- అసెంబ్లీలో మంత్రి గొట్టిపాటి స్పష్టీకరణ
- 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా చార్జీలు పెంచలేదు
- 2022-24 మధ్య వైసీపీ ప్రభుత్వం రూ.15 వేల కోట్లు భారం మోపింది
- గత ఐదేళ్లలో విద్యుత్ వ్యవస్థను విచ్ఛిన్నం
అమరావతి (చైతన్యరథం): వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో విద్యుత్ వ్యవస్థ సర్వనాశనం అయిందని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం భవిష్యత్తులో కూడా విద్యుత్ చార్జీలను పెంచబోదని మరోసారి సభా ముఖంగా స్పష్టం చేశారు. అసెంబ్లీలో వైసీపీ సభ్యులు అడిగిన ప్రశ్నలకు శుక్రవారం విద్యుత్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ సమాధానం ఇచ్చారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ…. విద్యుత్ చార్జీలను వైసీపీ నాయకులే పెంచి, వాటిపై వాళ్లే ధర్నాలు చేసి, సభలో ఏమీ తెలియనట్టు ప్రశ్నలు అడుగుతున్నారని మండిపడ్డారు. ఇదొక వింత సాంప్రదాయమని పేర్కొన్నారు. వారం రోజులు తిరగక ముందే మండలిలో అడిగిన ప్రశ్నలే.. మళ్లీ అసెంబ్లీలో అడిగి ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు చూస్తున్నారని మంత్రి గొట్టిపాటి ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యతారాహిత్యంతో వైసీపీ సభ్యులు సభకు రాకపోయినా సరే… ప్రభుత్వం తరపు నుంచి బాధ్యతాయుతంగా సభ్యులు అడిగిన ప్రతీ ప్రశ్నకు సమాధానం ఇస్తున్నామని తెలిపారు.
2022-23, 2023-24 ఏడాదికి గాను వైసీపీ ప్రభుత్వం ప్రజలపై రూ.15 వేల కోట్లు భారం మోపిందని మంత్రి గొట్టిపాటి తెలిపారు. గతంలో 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా విద్యుత్ చార్జీలు పెంచలేదన్న విషయాన్ని గుర్తు చేశారు. నాడు టీడీపీ ప్రభుత్వం దిగిపోయేనాటికి మిగులు విద్యుత్‌తో రాష్ట్రాన్ని వైసీపీ ప్రభుత్వానికి అప్పగించామని చెప్పిన మంత్రి… గత ఐదేళ్లలో విద్యుత్ వ్యవస్థను వైసీపీ ప్రభుత్వం విచ్ఛిన్నం చేసిందని స్పష్టం చేశారు. జగన్ అనాలోచిత చర్యలతో 9 సార్లు విద్యుత్ చార్జీలు పెంచి ప్రజలపై భారం మోపారని వైసీపీ నాయకులపై మండిపడ్డారు. రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులను కూడా వైసీపీ నాయకులు తరిమి కొట్టారని పేర్కొన్న మంత్రి గొట్టిపాటి… గత టీడీపీ హయాంలో 8 గిగావాట్ల వరకు విద్యుత్ ఉత్పత్తి చేసిన విషయాన్ని సభలో ప్రస్తావించారు. అధిక ధరలకు విద్యుత్ కొనుగోళ్లు చేసిన వైసీపీ ప్రభుత్వం వేల కోట్లు దోపిడీ చేశారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో అధిక ధరలకు విద్యుత్ కొనుగోళ్లు భారీగా తగ్గాయని మంత్రి గొట్టిపాటి తెలిపారు. గత ప్రభుత్వం ఏపీ జెన్కోను నిర్వీర్యం చేసిందని మంత్రి స్పష్టం చేశారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత జెన్ కో నుంచి పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ… విద్యుత్ కొనుగోళ్లు తగ్గించినట్లు మంత్రి స్పష్టం తెలిపారు.