అమరావతి (చైన్యరథం): సాయి సాధన చిట్‌ఫండ్స్ బాధితులకు న్యాయం చేస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ మేరకు సోమవారం రాత్రి ఎక్స్‌లో సీఎం చంద్రబాబు పోస్ట్ చేశారు. నరసరావుపేటకు చెందిన సాయి సాధన చిట్‌ఫండ్స్ బాధితులు సీఎం చంద్రబాబును కలిసేందుకు సోమవారం ఆయన నివాసానికి తరలివచ్చారు. సచివాలయం నుండి నివాసానికి వెళుతున్న సీఎం చంద్రబాబు.. బాధితులను చూసి కాన్వాయ్ ఆపి, వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రూ.250 కోట్లకుపైగా మోసపోయినట్లు సీఎం చంద్రబాబుకు బాధితులు తెలిపారు. 600 కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. 40 రోజుల క్రితమే చిట్‌ఫండ్ యజమాని కోర్టులో లొంగిపోయారని, న్యాయం చేయాలంటూ చంద్రబాబుకు మొర పెట్టుకున్నారు. 10 నిమిషాలపాటు బాధితుల సమస్యలు విన్న చంద్రబాబు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
అనంతరం దీనిపై ఎక్స్‌లో సీఎం చంద్రబాబు పోస్ట్ చేస్తూ.. సచివాలయం నుంచి ఇంటికి వెళుతున్న సమయంలో ఉండవల్లి నివాసం వద్దకు తరలివచ్చిన చిట్ ఫండ్ బాధితుల సమస్యలు విన్నాను. కష్టపడి సంపాదించుకుని దాచుకున్న మొత్తాన్ని చిట్ ఫండ్ యాజమాన్యం చేసిన మోసం కారణంగా పోగొట్టుకున్నామని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పాను. ప్రభుత్వపరంగా తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుని…. వారికి న్యాయం చేస్తానని హామీ ఇచ్చానని సీఎం చంద్రబాబు తెలిపారు..