- ఆస్తులు పోయినా, ఊపిరి ఆగినా.. పార్టీ జెండా వదల్లేదు
- నాయకులు మారినా కార్యకర్తలు ఉక్కు సంకల్పం చూపారు
- తెదేపా శ్రేణులను వైసీపీ ప్రభుత్వం వేధించిన విషయం మరువద్దు
- ప్రాణాలకు తెగించిన కార్యకర్తల పోరాటాన్ని విస్మరించలేం
- అభివృద్ధికి పునాదులవుతున్న క్యాడర్నఅ కాదని వైసీపీకి పనులు చేయాలా?
- సంక్షేమ పథకాలను అందరికీ అందిస్తా..
- పనులు, గౌరవం మాత్రం కార్యకర్తలకే ఇస్తాం
- ధనానికో, కులానికో లొంగితే.. వాళ్ల మనోభావాలు దెబ్బతింటాయి
- మార్కాపురాన్ని జిల్లా చేస్తా.. వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తా
- అభివృద్ధి చేసి చూపిస్తే.. శాశ్వతంగా ఎందుకు గెలవకూడదు?
- కార్యకర్తల సమీక్షా సమావేశంలో జాతీయాధ్యక్షుడు చంద్రబాబు పిలుపు
మార్కాపుం (చైతన్య రథం): ఆస్తులుపోయినా కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ జెండాను 43ఏళ్లుగా భుజాన మోస్తున్నారని టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రశంసించారు. నాయకులు మారినా కార్యకర్తలు ఉక్కు సంకల్పంతో పార్టీతోనే ఉన్నారని అభినందించారు. ఇబ్బందిపెడితే చెల్లాచెదురవుతామని మొన్నటి ఎన్నికల్లో ప్రత్యర్థులు చాలా ప్రయత్నాలు చేశారని, అయినా ధైర్యంగా నిలబడి చరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా 57శాతం ఓట్లతో 93శాతం స్ట్రైక్ రేట్‌తో పార్టీని అధికారంలోకి తెచ్చారని ప్రశంసించారు. పార్టీ విజయం వెనక కార్యకర్తల కష్టం ఉందన్నారు. మార్కాపురంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో పాల్గొనేందుకు వెళ్లిన సీఎం చంద్రబాబు, అనంతరం నియోజకవర్గ కార్యకర్తలతో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు.
వెలుగొండను పూర్తి చేస్తా… మార్కాపురాన్ని జిల్లా చేస్తా
మార్కాపురం నియోజకర్గం టీడీపీకి ఏకపక్షంగా గెలిచే నియోజకవర్గం కాదు. ఒకసారి గెలుస్తున్నాం. మరోసారి ఓడిపోతున్నాం. అలాకాకుండా ప్రతిసారీ గెలుచుకునేలా నియోజకవర్గాన్ని మలచుకునే అవకాశం మీ చేతుల్లో, ఎమ్మెల్యే చేతుల్లోనే ఉంది. మార్కాపురాన్ని జిల్లా చేస్తా. వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తా. ఆ అవకాశం నాకు భగవంతుడు కల్పించాడు. పోలవరం నుంచి నీళ్లు బనకచర్లకు తీసుకొస్తాం. కృష్ణా నీళ్లు, గోదావరి నీళ్లు తీసుకునే అవకాశం ఒక్క వెలుగొండకే ఉంది. ఇన్ని మంచిపనులు చేసినప్పుడు మార్కాపురంలో శాశ్వతంగా ఎందుకు గెలవకూడదు? ఎందుకు గెలవలేం’ అని పార్టీ శ్రేణులకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.
