలిపారు.