- చంద్రబాబు పాలనలోనే మహిళలకు మేలు
- అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో మంత్రి రామానాయుడు
- ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా కార్యక్రమం
పాలకొల్లు (చైతన్యరథం): మహిళా సాధికారతతోనే సమాజాభివృద్ధి సాధ్యమని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు లైన్స్ కమ్యూనిటీ హాల్లో శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ముందుగా ఫౌండేషన్ చైర్మన్, మంత్రి రామానాయుడు కేక్ కోసి మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. సమాజంలో వివిధ రంగాల్లో రాణిస్తున్న కాకినాడ జిల్లా పెద్దాపురం ఆర్డీవో కట్రెడ్డి రమణి, ఎలమంచిలి ఎంపీడీవో నందిపాటి ప్రేమాన్విత, మహిళా కమిషన్ సభ్యురాలు డాక్టర్ సిరిగినీడి రాజ్యలక్ష్మితో పాటు వందమందికి పైగా మహిళలను సత్కరించి చీరలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి రామానాయుడు మాట్లాడుతూ ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో గత 20 సంవత్సరాలుగా మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నామని తెలిపారు. సమాజంలో మహిళలకు చదువు, సమాన అవకాశాలు, స్వయం సంపాదన, ఆర్థిక పరిపుష్టి ఉన్ననాడే అసలైన అభ్యుదయం సాధించినట్లవుతుందన్నారు.
గతంతో పోలిస్తే అన్ని రంగాల్లోనూ నేడు మహిళా భాగస్వామ్యం పెరిగిందన్నారు.ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఆడపడుచులను. గౌరవించిన ఘనత, కీర్తి తెలుగుదేశం పార్టీకే దక్కుతుందన్నారు. 80వ దశకంలో అన్న ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆడపడుచులకు అగ్ర తాంబూలం ఇచ్చారన్నారు. అందులో భాగంగానే ఆడపడుచులకు ఆస్తిలో సమాన హక్కు కల్పించారని మంత్రి తెలిపారు. నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఏర్పడ్డ ఎన్డీఏ ప్రభుత్వం మహిళా, శిశు సంక్షేమానికి రూ 4,332 కోట్లు కేటాయించిందన్నారు. విద్య, ఉద్యోగ అవకాశాలు, స్థానిక పదవుల్లో రిజర్వేషన్ కల్పించడం, చట్టసభల్లో తగురీతిలో ప్రాతినిధ్యం కల్పించి గౌరవించడం వంటి ఎన్నో గొప్ప కార్యక్రమాలు టీడీపీ ప్రభుత్వాల హయాంలోనే జరిగాయన్నారు. స్వయం సహాయక సంఘాల ఏర్పాటు ద్వారా మహిళలకు స్వయం ఉపాధి కల్పించి వారిని ఆర్థికంగా నిలదొక్కుకునేటట్టు చేసిన ఘనత మన ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. ఆడపిల్లలకు విద్యా ఉద్యోగ అవకాశాలు అధిక శాతం కల్పించడం, ఔత్సాహిక యువతులకు పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు ప్రోత్సాహం ఇవ్వటం వంటి ఎన్నో అవకాశాలు కూటమి ప్రభుత్వం కల్పిస్తోందని మంత్రి రామానాయుడు తెలిపారు. ఈ అవకాశాలన్నిటినీ అందిపుచ్చుకుని మహిళలు గొప్పగా ఎదగాలని కోరుకుంటున్నానన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు మాట్లాడారు.