- ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థన
- కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి
అమరావతి (చైతన్యరథం): తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన గాయకుడు గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ (76) తిరుపతిలోని తన స్వగృహంలో ఆదివారం గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతిపట్ల సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 1978 నుండి 2006 వరకు టీటీడీలో ఆస్థాన గాయకుడిగా పనిచేసిన గరిమెళ్ళ 600లకు పైగా అన్నమాచార్య సంకీర్తనలకు స్వరకల్పన చేసిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. సంప్రదాయ కర్ణాటక, జానపద, లలిత సంగీతంలోనూ ప్రావీణ్యత కలిగిన గరిమెళ్ల, తిరుమల శ్రీవారి సేవలో తరించారు. తన మధుర గాత్రంతో శ్రీవేంకటేశ్వరుని కృపా కటాక్షాలకు పాత్రుడయ్యారు.. అలాంటి మహనీయుడు మనల్ని వదిలి వెళ్ళడం బాధాకరం. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూర్చాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నానంటూ ఆయన కుటుంబ సభ్యులకు సీఎం చంద్రబాబు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
సంగీత ప్రపంచానికి తీరని లోటు: మంత్రి లోకేష్
తిరుమల, తిరుపతి దేవస్థానం ఆస్థాన గాయకుడు శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ మృతి చెందారన్న వార్త ఎంతో బాధ కలిగించిందని విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేష్ విచారం వ్యక్తం చేశారు. సాంప్రదాయ కర్ణాటక సంగీతం, లలిత సంగీతం, జానపద సంగీతంలో తమదైన ముద్ర వేసిన గరిమెళ్ళ మృతి సంగీత ప్రపంచానికి తీరని లోటుగా అభివర్ణించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నానన్నారు.
వందలాది అన్నమాచార్య సంకీర్తనలకు స్వర కల్పన చేసిన గరిమెళ్ల.. ప్రముఖ సంగీత విద్వాంసుడిగా ప్రఖ్యాతిగాంచారు. వినరో భాగ్యము విష్ణుకథ, జగడపు చనువుల జాజర, పిడికిట తలంబ్రాల పెండ్లికూతురు.. లాంటి పలు కీర్తనలకు ఆయనే స్వరాలు సమకూర్చారు. సంప్రదాయ కర్ణాటక, లలిత, జానపద సంగీతంలోనూ ఆయన ప్రసిద్ధులు. ఈ శుక్రవారమే యాదగిరిగుట్టలోనూ గరిమెళ్ల తన ప్రదర్శనతో ఆహూతులను అలరించారు. ఇంతలోనే ఆయన మరణవార్త తెలిసి సంగీత ప్రియులు విచారం వ్యక్తం చేస్తున్నారు.
గరిమెళ్ల మృతిపై తితిదే చైర్మన్ బీఆర్ నాయుడు విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన మరణం సంప్రదాయ సంగీత ప్రపంచానికి తీరని లోటన్నారు. తితిదే ఆస్థాన విద్వాంసుడిగా ఆయన విశేష సేవలందించారని గుర్తు చేసుకున్నారు.