- ఐటీబీ బెర్లిన్ సదస్సులో మంత్రి కందుల దుర్గేష్
- పర్యాటకాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపు
- రెండోరోజూ తన బృందంతో జర్మనీ పర్యటనలో బిజీ బిజీ
- భారత రాయబారితో కలిసి వరల్డ్ మీడియా కాన్ఫరెన్స్
- ప్రపంచ దిగ్గజ సంస్థల ప్రతినిధులతో ప్రత్యేక భేటీ
అమరావతి(చైతన్యరథం): ప్రపంచ పర్యాటకుల గమ్యస్థానంగా ఏపీని తీర్చిదిద్దేందు కు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. జర్మనీ పర్యటనలో ఉన్న ఆయన ప్రముఖ ప్రయాణ వాణిజ్య ప్రదర్శన ఐటీబీ బెర్లిన్ 2025లో పాల్గొన్నారు. రెండోరోజూ తన బృందంతో పెట్టుబడుల కోసం విస్తృత ప్రయత్నాలు చేస్తున్నారు. మంత్రితో పాటు టూరిజం ఎండీ ఆమ్రపాలి విరామం లేకుండా వివిధ పారిశ్రామిక వేత్తలతో సమావేశమయ్యారు. పర్యాటకంలో అనుకూలమైన వాతావరణం, ప్రయాణ, ఆతిథ్యరంగంలో ఉన్న అవకాశా లను వివరించారు. ఏపీ ప్రభుత్వం వ్యాపారాన్ని సులభతరం చేయడానికి కట్టుబడి ఉం దని తెలిపారు. పెట్టుబడులు పెట్టి పర్యాటకాభివృద్ధిలో భాగస్వాములు కావాలని ప్రపంచ దిగ్గజ సంస్థల ప్రతినిధులకు ఆహ్వానం పలికారు. అనంతరం ఏపీ పర్యాటకాభివృద్ధికి ఉన్న అవకాశాలు, వనరులు, పర్యాటక రంగానికి పరిశ్రమ హోదా కల్పన, నూతన పర్యాటక పాలసీ విధి విధానాలపై జర్మనీలోని భారత రాయబారి హెచ్.ఈ అజిత్ గుప్తేతో కలిసి వరల్డ్ మీడియా ప్రతినిధుల సమక్షంలో పలు అంశాలను వెల్లడిరచారు. స్థిరమైన, సాంకేతికత ఆధారిత పర్యాటక అభివృద్ధికి అపారమైన సామర్థ్యంతో అభివృద్ధి చెందుతున్న పర్యాటక కేంద్రంగా ఏపీని పేర్కొన్నారు.
అంతర్జాతీయ పర్యాటకులకు ఆకర్షించే 1000 కి.మీ సుదీర్ఘ విశాల సముద్రతీరం, అందమైన బీచ్‌లు, ఎత్తయిన హిల్ ప్రదేశాలు, విభిన్న ప్రకృతి రమణీయ ప్రాంతాలు, ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు, చారిత్రాత్మక కట్టడాల గురించి వివరించారు. పర్యావరణ పర్యాటకం, బీచ్ టూరిజం, వారసత్వ పర్యా టకం, లగ్జరీ హాస్పిటాలిటీ, స్మార్ట్ టూరిజం, మౌలిక సదుపాయాలలో పెట్టుబడులను ప్రభుత్వం ఆశిస్తుందన్నారు. భవిష్యత్ తరం ప్రయాణికులను ఆకర్షించడానికి ఏపీ ఏఐ-ఆధారిత పర్యాటక అనుభవాలు, డిజిటల్ గైడ్ వ్యవస్థలు, పర్యావరణ అనుకూల రిసా ర్ట్‌లను అభివృద్ధి చేస్తుందని తెలిపారు. సాంకేతికత, ఆవిష్కరణ, స్థిరమైన పద్ధతులను ఉపయోగించడం ద్వారా ఏపీ ప్రపంచ పర్యాటక గమ్యస్థానంగా ఉంచడమే తమ దార్శనికతగా పేర్కొన్నారు. అంతర్జాతీయ విమానాశ్రయాలు, ఓడరేవులు, హై-స్పీడ్ రోడ్ నెట్‌వర్క్‌లు ఏపీని ప్రపంచ పర్యాటకులకు గమ్యస్థానంగా చేరుస్తాయని ఆకాంక్షించారు. ఐటీబీ బెర్లిన్ సదస్సు సందర్భంగా గ్లోబల్ సహకారం, ఎంఓయూలు, డిజిటల్ టూరిజం, ఆతిథ్య పెట్టుబడులు, స్థిరమైన ప్రయాణ కార్యక్రమాలలో భాగస్వామ్యాల కోసం ఏపీ ప్రతినిధి బృందం యూరోపియన్ టూరిజం బోర్డులు, ప్రపంచ పెట్టుబడిదారులు, సాంకే తిక సంస్థలతో నిమగ్నమై ఉందన్నారు.
అంతర్జాతీయ పర్యాటకులకు ప్రధాన ప్రయాణ గమ్యస్థానంగా ఏపీని ప్రోత్సహించడానికి కీలక వాటాదారులతో అవగాహన ఒప్పందాల గురించి కూడా మంత్రి చర్చించారు. పన్ను ప్రయోజనాలు, భూమి కేటాయింపులలో సబ్సిడీలు, పర్యాటక పెట్టుబడులకు ఫాస్ట్‌ట్రాక్ అనుమతులను అందిస్తుందన్నారు. బీచ్ రిసార్ట్‌లు, హెరిటేజ్ కారిడార్ అభివృద్ధి, అడ్వెంచర్ టూరిజం హబ్‌లు లాభదాయకమైన అవకాశాలను అందిస్తాయని సూచించారు. దక్షిణ భారతదేశ పర్యాటకానికి ఏపీ ముఖ ద్వారమని వెల్లడిస్తూ అంతర్జాతీయ పర్యాటక పెట్టుబడులకు గమ్యస్థానంగా ఏపీని తీర్చి దిద్దేందుకు బెర్లిన్ సదస్సు ఉపకరిస్తుందని భావిస్తున్నామన్నారు. ప్రపంచ ప్రఖ్యాత తిరు మల వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఉందని, అత్యధిక పర్యాటకులు సందర్శించిన ప్రదే శంగా నిలిచిందని తెలిపారు. ఏపీలో అమరావతి, నాగార్జున కొండ లాంటి బుద్ధిజానికి ప్రతీకగా నిలిచిన అనేక ప్రదేశాలున్నాయని పేర్కొన్నారు. ఏపీలో రుషికొండ, రామకృష్ణ, మైపాడు, సూర్యలంక తదితర అందమైన బీచ్‌లు, లగ్జరీ రిసార్ట్స్, వెల్‌నెస్ కేంద్రాలు, సాహస, ఎకో పర్యాటక అభివృద్ధికి ఏపీలో అద్భుతమైన వనరులున్నాయని పేర్కొన్నారు. గ్రామీణ పర్యాటకాభివృద్ధిపై ప్రత్యేక దృష్టిసారించినట్లు వివరించారు. గిరిజనుల జీవన విధానాన్ని కళ్లకు కట్టినట్లు చూపించే అరకు వ్యాలీ ప్రధాన పర్యాటక కేంద్రంగా ఉందని తెలిపారు. పర్యాటక ప్రాంతాల్లో పరిశుభ్రతకు పెద్దపీట వేస్తున్నామని తెలిపారు.