- మహిళల ఆర్థిక ఉన్నతికి సీఎం చంద్రబాబు ప్రాధాన్యం
- మగువల రక్షణకు శక్తి యాప్ రూపకల్పన
- ఆడ బిడ్డల పట్ల వివక్ష చూపొద్దు
- బీసీ సంక్షేమశాఖ మంత్రి సవిత స్పష్టీకరణ
- రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షురాలు జయశ్రీ, మహిళా విభాగం అధ్యక్షురాలు వావిలాల సరళాదేవి ప్రమాణ స్వీకారం
మంగళగిరి (చైతన్యరథం): మహిళల ఆర్థిక వృద్ధితోనే సమాజాభివృద్ధి సాధ్యమని గ్రహించిన తమ ప్రభుత్వం వారిని పారిశ్రామిక వేత్తలుగా తీర్చదిద్దడమే లక్ష్యంగా పెట్టుకుందని, ప్రతి ఇంటిని నుంచి ఓ మహిళను పారిశ్రామిక వేత్తగా తయారుచేసేలా పథకాలు అమలు చేస్తున్నామని రాష్ట్ర బీసీ, ఈబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖల మంత్రి ఎస్.సవిత తెలిపారు. రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మంగళగిరి పట్టణంలోని ఓ ప్రైవేటు కల్యాణమండపంలో ఆదివారం నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘ గౌరవాధ్యక్షురాలు, మహిళా అధ్యక్షురాలి ప్రమాణస్వీకార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సవిత మాట్లాడుతూ, మహిళల అభ్యున్నతికి దివంగత ఎన్టీఆర్ మాదిరిగానే సీఎం చంద్రబాబు అధిక ప్రాధాన్యతనిస్తున్నారన్నారు. మహిళలతోనే అభివృద్ధి సాధ్యమని నమ్మిన అన్న ఎన్టీఆర్ రాష్ట్రంలో మొదటి సారిగా మహిళా యూనివర్శిటీని ప్రారంభించారన్నారు. మహిళలకు పురుషులతో సమానంగా ఆస్తిలో సగ భాగం హక్కు కల్పించారన్నారు. సీఎం చంద్రబాబు సైతం తన పాలనలో మహిళలకు వెన్నుదన్నుగా నిలిచారన్నారు. విద్యా, ఉద్యోగావకాశాల్లో 33.33 శాతం రిజర్వేషన్లు కల్పించారన్నారు. రాజకీయాల్లోనూ వారికి ప్రాధాన్యమిచ్చారన్నారు. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా భరోసా ఇస్తూ పథకాలు రూపకల్పన చేశారన్నారు. డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేసి, మహిళలకు ఆర్థిక స్వాతంత్య్రం కల్పించారు. దీపం పథకానికి శ్రీకారం చూట్టారన్నారు. ప్రస్తుత క్యాబినెట్‌లో ముగ్గురు మహిళలకు కీలక శాఖల బాధ్యతలు అప్పగించారన్నారు. త్వరలో నిర్వహించబోయే మెగా డీఎస్సీలో మహిళలకు టీచర్ పోస్టులు లభించేలా ఉచిత ఆన్ లైన్ డీఎస్సీ కోచింగ్ ప్రారంభించబోతున్నారు. ఈ కోచింగ్ వల్ల ఇంటి వద్ద ఉండే పరీక్షలకు సన్నద్ధమయ్యే మహిళలకు ఎంతో ఉపయోగం కలుగుతుందన్నారు. మహిళల రక్షణకు సీఎం చంద్రబాబు పెద్దపీట వేస్తూ, శక్తి యాప్ రూపొందించారన్నారు.
ఆడ బిడ్డల పట్ల వివక్ష చూపొద్దు
ఆడబిడ్డల పట్ల నిర్లక్ష్య ధోరణి, వివక్ష సరికాదని మంత్రి సవిత తెలిపారు. మగ పిల్లలతో సమానంగా ఆడ బిడ్డలకు అన్ని అవకాశలూ కల్పించాలన్నారు. అదే సమయంలో తోటి మహిళలతో గౌరవప్రదంగా మెలిగేలా మగపిల్లలకు సరైన నడవడిక నేర్పాలన్నారు. ఆడ బిడ్డల విద్యను ప్రోత్సహించాలన్నారు. ప్రభుత్వం ఎన్ని అవకాశాలు, పథకాలు కల్పించినా ప్రజల నుంచి బాలికా విద్యకు, ఉన్నతికి ప్రోత్సహం ఉంటేనే ఫలితం ఉంటుందన్నారు. రాష్ట్రపతి, కేంద్ర ఆర్థిక మంత్రి, ఐఏఎస్‌లు, ఐపీఎస్ లుగా ఎందరో మహిళలు సత్తా చాటుతున్నారన్నారు.
క్రీడాకారిణులకు సన్మానం
జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పవర్ లిఫ్టింగ్ లో సత్తా చాటుతున్న క్రీడాకారిణులను మంత్రి సవిత సన్మానించారు. ఘట్టమనేని సాయిరేవతి, చంద్రిక, ఎస్కే సాదియం అల్మాస్‌ను మంత్రి ఘనంగా సత్కరించారు. ముగ్గురు గర్బిణులకు కూడా శీమంతం నిర్వహించి, నూతన వస్త్రాలు, పండ్లు, స్వీట్లు అందజేశారు. గురుకులాల కార్యదర్శి మాధవీలత మాట్లాడుతూ, పిల్లల పెంపకంలో వివక్ష చూపొద్దన్నారు.
అంతకుముందు రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షురాలుగా జయశ్రీ, మహిళా విభాగం అధ్యక్షురాలిగా వావిలాల సరళాదేవి…మంత్రి సవిత సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. వారికి మంత్రి సహా పలువురు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకరరావు, సభ్యులు కుమ్మరి క్రాంతి కుమార్, తిరువీధుల కిరణ్, పాలేపల్లి మహేష్, స్వాతి గౌడ్, తదితరులు పాల్గొన్నారు.