ప్రజాసమస్యల పరిష్కారానికి రాజకీయాల్లోకి రావాలి
‘పర్యటనలకు వెళ్లిన సమయంలో పార్టీ కార్యకర్తలతో సమావేశమవ్వాలని నిర్ణయించుకున్నాను. మొన్న జీడీ నెల్లూరులో ఇప్పుడు మీతో సమావేశయ్యాను. అందరికీ పార్టీనే సుప్రీం. పార్టీ చేసిన నిర్ణయాన్ని రాష్ట్రస్థాయి నుంచి గ్రామస్థాయి నాయకత్వం వరకు పాటించాలి. గతంలో ఎన్నోపార్టీలు వచ్చాయి, కనుమరుగయ్యాయి. కానీ 43 ఏళ్ల ప్రస్థానంలో ఎన్నో ఒడిదుడుకులను తట్టుకుని టీడీపీ నిలబడిరది. ఇలాంటి గౌరవం ఏ పార్టీకీ దక్కదు. కేంద్రంలో మూడుసార్లు ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా వ్యవహరించాం. ఒక ప్రాంతీయ పార్టీకి అధినేతగా ఉండి ఎన్టీఆర్ దేశ రాజకీయాలను శాసించారు. రాజకీయాల్లోకి తిట్టుకోవడానికి, దూషించుకోవడానికి రాకూడదు. పాలనలో పోటీపడి ప్రజా సమస్యలు పరిష్కరించి జీవనప్రమాణాలు పెంచడానికి పని చేయాలి. పార్టీ శ్రేణులను గత ప్రభుత్వం శత్రువుల మాదిరి వేధించింది. ఎవరు తప్పు చేసిన ప్రజాకోర్టులో దోషులుగా నిలబడతారనేదానికి మొన్నటి ఎన్నికలే నిదర్శనం’ అని చంద్రబాబు ఉద్బోధించారు.
ప్రభుత్వ కార్యక్రమాలపై అవగాహన అవసరం
2024 ఎన్నికల సమయంలో నేను వేసిన ప్రతి అడుగూ పార్టీ సునాయాసంగా గెలవాడానికి పని చేసింది. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రం కష్టాలనుంచి అధిగమించాలంటే కేంద్రం మద్ధతు ఉండాలని నిర్ణయించుకున్నాం. నేను, పవన్‌కళ్యాణ్ వెంటిలేటర్‌పై ఉన్న రాష్ట్రాన్ని కేంద్రం సాయంతో ఊపిరి తీసుకునేలా చేశాం. ఇంకా పూర్తిగా కోలుకోలేదు. గత ప్రభుత్వం రూ.10 లక్షల కోట్ల అప్పు, రూ.1.15 లక్షల కోట్ల బకాయిలు పెట్టి వెళ్లింది. అప్పులు తీర్చాలి. వాటికి వడ్డీలు చెల్లించాలి. 9 నెలలుగా రేయింబవళ్లు కష్టపడితే నెలకు జీతాలు, పెన్షన్లు ఇవ్వగలుగుతున్నాం. ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలపై శ్రేణులు అవగాహన పెంచుకోవాలి. ఎన్నికలు వస్తూనే ఉంటాయి. ఏ ఎన్నికలో గెలవకపోయినా పరపతి తగ్గిపోయిందని ఎదుటివాళ్ల అసత్య ప్రచారం చేస్తారు. పట్టభద్రుల ఎన్నికల్లో ఎప్పుడూ పోటీ చేయలేదు. 2023లో పోటీ చేసిన 3 స్థానాల్లో విజయం సాధించాం. ఆ ప్రభావం 2024 ఎన్నికల్లో బలంగా చూపించింది. మొన్నటి ఎన్నికల్లో మేం వేసిన ప్రతి అడుగూ కలిసొచ్చింది’ అని చంద్రబాబు కార్యకర్తకు వివరించారు.
