- 90 శాతం తగ్గిన సాగు
- మండలిలో హోంమంత్రి అనిత
అమరావతి (చైతన్యరథం): కూటమి ప్రభుత్వం వచ్చాక గంజాయి సాగు, అమ్మకాలు, వినియోగంపై ఉక్కుపాదం మోపుతోందని హోంమంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. శాసమండలిలో గురువారం వైసీపీ సభ్యుల ప్రశ్నలకు హోంమంత్రి అనిత సమాధానమిస్తూ.. గంజాయిపై ఉక్కు పాదం మోపుతామని చెప్పినట్లుగానే ఆ విషయంలో ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోందన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గంజాయి నియంత్రణ కోసం ఈగల్ వ్యవస్థను ఏర్పాటు చేశామన్నారు. గత ప్రభుత్వంలో సీఎం ఇంటి దగ్గరే గంజాయి తాగి యువతిపై అత్యాచారం చేస్తే కనీసం స్పందించలేదని, ఏళ్లు గడిచినా నిందితులను అరెస్ట్ చేయలేకపోయారని విమర్శించారు. వైసీపీ హయాంలో దేశంలో ఎక్కడ గంజాయి దొరికినా దాని మూలాలు ఏపీలోనే ఉండేవన్నారు. గంజాయి నిర్మూలనలో భాగంగా తొలుత గంజాయి సాగును అడ్డుకుంటున్నామన్నారు. ఎక్కడికక్కడ గంజాయి తోటలను ధ్వసం చేస్తున్నామన్నారు. డ్రోన్ కార్పొరేషన్ సహకారంతో డ్రోన్‌ల వాడకం తీసుకొచ్చామని తెలిపారు.
డ్రోన్ వస్తే పోలీసులు వస్తారని అనేక ప్రాంతాల్లో స్వయంగా గంజాయి పండిస్తున్న వాళ్లే ధ్వంసం చేసుకుంటున్న పరిస్థితులు ఉన్నాయన్నారు. గంజాయి సాగు 90 శాతం వరకు తగ్గిపోయిందని తెలిపారు. నార్కోటిక్ చట్టం ప్రకారం సాగు చేసినా, అమ్మినా, వినియోగించినా కఠినమైన శిక్షలు ఉంటాయన్నారు. అనేక మంది వెనుకబడిన వర్గాల పిల్లలు ఈ కేసుల్లో ఇరుక్కున్న మాట వాస్తవమన్నారు. అన్ని డిపార్ట్‌మెంట్లలో గంజాయి నియంత్రణపై కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. గంజాయి నియంత్రణలో భాగంగా విక్రేతల ఆస్తులు జప్తు కూడా చేస్తున్నామని తెలిపారు.
గంజాయికి అలవాటు పడిన వారిని, మత్తు పదార్థాలకు బానిసలైన వారిని డీ అడిషన్ సెంటర్లకు పంపిస్తున్నామన్నారు. ఏపీలో సాగు తగ్గిన తర్వాత ఒడిశా నుంచి ఏపీకి ఎక్కువగా రవాణా అవుతోందన్నారు. ఒడిశా నుంచి వస్తున్న 70 వేల కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని ధ్వంసం చేశామన్నారు. ఈ విషయంలో ఒడిశా ప్రభుత్వంతో ఒక సమన్వయ సమావేశం ఏర్పాటు చేశామని తెలిపారు. తెలంగాణ, తమిళనాడు ప్రభుత్వాలతో కూడా కోఆర్డినేషన్ మీటింగులు ఏర్పాటు చేస్తున్నామని హోంమంత్రి అనిత తెలిపారు.