నాయకులు పార్టీ మారినా కార్యకర్తలు సంకల్పంతో ఉన్నారు
‘2004, 2019లో గెలిచి ఉంటే రాష్ట్ర స్థితిగతులు మరోలా ఉండేవి. ఆ రెండు ఎన్నికల్లో అతి విశ్వాసంతోనే ఓడిపోయాం. మీ శరీరంలో ప్రతి రక్తంబొట్టు పసుపురంగుగానే ఉంటుంది. నరనరాల్లో పార్టీపై గౌరవం, సిద్ధాంతాలు జీర్ణించుకుపోయాయి. నాయకులు పార్టీమారినా నా కార్యకర్తలు మాత్రం అడుగు కదపకుండా ఉక్కు సంకల్పంతో ఉంటారు. ప్రజలు మన గురించి ఏం ఆలోచిస్తున్నారో అంచనా వేసుకోవాలి. బీజేపీపాలిత రాష్ట్రాల్లో 2029 ఎన్నికల గురించి ఇప్పటి నుంచే ఆలోచిస్తారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అనివార్యం. ప్రజలు మనతో ఉంటే ఏమైనా చేయొచ్చు. లేదంటే ఇబ్బందులు పడతాం. ప్రజల సమస్యలు పరిష్కారంలో నాయకులు అప్రమత్తంగా ఉండాలి. అప్పజెప్పిన పనులు సమర్థవంతంగా చేసేవారిని పైకి తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటాను.’ అని చంద్రబాబు ప్రకటించారు.
నా చుట్టూ తిరిగితే పదవులు రావు
పార్టీపై విశ్వాసంతో కోటిమంది సభ్యులయ్యారు. టెలీకాన్ఫరెన్స్ ద్వారా కూడా మీతో మాట్లాడొచ్చు. కానీ ఆ ఆప్యాయత, అనుబంధం కనబడదు. మిమ్మల్ని ఎదురుగా చూస్తూ మాట్లాడుతుంటే నాకు సంతోషంగా ఉంటుంది. బీసీలు, మాదిగలు, బలహీన వర్గాలకు ప్రాధాన్యతనిచ్చి పైకి తీసుకొచ్చింది టీడీపీనే. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనాలి. నా చుట్టూ తిరిగితే పదవులు రావు. మొహమాటం లేకుండా చెప్తున్నా. క్షేత్రస్థాయిలో పనిచేసి ఫలితాలు సాధించే వారిని నేరుగా గుర్తు పెట్టుకుంటా. త్వరలో వాట్సాప్ విధానం తీసుకొస్తాం. అందులో ఎమ్మెల్యే, ఎంపీకాకుండా నేరుగా పార్టీకి పనిచేసిన వారు కూడా మీ ప్రొఫైల్ గురించి చెప్పుకోవచ్చు. నిర్ణయం మాత్రం పార్టీ అధ్యక్షుడిగా, కుటుంబ పెద్దగా నాదే ఉంటుంది. నాయకులు మీ కుటుంబం, బంధువులను చూసుకుంటే నిజమైన కార్యకర్తలను ఎవరు చూసుకుంటారు?’ అని చంద్రబాబు ప్రశ్నించారు.
కార్యకర్తల మనోభావాలు దెబ్బతీయొద్దు
‘వైసీపీ నేతలతో లాలూచీ పడితే ఊరుకునేది లేదని ఇటీవలే చెప్పాను. దీనికి వైసీపీ వాళ్లు గింజుకుంటున్నారు. మీ పార్టీతో మా పార్టీ నేతలు లాలూచీ పడాలా? ప్రాణాలు పోగొట్టుకున్న మా కార్యకర్తలకు కాకుండా మీకు పనులు చేయాలా? లాలూచీ పడేవారిని సహించను. ధనానికో, కులానికో లొంగి వైసీపీకి పనిచేస్తే నిజమైన కార్యకర్త మనోభావాలు దెబ్బతింటాయి. ఎన్డీయే కార్యకర్తలకు పనులు చేయండి. మూడు పార్టీలు కలిసుండాలి. టీడీపీ, జనసేన, బీజేపీ శాశ్వతంగా కలిసుండి రాష్ట్రాన్ని నెంబర్ వన్‌గా తయారు చేస్తుంది. ఎమ్మెల్యే, ఎంపీ నాయకత్వంపై అభిప్రాయం ఏమిటో నివేదిక తెప్పించుకుంటాను. వన్‌టైం ఎమ్మెల్యేగా ఉండాలనుకుంటే ఒకసారి చెప్తా. మారకపోతే నిర్ణయాలు తీసుకుంటాను’ అని పార్టీ జాతీయాధ్యక్షు చంద్రబాబు పార్టీ నేతలను హెచ్చరించారు.